వైసీపీలో అసంతృప్తి సెగలు

  • Published By: sreehari ,Published On : December 24, 2019 / 03:09 PM IST
వైసీపీలో అసంతృప్తి సెగలు

సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం కలిగిన తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అధిష్టానంపై అసంతృప్తితో రగిలిపోతున్నారట. తొమ్మిదేళ్ల పాటు పార్టీ జెండా మోసిన నాయకులు, కార్యకర్తలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పక్కన పెట్టారని ఫీలవుతున్నారట. అభివృద్ధి కార్యక్రమాల మాట ఎలాగున్నా సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా ద్వితీయ శ్రేణి నేతల మాట చెల్లుబాటు కాకపోవడంతో అధికారులపై తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారని అంటున్నారు. 

గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు చెప్పిందే వేదం, చేసిందే చట్టంలా ఉంటే దాని స్థానంలో ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ మాత్రం అందుకు భిన్నంగా ఉందంటున్నారు. వాలంటీర్లకు జీతం ఇవ్వడం వల్ల హర్షం వ్యక్తం చేస్తున్నా క్షేత్ర స్థాయిలో సంక్షేమ పథకాల అమలు విషయంలో వారి చేతుల్లో ఏమీ లేకపోవడంపై బంధువులకు సైతం ఏమీ చేయలేకపోతున్నారట.

అధికారులు మాత్రం వాలంటీర్లకు ఉన్నది ఉన్నట్లు రాసుకుంటూ వెళ్లిపోండి.. ఎవరైనా ప్రశ్నిస్తే మండల స్థాయి అధికారుల దగ్గరకు పంపించండని చెబుతున్నారట. తీరా మండల స్థాయి అధికారుల వద్దకు వెళ్లేసరికి మీ నాయకుడు పెట్టిన నిబంధనలకు తామేం ఏం చేస్తామంటున్నారట. 

గ్రామ స్థాయి నాయకుల్లో భయం :
రానున్నది స్థానిక సంస్థల ఎన్నికల కాలం కాబట్టి ఏం చేయాలో ద్వితీయ శ్రేణి నాయకులకు పాలుపోవడం లేదట. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే గ్రామ సచివాలయ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమలు జరిగితే తమ పరిస్థితి ఏంటని ఎమ్మెల్యేల వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల వరకు సంక్షేమ పథకాల్లో కోత ఉండదని చెప్పినా అంతా ఆన్‌లైన్ అయితే కచ్చితంగా ఎంతో కొంత ఇబ్బంది ఉంటుందని గ్రామ స్థాయి నాయకులు భయపడుతున్నారట. 

అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అవకాశం లభించకపోవడంతో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు కూడా తీవ్ర అంసతృప్తితో రగిలిపోతున్నారట. చిన్నా చితక పనులు, కాంట్రాక్టులు లభిస్తే ఏదో ఎన్నికల ఖర్చు ఒడ్డెక్కుతుందని భావించిన నాయకులకు ఆ పనులు దక్కకపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారని అనుకుంటున్నారు. గతంలో పార్టీ జెండాలు మోసిన తాము ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ల చుట్టూ తిరగడానికి తప్ప మరేమీ ఉపయోగం లేదని గుసగుస లాడుకుంటున్నారు. 

ఎవరు గెలిపించారో చెప్పండి : 
ఉదయం లేచింది.. మొదలు తెల్లచొక్కా వేసుకుని జై జగన్ అనడం తప్ప తమ చేతుల్లో ఏమీ లేదని తమ అనుచరుల ముందు గోడు వెళ్లబోసుకుంటున్నారట. అలాగే మండల స్థాయి, జిల్లా స్థాయి పనులకు కూడా స్థానిక నాయకులను కాదని రాష్ట్ర నాయకుల మాట అధికారులు వినడంపై కూడా గుస్సా అయిపోతున్నారట.

మొన్న ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి నాయకులు మిమ్మల్ని గెలిపించారా, మేము గెలిపించామా అని కొంతమంది ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారట. గత ప్రభుత్వంలో ద్వితీయ శ్రేణి నాయకులు లాభసాటిగా ఉన్న ఇసుక వ్యాపారం ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత కొంతమందికే ఉపాధిగా మారిందని ఆవేదన చెందుతున్నారట. స్థానిక నాయకులను కాదని రాష్ట్ర నాయకుల కనుసన్నల్లో ఇసుక దందా జరగడంపై చాలా గ్రామాల్లో అసంతృప్తి నెలకొందట. 

వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమే :
ఇదే అసంతృప్తి కొనసాగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కష్టమేనని భయపడుతున్నారట. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని అధిష్టానం వద్దకు తీసుకెళ్లి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కొంత వెసులుబాటు కల్పిస్తే తమ పాట్లు తాము పడతామంటున్నారట. ఇదే విషయాన్ని చాలా మంది మండల స్థాయి నాయకులు ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రుల దృష్టికి తీసుకెళ్ళారట.

కొంతమంది అయితే మంత్రులను సైతం గట్టిగా నిలదీశారంటున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు మాత్రమే అయిందని, కొంత సమయం ఇవ్వాలని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మౌనం వహిస్తున్నారని అనుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ తరుణంలో వాటిని ఎలా నెట్టుకు రావాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారని అంటున్నారు.