తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరి వల్ల 157మందికి కరోనా

  • Published By: naveen ,Published On : June 3, 2020 / 05:37 AM IST
తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరి వల్ల 157మందికి కరోనా

ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు భయపెడుతున్నాయి. మంగళవారానికి(జూన్ 2,2020) జిల్లాలో కేసుల సంఖ్య 303కు చేరినట్లు అధికారులు ప్రకటించారు. కాగా, జిల్లాలో ఒకరి వల్ల 157 మందికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. పెదపూడి మండలం గొల్లల మామిడాడతో పాటు చుట్టుపక్కల వైరస్ పంజా విసురుతోంది. పెదపూడి మండలం గొల్లల మామిడాడలో మే 21న తొలి కరోనా పాజిటివ్ మరణం నమోదైంది. అలా మొదలైన వ్యాప్తి చుట్టుపక్కల మండలలాకు విస్తరించింది. జిల్లాలో ఇప్పటివరకు 303 కేసులు నమోదైతే, ఒక్కరి వల్లే ఇప్పటివరకు 157 కేసులు నమోదయ్యాయి. ఆ గ్రామంలోనే ఈ సూపర్ స్ప్రెడర్(super spreader) దెబ్బకు 117 మంది వైరస్ బారినపడ్డారు.

కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన కలెక్టర్:
దీంతో అప్రమత్తమైన కలెక్టర్ ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి కీలక విభాగాలను అందుబాటులో ఉంచారు. గ్రామం మొత్తాన్ని కంటైన్ మెంట్ ప్రాంతంగా మార్చి రాకపోకలు నిలిపేశారు. ఈ గ్రామంలో 5,300 కుటుంబాలు ఉంటున్నాయి. 21వేల జనాభా నివాసం ఉంటున్నారు. వారంతా భయం భయంగా బతుకుతున్నారు. లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి గ్రామంలో హోటల్ కు అనధికారిక అనుమతులు ఇవ్వడమే వైరస్ వ్యాప్తికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కూలీల్లో వైరస్ బయటపడుతోంది. దీంతో జిల్లాకు వచ్చేవారందరికీ పరీక్షలు చేస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో ఒక వ్యక్తి ద్వారా 150మందికిపైగా వైరస్ వ్యాపించడం ఇదే మొదటిసారి.

గుంటూరులో మరో కోయంబేడు:
గుంటూరులో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. గుంటూరులోని ఓ హోల్ సేల్ కూరగాయల మార్కెట్ ఇప్పుడు కరోనా హాట్ స్పాట్ గా మారింది. దాన్ని మరో కోయంబేడుతో(తమిళనాడులోని కూరగాయల మార్కెట్ ఉన్న ప్రాంతం) పోలుస్తున్నారు. ఆ కూరగాయల మార్కెట్ లో 26మంది వ్యాపారులకు కరోనా సోకింది. ఒకప్పుడు గుంటూరులో హోల్ సేల్ కూరగాయల మార్కెట్ బస్టాండ్ పక్కనే ఉండేది. లాక్ డౌన్ కారణంగా దాన్ని శివార్లలోని ఏటుకూరు బైపాస్ దగ్గరికి తరలించారు. ఇప్పుడు ఆ మార్కెట్ లోని 26 మంది వ్యాపారులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మంగళవారం ఒక్కరోజే 18 మందికి వైరస్ సోకడంతో నగరంలో కలకలం రేగింది. దీంతో మార్కెట్ ను పూర్తిగా మూసివేయించి వ్యాధి నివారణ చర్యలు చేపట్టారు.

రెడ్ జోన్ నుంచి మార్కెట్ కు వచ్చిన వ్యక్తి కారణంగా కరోనా వ్యాప్తి:
ఇక్కడ పెద్ద మొత్తంలో రిటైల్ వ్యాపారులు, వినియోగదారులు కూరగాయలు కొనేవారు. దాంతో ఇది కూడా మరో కోయంబేడు మార్కెట్ లా తయారవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక్కడి మార్కెట్లలో 450 మంది వ్యాపారులున్నారు. వీరందరికీ పరీక్షలు నిర్వహించగా 26 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. నగరంలోని రెడ్ జోన్ లో ఉంటూ నిత్యం మార్కెట్ కు వచ్చే ఓ వ్యాపారికి తొలుత వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని, ఆయన ద్వారానే అందరికీ వ్యాపించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

భారత్‌లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మృతుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. దేశంలో కరోనా కేసులు 2లక్షల మార్క్ దాటాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 217 మంది ప్రాణాలు కోల్పోగా, కొత్తగా 8వేల 909 పాజిటివ్‌ కేసులు నమోదైయినట్లు కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు 2లక్షల 7వేల 615 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 5,815 మంది కరోనాతో చనిపోయారు. 1,00,303 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 1,01,497 మంది చికిత్స పొందుతున్నారు.

* మహారాష్ట్రలో అత్యధికంగా 72వేల 300 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 2,465 మంది మృతి చెందారు. 
* తమిళనాడులో 24,586, ఢిల్లీలో 22,132, గుజరాత్‌లో 17,632, రాజస్థాన్‌లో 9,373, యూపీలో 8,729, మధ్యప్రదేశ్‌లో 8,420, పశ్చిమ బెంగాల్‌లో 6,168, బీహార్‌లో 4,096, కర్ణాటకలో 3,796 కేసులు నమోదయ్యాయి.
* ఏపీలో 3,791, తెలంగాణలో 2,891, జమ్మూకశ్మీర్‌లో 2,718, హర్యానాలో 2,652, పంజాబ్‌లో 2,342, ఒడిశాలో 2,245, అసోంలో 1,562, కేరళలో 1,413, ఉత్తరాఖండ్‌లో 1,043, జార్ఖండ్‌లో 722, ఛత్తీస్‌గఢ్‌లో 564, త్రిపురలో 471, హిమాచల్‌ప్రదేశ్‌లో 345 కేసులు నమోదయ్యాయి.
* ఛండీఘర్‌లో 301, మణిపూర్‌లో 89, లఢక్‌లో 81, గోవాలో 79, నాగాలాండ్‌లో 58, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 33, మేఘలాయలో 30, అరుణాచల్‌ప్రదేశ్‌లో 28, మిజోరాంలో 13, సిక్కింలో ఒక్క పాజిటివ్‌ కేసు నమోదైంది. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణాల రేటు దాదాపు 6శాతం ఉండగా, భారత్ లో మాత్రం 2.8శాతంగా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం.

Read: మరో కోయంబేడు ? గుంటూరు వెజిటెబుల్ మార్కెట్ ‌లో కరోనా