Supreme Court: అక్రమాస్తుల కేసులో ఏపీ మంత్రికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

Supreme Court: అక్రమాస్తుల కేసులో ఏపీ మంత్రికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

Suresh

Supreme Court: ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అక్రమాస్తుల కేసులో సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు తీర్పును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ జరపాలంటూ సీబీఐకి అనుమతి ఇచ్చింది.

సీబీఐ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రాథమిక విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసి కీలక తుది ఉత్తర్వులు ఇచ్చింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి తదుపరి విచారణ దర్యాప్తు కొనసాగించాలని సీబీఐకి సూచించింది. 2017లో ఆదిమూలపు సురేష్‌ దంపతులపై దాఖలైన అక్రమాస్తుల కేసును గత నెల 22న సుప్రీంకోర్టులో విచారించారు. వాదనలు ముగిసిన తర్వాత తీర్పును రిజర్వ్‌లో ఉంచారు.

ఆదిమూలపు సురేష్‌తో పాటు ఐఆర్ఎస్ అధికారి, సురేష్ భార్య విజయలక్ష్మిపై కూడా ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు వచ్చాయి. ఈక్రమంలోనే సీబీఐ కేసు నమోదవగా.. 2017లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిని సవాల్ చేస్తూ సురేష్ దంపతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు సీబీఐ ఆరోపణలను తోసిపుచ్చింది.

సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లో లోపాలు ఉన్నందున మరోసారి ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో కేసు సుప్రీంకోర్టుకు చేరుకోగా.. లేటెస్ట్‌గా సీబీఐ దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. దర్యాప్తు చివరి దశకు వచ్చిందని, మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి అవుతుందని సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ.. విచారణ పూర్తి చేసిన తర్వాత ఛార్జ్ షీట్ నివేదిక అందజేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది.