Gudiwada Casino : గుడివాడలో కాసినో వివాదం.. ఈడీ విచారణకు టీడీపీ డిమాండ్

క్యాసినో నిర్వహించిన కొడాలి నానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. న్యాయ పోరాటం చేస్తాము. వదిలి పెట్టే ప్రసక్తే లేదు..

Gudiwada Casino : గుడివాడలో కాసినో వివాదం.. ఈడీ విచారణకు టీడీపీ డిమాండ్

Gudiwada Casino

Gudiwada Casino : గుడివాడ క్యాసినో వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం, సవాళ్ల పర్వం నడుస్తోంది. ఈ వ్యవహారంలో ప్రతిపక్ష టీడీపీ అధికార పక్షాన్ని టార్గెట్ చేసింది. టీడీపీ నేతలు మంత్రి కొడాలి నాని, పోలీసులు, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటర్ లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా క్యాసినో నిర్వహించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీన్ని టీడీపీ సీరియస్ గా తీసుకుంది. గుడివాడ కేసినో పై ఈడీ విచారణ జరపాలని, కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

EBC Nestham : మహిళలకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.15వేలు

”మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో విష సంస్కృతి తీసుకొచ్చారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. నీ కళ్యాణ మండపంలో ఏం జరిగిందో నీవు చెప్పాలి.. నీ పోలీసులు చెప్పాలి. కొడాలి నాని పనికి రాని వాడు. మా నిజ నిర్దారణ బృందం వెళితే గుడివాడలో వైసీపీ నేతలను కంట్రోల్ చేయలేరా? గుడివాడ పోలీసులు గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి.. క్యాసినో జరగలేదా? బోండా ఉమ కారుపై దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. మాకు అనుమతి ఇవ్వకుండా.. వైసీపీ నేతలకు అనుమతి ఇస్తారా? పోలీసులు తమాషా చేస్తున్నారు. కొడాలి నాని వంటి పనికి మాలిన మంత్రి మీ పక్కన ఉంటే ముఖ్యమంత్రికి సిగ్గు అనిపించలేదా? రేపు ఉదయం ఏలూరు వెళతాము. ఈరోజు జరిగిన పరిణామాలపై ఏలూరు డీఐజీని కలిసి పిర్యాదు చేస్తాము” అని వర్ల రామయ్య అన్నారు.

”గుడివాడలో గత కొంత కాలంగా క్యాసినో, పేకాట, జూదం నిర్వహిస్తున్నారు. ఎస్పీకి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. నిజ నిర్దారణ బృందం వెళితే ఎందుకు అడ్డుకున్నారు? నా కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. కొడాలి నాని.. నీవు దొరికిన దొంగవి. ఏమీ జరక్కపోతే.. మా బృందానికి స్వాగతం పలికి ..కన్వెన్షన్ లో ఏమీ జరగలేదని చూపించాల్సింది. కొడాలి నానిని రక్షించడానికి డీజీపీ రంగంలోకి దిగాడు. ముఖ్యమంత్రి జగన్.. కొడాలి నానిని ఎందుకు బర్తరఫ్ చేయలేదు? మీ తప్పులు ఎత్తి చూపితే మాపై దాడులు చేస్తారా? డీజీపీ.. అధికార పార్టీ కార్యకర్తలా వ్యవవహరిస్తున్నారు. మాపై దాడి ఘటనపై పామర్రు పోలీసులకు ఫిర్యాదు చేశాము. మాపై హత్యాయత్నం చేశారు. బాధ్యులపై కేసులు నమోదు చేయాలి. క్యాసినో నిర్వహించిన కొడాలి నానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. న్యాయస్థానానికి వెళ్లి న్యాయ పోరాటం చేస్తాము. వదిలి పెట్టే ప్రసక్తే లేదు” అని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు.

Gudivada Casino : క్యాసినో వివాదం, నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. కొడాలి నాని సవాల్

”గుడివాడ ఎందరో మహానుభావులు పుట్టిన ప్రాంతం. ఈ పేరు, సంస్కృతిని కొడాలి నాని నాశనం చేస్తున్నాడు. గుడివాడ క్యాసినో వ్యవహారంలో రూ.500 కోట్లు చేతులు మారాయి. దీనిపై ఈడీ దర్యాప్తు చేయాలి. కొడాలి నాని.. క్యాసినో నీకు తెలియకుండా జరిగిందా? గతంలో పేకాట ఆడి దొరికింది వాస్తవం కాదా? క్యాసినోలో వాడిన పరికరాల్లో విదేశాల నుంచి వచ్చిన సామగ్రి ఉంది.. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం. దీనిపై ఈడీ విచారణ జరపాలి. మాపై హత్యాయత్నం జరిగింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాము” అని మాజీమంత్రి ఆలపాటి రాజా అన్నారు.

మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటర్ లో కేసినో నిర్వహించారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. టీడీపీ ఈ విషయాన్ని ప్రధానాస్త్రంగా మలుచుకుంటోంది. ఆ పార్టీకి చెందిన నేతలు నిజనిర్ధారణ కోసం గుడివాడకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఈ ఆరోపణలపై కొడాలి నాని తీవ్రంగా ప్రతిస్పందించారు.

తన కల్యాణమంటపం రెండున్నర ఎకరాల్లో ఉంటుందని… అక్కడ కేసినోలు, పేకాట వంటివి నిర్వహించినట్టు నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటానని కొడాలి నాని సవాల్ విసిరారు. చంద్రబాబు టైమ్ అయిపోయిందని అన్నారు. ఈరోజు నిజనిర్ధారణకు వచ్చినవాళ్లంతా ఎన్నికల్లో ఓడిపోయిన వారేనని చెప్పారు. తన కన్వెన్షన్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయో, లేదో చెప్పడానికి గుడివాడ ప్రజలు ఉన్నారని… టీడీపీ నిజనిర్ధారణ కమిటీ అవసరం లేదని నాని అన్నారు. మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తోందని మంత్రి మండిపడ్డారు.