జగన్‌ అక్రమాలకు పాల్పడ్డారంటూ మరోసారి టీడీపీ ఆరోపణలు

వైసీపీ నేత జగన్‌ మోహన్‌రెడ్డిపై టీడీపీ విమర్శనాస్త్రాలను సంధించింది.

  • Published By: veegamteam ,Published On : March 12, 2019 / 03:15 PM IST
జగన్‌ అక్రమాలకు పాల్పడ్డారంటూ మరోసారి టీడీపీ ఆరోపణలు

వైసీపీ నేత జగన్‌ మోహన్‌రెడ్డిపై టీడీపీ విమర్శనాస్త్రాలను సంధించింది.

హైదరాబాద్ : వైసీపీ నేత జగన్‌ మోహన్‌రెడ్డిపై ఉన్న కేసుల విషయంలో సీబీఐ మెతక వైఖరి అవలంబిస్తోందని… ప్రధాని మోడీకి జగన్‌ లొంగిపోవడమే దీనికి కారణమని విమర్శనాస్త్రాలను సంధించింది టీడీపీ. 2017 మే 31వ తేదీన అప్పటి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ డైరెక్టర్‌ కర్నల్‌ సింగ్‌.. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మకు రాసిన ఓ లేఖను టీడీపీ వర్గాలు ఈ సందర్భంగా బయటపెట్టాయి. వైఎస్ జగన్‌కు చెందిన యాగా అసోసియేట్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ గురించి కీలక వివరాలను ఈ లేఖలో కర్నల్‌ సింగ్ ప్రస్తావించారు. యాగా అసోసియేట్స్‌ను గతంలో ఇందూ శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డికి చెందిన మనుషులు నిర్వహించారు. హిందూజా గ్రూప్‌కు చెందిన CGCL కార్పొరేషన్ అనే కంపెనీకి కూకట్‌పల్లిలో ఉన్న 11 ఎకరాల భూమిని క్విడ్‌ ప్రోకోగా యాగా అసోసియేట్స్‌కు బదలాయించారని కర్నల్‌ సింగ్ తన లేఖలో పేర్కొన్నారు. దీని మార్కెట్ విలువ 177.60 కోట్లని ఈడీ డైరెక్టర్‌ లేఖలో ఉంది. 

GOCLకు కూకట్‌పల్లి ప్రాంతంలో ఉన్న వంద ఎకరాల భూమిని పారిశ్రామిక అవసరాల వినియోగం నుంచి ఇతర అవసరాలకు ఉపయోగించుకునేందుకు అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, అదే విధంగా విశాఖపట్నం వద్ద హిందూజా గ్రూపు నిర్మించ తలపెట్టిన 1040 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ప్రతిపాదనను పునరుద్ధరించారని .. ఈ ప్రయోజనాలు చేకూర్చినందుకు ప్రతిఫలంగానే జగన్‌కు చెందిన యాగా అసోసియేట్స్‌కు 11 ఎకరాల భూమి లభించిందని ఈడీ డైరెక్టర్‌ స్పష్టంగా రాశారు. ఈ విషయంపై సీబీఐ తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ.. కొన్ని డాక్యుమెంట్లను జత చేశారు.