Konaseema : నివురుగప్పిన నిప్పులా కోనసీమ

ప్రస్తుతం నివురు గప్పిన నిప్పులా ఉన్నా కోనసీమలో మరోసారి దాడులు జరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోసారి ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలనే భారీగా పోలీసులను మోహరించారు.

Konaseema : నివురుగప్పిన నిప్పులా కోనసీమ

Konaseema

Tension in Konaseema : నిన్నంతా అల్లర్లు.. అలజడులు.. నిరసనలు.. నిప్పు రవ్వలతో రగిలిపోయిన కోనసీమ ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. కానీ ఇది తుఫాను ముందు ప్రశాంతతనా? లేక నిజంగానే అల్లర్లు చల్లబడ్డయా? అన్నది ఇప్పుడు అర్థంకాని, అంతు చిక్కని ప్రశ్నగా మారింది. నిన్న కూడా దహన, దమన కాండ ప్రారంభం కావడానికి ముందు ప్రశాంతంగానే ఆందోళలను కొనసాగాయి. కానీ క్షణాల్లోనే సీన్‌ మారిపోయింది. ఆందోళనలు అదుపుతప్పాయి.. అమలాపురంలో అలజడి రేపాయి. నిరసనకారులు రెచ్చిపోయారు. క్షణాల్లో కోనసీమ రణరంగంగా మారింది. అందుకే పోలీసులు మరో చాన్స్‌ తీసుకునేందుకు సాహసించడం లేదు. కోనసీమను అష్టదిగ్బంధం చేశారు. అమలాపురంలో డీఐసీ పాలరాజు సహా.. ముగ్గురు ఎస్పీలు తిష్ట వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ప్రస్తుతం నివురు గప్పిన నిప్పులా ఉన్నా కోనసీమలో మరోసారి దాడులు జరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోసారి ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలనే భారీగా పోలీసులను మోహరించారు. 15 వందల మంది అదనపు బలగాలతో అమలాపురాన్ని అష్టదిగ్బంధనం చేశారు పోలీసులు. కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ కూడా శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఇతర ప్రాంతాల వ్యక్తులు అమలాపురం రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. అమలాపురానికి వెళ్లే బస్సులను నిలిపివేసింది ఆర్టీసీ. మరోవైపు కోనసీమ వ్యాప్తంగా ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేసింది ఎయిర్‌టెల్‌.

Kottu Satyanarayana Allegations : కోనసీమ అల్లర్లు.. జనసేన, టీడీపీ కుట్రలో భాగమే -మంత్రి సంచలన ఆరోపణలు

అమలాపురంలో ప్రస్తుతం 144, 30 సెక్షన్‌ కొనసాగుతున్నాయి. మరోవైపు ఆందోళనలో పాల్గొన్న వారిపై వీడియో ఫుటేజీ ఆధారంగా కేసులు పెడుతున్నారు. నిన్న మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలు, క్యాంప్‌ ఆఫీసుల మీద దాడులు జరగడంతో.. అలాంటి చర్యలు మళ్లీ జరగకుండా జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.

ఇక ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంలో కోనసీమ వాసులు ఉన్నారు. అసలు వివాదానికి కారణమైన జిల్లా పేరు మార్పుపై ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని ప్రకటించింది. మరోవైపు ఈ దాడుల అంశం కూడా పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. దాడులు చేయించింది..చేసింది ఎవరో విచారణలో తెలుస్తోందంటూ మంత్రులు ప్రకటిస్తుంటే.. ప్రభుత్వ వైఫల్యాన్ని విపక్షాలపై నెట్టడం సరికాదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.