Pawan Kalyan : పార్టీ పెట్టి 20ఏళ్లు కష్టపడితేనే మాయావతి సీఎం అయ్యారు, టీనేజ్‌లోనే జగన్ అలా చేశారు అందుకే మద్దతివ్వలేదు- పవన్ కల్యాణ్

పార్టీ పెట్టగాను ముఖ్యమంత్రి కావడం ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యమైంది. ఒక్క కులం వల్ల అధికారం రాదు. Pawan Kalyan

Pawan Kalyan : పార్టీ పెట్టి 20ఏళ్లు కష్టపడితేనే మాయావతి సీఎం అయ్యారు, టీనేజ్‌లోనే జగన్ అలా చేశారు అందుకే మద్దతివ్వలేదు- పవన్ కల్యాణ్

Pawan Kalyan - Janasena (Photo : Google)

Updated On : October 2, 2023 / 7:47 PM IST

Pawan Kalyan – Janasena : జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. మాటలతో మంటలు పుట్టిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ టార్గెట్ గా చెలరేగిపోతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి పదవి, సీఎం జగన్ తో వైరం, కులాల ప్రభావం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్.

బీఎస్పీ పార్టీ పెట్టి 20 ఏళ్లు కష్టపడితేనే మాయావతి సీఎం అయ్యారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. పార్టీ పెట్టగానే సీఎం అయిపోవాలని లేడికి లేచిందే పరుగులా నేను ఆలోచించను అన్నారు. పార్టీ పెట్టగానే ముఖ్యమంత్రి కావడం ఎన్టీఆర్ కి మాత్రమే అలా సాధ్యమైందన్నారు పవన్ కల్యాణ్. ఏపీకి రాజధాని ఎక్కడ అంటే మూడు చోట్ల అని చెప్పుకోవాలా..? అని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశాన్ని పాలసీ పరంగానే తాను విభేదించానని పవన్ తెలిపారు. రాజధాని కోసం 30వేల ఎకరాల సేకరణను విభేదించానని వెల్లడించారు.

Also Read..AP Politics: ఏపీలో రాజకీయ కురుక్షేత్రం.. నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలే నెక్ట్స్‌ టార్గెట్?

వైసీపీ మీద నాకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. చిన్నప్పటి నుండి జగన్ ని చూస్తున్నా.. టీనేజ్ లోనే ఎస్ఐని జగన్ కొట్టిన ఘటన చూశాను అని పవన్ అన్నారు. జగన్ రాష్ట్రానికి సరికాదనే తాను మద్దతివ్వలేదని వివరించారు. బ్రాహ్మణ్స్ ను ద్వేషించే పార్టీ బీఎస్పీ, వాళ్లతోనే జత కలిసి మాయావతి సీఎం అయ్యారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ భారత రాష్ట్ర సమితి అయిపోయిందన్నారు. సనాతన ధర్మాన్ని నేను బలంగా నమ్ముతాను, సర్వమతాలను ఆదరించే నేల అదే సనాతన ధర్మం అని పవన్ అన్నారు.

”అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు కలిపితే అద్భతమైన ప్రాంతం అవుతుంది. జాతీయ జెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య ఆకలితో చనిపోయారంటే కడుపు తరుక్కుపోయింది. ఒక్క కులం వల్ల అధికారం రాదు. జనసేన సాధారణ ప్రాంతీయ పార్టీ కాదు దేశ సమగ్రతను దృష్టిలో‌ పెట్టుకుని ఆవిర్భవించిన పార్టీ. భవిష్యత్ లో జనసేన ఆలోచన దేశవ్యాప్తంగా వెళుతుంది.

Also Read..Botsa : ఎమ్మెల్యేలు, ఎంపీపీలపై మంత్రి బొత్సకు ఆగ్రహమెందుకు?

నేను కాపు కులంలో పుట్టాను. అలా అని కేవలం కాపు ఓటు బ్యాంక్ తీసుకుంటే ఎక్కడ ఎదుగుతాం? అలా ఆలోచిస్తే కుల నాయకుల్లా మిగిలిపోతాం. ఒక కులానికి అంటగట్టి నన్ను ఎందుకు కులనాయకుడిని చేస్తారు. రాజమండ్రిలో మాట్లాడుతూ కాపులను పెద్దన్న పాత్ర పోషించమన్నాను. ఏపీలో కాపులు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టే అలా అన్నాను” అని పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు.