AP Politics: ఏపీలో రాజకీయ కురుక్షేత్రం.. నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలే నెక్ట్స్‌ టార్గెట్?

AP Politics: ఏపీలో రాజకీయ కురుక్షేత్రం.. నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలే నెక్ట్స్‌ టార్గెట్?

is ysr congress target nara bhuvaneshwari and brahmani?

Andhra Pradesh Politics : విజయవాడలో జరిగిన వాహనమిత్ర కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటల్లో.. రానున్న అసెంబ్లీ ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించనున్నాయి. అంటే కురుక్షేత్ర యుద్ధస్థాయిలో ఇరుపక్షాలూ వ్యూహప్రతివ్యూహాలను.. అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అవసరమైన వారందరినీ ముగ్గులోకి లాగనున్నాయి. ప్రత్యర్థుల శక్తిసామర్థ్యాలను నిర్వీర్యం చేయడమనేది యుద్ధతంత్రంలో ఒక ముఖ్య వ్యూహం. పాలకపక్షమైన వైసీపీ ఈ యుద్ధతంత్రంలో ముందడుగు వేయడమే కాక, తొలివిజయం సాధించింది. అదను చూసి చంద్రబాబును దెబ్బ కొట్టింది. యుద్ధం గెలవాలంటే ప్రత్యర్థుల్లో ఏ ఒక్కరినీ వదిలిపెట్టకూడదనేది.. అంటే శత్రుశేషం ఉండకూడదనేది అందరికీ తెలిసిన నానుడే.. ప్రభుత్వ వ్యూహమూ ఇదే.. అందుకు చంద్రబాబునాయుడితో మొదలెట్టిన ఈ యుద్ధతంత్రం ఇటు లోకేశ్‌నూ నిర్వీర్యం చేయడానికి రంగం సిద్ధమవుతోంది. తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తే ఇది ఇంతటితో ఆగేదికాదని చంద్రబాబు భార్య భువనేశ్వరి, లోకేశ్ భార్య బ్రాహ్మణిని కూడా కట్టడి చేసే మార్గాలపై పాలకపక్షం దృష్టిపెట్టిందనే అనుమానం కలుగుతోంది.

అమరావతి ఇన్నర్‌రింగ్‌రోడ్ అలైన్‌మెంట్ ప్లాన్ మార్చిన కేసు తాజాగా న్యాయస్థానాల పరిశీలనలోకి వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, రాష్ట్రమంత్రిగా ఉన్న లోకేశ్‌ను ఈ కేసులో నిందితులుగా చేర్చడంతో ఈ వ్యవహారం కోర్టులకు చేరింది. ఈ కేసులో లోకేశ్‌కు 41A కింద నోటీసు జారీ చేసి, విచారణకు పిలవనున్నట్లు సీఐడీ అధికారులు తాజాగా కోర్టుకు విన్నవించారు. దీనిపై తదుపరి చర్యలు ఎలా ఉంటాయో ఆసక్తికరంగా మారింది. ఇక భువనేశ్వరి, బ్రాహ్మణికి కూడా ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు కోర్టుకు నివేదించడానికి సీఐడీ సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌ను ముగ్గులోకి దించారు. ఇన్నర్‌రింగ్‌రోడ్ ఎలైన్‌మెంట్ మార్పిడి ద్వారా హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన దాదాపు 14 ఎకరాల భూమి విలువను పెంచే ప్రయత్నం చేశారన్నది సీఐడీ అధికారుల అభియోగం.

హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న భువనేశ్వరి, బ్రాహ్మణిలకు ఈ రకంగా ఈ స్కాంలో పాత్ర ఉందనేది సీఐడీ అధికారుల అభియోగం. ఆ రకంగా ఈ ఇద్దరినీ కట్టడి చేయొచ్చనేది వ్యూహం. గతంలో జగన్‌మీద నమోదైన కేసుల తరహానే ఈ కేసు కూడా.. తన తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని కొందరు వ్యక్తులకు.. సంస్థలకు ప్రయోజనం చేకూర్చి.. వారి ద్వారా తన కంపెనీలకు ఆయాచిత ప్రయోజనం చేకూర్చారన్నది జగన్‌ మీద పదేళ్ల క్రితం నమోదైన కేసుల సారాంశం. చంద్రబాబు, లోకేశ్‌లు ప్రభుత్వ పదవుల ద్వారా.. వారి కుటుంబానికి చెందిన భువనేశ్వరి, బ్రాహ్మణిలు ప్రమోటర్ డైరెక్టర్లుగా ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీకి లబ్ధి కలిగిందన్నది… ఇన్నర్‌రింగ్‌రోడ్ అలైన్‌మెంట్ మార్పు ప్రాతిపాదన కేసులో తాజా వాదనల సారాంశం. ప్రత్యర్థులను నిర్వీర్యం చేయడమనే వ్యూహం చంద్రబాబుకి తెలియని విద్యయేమీ కాదు. గతంలో పలు సందర్భాల్లో చంద్రబాబు ఈ యుద్ధ తంత్రాన్ని ఏదో ఒక స్థాయిలో వాడారు. కాకపోతే ఈ సారి ఈ తంత్రాన్ని వాడే అవకాశం పాలకపక్షం చేతికి వచ్చింది.

ఈ తాజా వ్యూహంలో పాలకపక్షం ఆశించిన స్థాయిలో విజయం సాధిస్తే తెలుగుదేశానికి ఇక పవన్‌కల్యాణ్ మాత్రమే అండ. జనమే దిక్కు. ఇదంతా ఒక ఎత్తైతే అసలు చంద్రబాబుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందన్న దానిపై విశ్లేషకుల స్థాయిలో ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది. చంద్రబాబు స్వయంకృత అపరాధమే చాలావరకు ఇప్పటిపరిస్థితికి కారణమని ఆయా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ విశ్లేషణలోకి వచ్చిన కొన్ని ముఖ్యమైన అంశాలను ఒక్కసారి చూద్దాం.. ప్రధానంగా 2019 ఎన్నికలకు ముందు NDA నుంచి బయటకు రావడం చంద్రబాబు చేసిన వ్యూహాత్మక పొరపాటు. బయటకు రావడమే కాక ప్రధాని మోదీని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఇంకా ఎంతో తప్పు. మోదీకి దగ్గరయ్యేందుకు ఇది సీఎం జగన్‌కు వచ్చిన సువర్ణావకాశమని విశ్లేషకులు భావిస్తున్నారు. దీన్ని సరిదిద్దేందుకు చంద్రబాబు ఎన్నిరకాలుగా ప్రయత్నించినా, ప్రయత్నిస్తున్నా.. అవతలివారు అంతతేలిగ్గా మరచిపోవడం లేదు. క్షమించడం లేదు.. ఇక రెండోది, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జతకట్టి.. కేసీఆర్‌పై దండయాత్ర ప్రకటించడం చంద్రబాబు చేసిన మరో తప్పని విశ్లేషకుల అభిప్రాయం. ఈ పరిణామంతో కేసీఆర్‌కు జగన్‌కు దగ్గర చేయడంతోపాటు, 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నుంచి చంద్రబాబుకు రిటన్ గిఫ్ట్ ఇచ్చేలా చేసింది. జగన్ విజయానికి ఈ రిటన్ గిఫ్ట్ అప్పట్లో బాగా పనిచేసిందనేది అంచనా.

Also Read: చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన టాలీవుడ్ నటుడు.. వీడియో విడుదల

ఇక తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు తన తనయుడు లోకేశ్‌కు పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించి.. జనంతో మమేకమై పార్టీని పటిష్ట పర్చుకోవాల్సిన తరుణంలో లోకేశ్‌ క్యాబినెట్‌లోకి తీసుకోవడం చంద్రబాబు చేసిన మరోతప్పు అనేది విశ్లేషకుల భావన. లోకేశ్ శక్తి సామర్థ్యాలపై ప్రజల్లో వ్యతిరేక భావాన్ని విస్తరింపజేయడానికి ఈ అంశం వైసీపీకి ఎంతో ఉపయోగపడిందన్నది విశ్లేషకుల అంచనా. జనంలో తిరగాల్సిన వయసులో ఉన్న లోకేశ్‌ను.. పార్టీలో పట్టుసాధించాల్సిన అవసరమున్న లోకేశ్‌ క్యాబినెట్ మంత్రిగా తన విలువైన సమయాన్ని ఎక్కువగా ప్రభుత్వ విధులకు ఉపయోగించి పార్టీని వదిలేశారనేది విశ్లేషకుల అభిప్రాయం.

తెలుగుదేశం పార్టీలో తను, తన కుమారుడు లోకేశ్ కాకుండా ఇతర బలమైన నాయకులను తీర్చిదిద్దడంలో చంద్రబాబు సఫలీకృతం కాలేకపోయారన్న విస్తృతాభిప్రాయం విశ్లేషకుల్లో ఉంది. అభివృద్ధి చేస్తే చాలు.. జనం తనవెంటే ఉంటారని.. ఇదొక్కటి చాలని చంద్రబాబు జనంపై అతినమ్మకం పెట్టుకున్నారని ఆయన పార్టీవారే అంతర్గతంగా చెబుతుంటారు. అభివృద్ధి మంత్రం కొంత ఉపయోగపడినా రాజకీయాల్లో రాణించాలంటే భారీ మందీమార్బలం ఉండాలని.. తెగబడి కొట్లాడే నాయకులు పదుల సంఖ్యలో అవసరమని చంద్రబాబు ఇక్కడే తప్పులో కాలేశారని భావిస్తున్నారు విశ్లేషకులు.

Also Read: అరెస్ట్ భయంతో ఢిల్లీలో ఖరీదైన హోటల్‌లో దాక్కున్నాడు- లోకేశ్ పై మంత్రి కొట్టు ఫైర్

వీటన్నిటికంటే ముఖ్యమైన మరో అంశం చాలా సున్నితమైనది. ఇదేంటంటే.. చంద్రబాబు విస్తృతంగా అధికారం చలాయించిన కాలంలో పలు వ్యవస్థలను విజయవంతంగా మేనేజ్ చేశారని.. ఈ మేనేజ్ చేసే పనిలో భాగంగా తనవారికి మేలు చేయడంతో, దీనివల్ల ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ప్రభావితమైన వాళ్లు, నష్టపోయినవాళ్లు.. ఇప్పుడు అదునుచూసుకుని చంద్రబాబుకు తమవంతుగా రిటర్న్‌గిఫ్ట్ ఇస్తున్నారని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు. ఇది నిజంగానే సున్నితమైన అంశం.. ఇవన్నీ పాత సంగతులే.. ఎప్పుడో జరిగిపోయినవాటి గురించి ఇప్పుడు చర్చ ఎందుకనే అనుమానం రావడం సహజం… అసలు విషయం ఏమిటంటే ఎప్పుడో తీసుకున్న నిర్ణయాలు, చర్యల ప్రభావం కొన్నాళ్లకు కాని కనిపించదు. అంటే 2014-19 కాలం.. అంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చర్యల ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. ఇందులో మంచి చెడ్డ ఏంటనేది తేల్చడం ప్రస్తుత అంశం కాదు. వీటి ప్రభావం ఎంత ఉందనేది ఇప్పుడు ప్రాముఖ్యత సంతరించుకున్న అంశం.

Also Read: పాల ప్యాకెట్లు పేలిపోతున్నాయ్..! సీఎం జగన్‌పై మండిపడ్డ లోకేశ్.. ట్విటర్‌లో ఉబ్బిన పాల ప్యాకెట్ల వీడియో

ఇవన్నీ ఒక ఎత్తైతే చంద్రబాబుపై నమోదైన కేసుల్లో నిజమెంత? ఇవన్నీ న్యాయస్థానాల్లో నిలబడతాయా? లేదా? అన్న చర్చ కూడా ఇప్పుడు విస్తృతంగా నడుస్తోంది. అయితే ఈ అంశం ఇప్పట్లో తేలేది కాదు. కోర్టుల్లో విచారణ జరిగి నిజనిర్ధారణ జరిగే సరికి చాలా సమయం పడుతుంది. ఈ లోపు జరగాల్సింది జరిగిపోతుంది. మ్యాటర్ ఒకసారి కోర్టు పరిధిలోకి వెళ్తే దానికి సంబంధించి తక్షణం కోర్టు తీసుకునే నిర్ణయాలు కొంతవరకు టెక్నికల్ అంశాల ఆధారంగా ఉంటాయి. కేసులో నిజానిజాల నిగ్గుతేల్చడానికి చాలా సమయం పడుతుంది. అందుకే చంద్రబాబు కస్టడీ, బెయిల్, క్వాష్ పిటిషన్లపై తీర్పు వంటివన్నీ చాలావరకు టెక్నికల్ అంశాల ఆధారంగానే జరుగుతున్నాయి. చంద్రబాబుకు ప్రస్తుతానికి ఉపశమనం కలిగించినా, కలిగించకపోయినా.. ఇందుకు సంబంధించిన కీలకపాత్ర టెక్నికల్ అంశాలదే అవుతుంది ఇప్పటికి. అందుకే చంద్రబాబు విషయంలో రానున్న రోజుల్లో న్యాయపరంగా ఏం జరగబోతున్నదనేది అంత తేలిగ్గా అంతుపట్టని ఉత్కంఠగా మారింది.

Also Read: అనకాపల్లినే అమర్‌నాథ్ మళ్లీ ఎంచుకోడానికి కారణమేంటి?

ఎవరిమీదైనా కేసులు నమోదైనప్పుడు వాటి తక్షణ ప్రభావం కొంత ఉంటుంది. అంతిమ ప్రభావం ఏంటో తేలేసరికి చాలా సమయం పడుతుంది. జైలు, బెయిలు వంటివి తక్షణ ప్రభావాలు. వీటిని డీల్ చేయడమూ అంత తేలిక కాదు. ఉదాహరణకు జగన్ మీద 10 సంవత్సరాల క్రితం నమోదైన కేసులలో ఆయన 16 నెలలు జైల్లో ఉండొచ్చారు. ఆయన మీద కేసులు నిజమో కాదో ఇప్పటికి తేలలేదు. ఇంకా చెప్పాలంటే విచారణే సరిగ్గా మొదలుకాలేదు. ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లపై కేసుల తక్షణ ప్రభావం చూస్తున్నాం. అంతిమ ప్రభావం తేలెదెప్పుడో..? అయితే జగన్ తన కేసుల తక్షణ ప్రభావాన్ని తట్టుకుని నిలబడి జనంలో నెగ్గుకొచ్చారు. బలమైన నేతగా ఎదిగారు. చంద్రబాబు విషయానికి వస్తే తక్షణ ప్రభావాన్ని తట్టుకుని నిలబడి జనంలో ఏ మేరకు నెగ్గుకొస్తారో కాలమే చెప్పాలి. అలవైకుంఠపురం సినిమాలో రెండు విలన్ క్యారెక్టర్ల మధ్య ఒక సంభాషణ ఉంటుంది. చాన్సే లేదన్నావ్ అని ఒకరంటే, దేవుడే లేడన్నావ్ అని మరొకరు అంటారు. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమని ఈ సీన్ ఉద్దేశం. ఏపీ రాజకీయాలు కూడా ఇప్పుడు ఇలాంటి సంధి దశలో ఉన్నాయనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే కేసులతో ఏపీ పరిణామాలు ఇంకొంత కాలం హైవోల్టేజ్‌తో కూడిన హాట్‌టాపిక్‌గానే కొనసాగుతాయనిపిస్తోంది.