Employment Guarantee Scheme – ఉపాధి హామీలో ఏపీకి 3వ స్థానం.. కరోనా కష్టకాలంలోనూ పని ఇచ్చిన ప్రభుత్వం

మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రికార్డు స్థాయిలో పేదలకు పనులు కల్పించింది. సీఎం సీఎం జగన్‌ ముందుచూపు, ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి తన సమీక్షలతో చేసిన మార్గనిర్ధేశం ఉత్తమ ఫలితాలను ఇచ్చింది.

Employment Guarantee Scheme – ఉపాధి హామీలో ఏపీకి 3వ స్థానం.. కరోనా కష్టకాలంలోనూ పని ఇచ్చిన ప్రభుత్వం

Employment Guarantee Scheme Ap

Employment Guarantee Scheme in Andhra Pradesh: మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రికార్డు స్థాయిలో పేదలకు పనులు కల్పించింది. సీఎం జగన్‌ ముందుచూపు, ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి తన సమీక్షలతో చేసిన మార్గనిర్ధేశం ఉత్తమ ఫలితాలను ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించి పేదలకు అండగా ప్రభుత్వం నిలిచింది. అధికార యంత్రాంగం ఈ పథకం అమలులో చూపిన చిత్తశుద్ధి కారణంగా జాతీయస్థాయిలో ఉపాధి హామీ పథకాన్ని అత్యధికంగా వినియోగించుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలిచింది.

2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి మొత్తం 25.25 కోట్ల పనిదినాలను కేంద్రం లక్ష్యంగా కేటాయించింది. అయితే ఈ నెల (29.3.2021) నాటికే మొత్తం 25.43 కోట్ల పనిదినాలను పేదలకు కల్పించడం ద్వారా కేంద్రం ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ కింద ఏడాది కాలంలో (29.3.2021 నాటికి) రూ.10,170 కోట్లు ఖర్చు చేసింది. దీనిలో కూలీలకు వేతనాల కిందనే 5,818 కోట్లు చెల్లించింది. ఇక స్కిల్డ్ వేజెస్, మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ. 3,965 కోట్లు వ్యయం చేసింది.

కరోనా సంక్షోభ సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి పొట్ట చేతపట్టుకుని వచ్చిన వలస కూలీలను ఆదుకునేందుకు సీఎం జగన్ ఆదేశాలతో వారికి ఉపాధి హామీతో పనులు కల్పించారు. ఒక్కసారిగా లక్షల సంఖ్యలో వలస కూలీలు రాష్ట్రంలోని తమ సొంత గ్రామాలకు చేరుకోవడం, అదే సమయంలో కరోనా లాక్‌డౌన్‌ వల్ల స్థానికంగా వున్న వారికి కూడా పనులు లేని పరిస్థితులను ప్రభుత్వం సవాల్‌గా తీసుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చిన వలస కూలీలు 6.35 లక్షల మందికి జాబ్‌కార్డులను మంజూరు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 7.36 లక్షల జాబ్‌కార్డ్ లను తిరిగి యాక్టివేట్ చేశారు. అలాగే రాష్ట్రంలో వున్న మరో 2.44 మందిని అప్పటికే యాక్టీవ్‌గా వున్న కార్డులలో సభ్యులుగా నమోదు చేశారు.

సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్ క్లీనిక్స్ తో పాటు అంగన్‌వాడీ, బల్క్‌ మిల్క్‌ కూలింగ్ యూనిట్లకు మొత్తం 48,969 భవనాల నిర్మాణానికి ఉపాధి హామీని ప్రభుత్వం అనుసంధానం చేసింది. రూ.9,871 కోట్లతో ఈ పనులు చేపట్టింది. మెటీరియల్ కాంపోనెంట్ కింద ఆస్తులను సమకూర్చుకోవడం, అలాగే పేదలకు వాటి నిర్మాణం ద్వారా పనులు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పనలో భాగంగా సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చింది.

మరోవైపు పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ 37,870 మంది రైతులకు చెందిన 56,675 ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధి, 10,706 కి.మీ. పొడవునా రోడ్డుకు ఇరువైపులా 42.83 లక్షల మొక్కల పెంపకం, 11,928 హౌసింగ్ లే అవుట్స్‌ లో 16.69 లక్షల మొక్కల పెంపకం, 2707 బ్లాక్‌లలో 4.78 లక్షల మొక్కల పెంపకం, 389 ప్రభుత్వ పాఠశాలల్లో 34 లక్షల మొక్కలు, 1327 రైతులకు చెంది పొలంగట్లపై 2.05 లక్షల మొక్కలు, రైల్వేకు చెందిన 34 ప్రాంతాల్లో 13 వేల మొక్కల పెంపకం ద్వారా పేదలకు ఉపాధి కల్పించింది.