CM Jagan campaign : తిరుపతి బై పోల్, 14న సీఎం జగన్ ప్రచారం ?

తిరుపతిలో బైపోల్‌ వార్‌ హీటెక్కుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా.. వైసీపీ అధినేత, సీఎం జగన్‌ ఉప ఎన్నిక ప్రచార బరిలోకి దిగుతున్నారు.

CM Jagan campaign : తిరుపతి బై పోల్, 14న సీఎం జగన్ ప్రచారం ?

CM Jagan Campaign

Tirupati by-poll : తిరుపతిలో బైపోల్‌ వార్‌ హీటెక్కుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా.. వైసీపీ అధినేత, సీఎం జగన్‌ ఉప ఎన్నిక ప్రచార బరిలోకి దిగుతున్నారు. ఈ నెల 14వ తేదీన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని.. రేణిగుంట సమీపంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం జగన్‌. అయితే పూర్తి స్థాయిలో పర్యటన షెడ్యూల్‌ ఇంకా ఖరారు కానట్లు తెలుస్తోంది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌ ఈ నెల 17న జరుగనుండగా.. వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి భారీ మెజార్టీ లక్ష్యంగా ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొంటున్నారు.

సీఎం జగన్‌ కూడా తిరుపతిలో పర్యటిస్తే.. రికార్డు స్థాయిలో మెజార్టీ వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో పార్టీ నేతలు పెద్దలు రేణిగుంట మండలం ఎల్లమండ్యంలోని యోగానంద కళాశాల సమీపంలో బహిరంగ సభకు అనువైన ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి తిరుపతి ప్రచారానికి రూట్‌ మ్యాప్‌పై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ సమర శంఖారావం మొదటి సభ కూడా ఈ ప్రాంగణంలోనే చేపట్టడంతో పార్టీ నేతలు ఈ స్థలంలో బహిరంగ సభ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు.

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి, అనిల్ కుమార్, గౌతం రెడ్డి, కొడాలి నానిలతో కలిసి వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి నామినేషన్ వేశారు. బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ కూడా నామినేషన్ పత్రాలు సమర్పించారు. నెల్లూరులో కస్తూరిదేవి గార్డెన్స్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ వేశారు. ఇప్పటికే నామినేషన్ వేసిన టీడీడీ అభ్యర్థి పనబాక లక్ష్మి ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా చింతామోహన్‌ సాదాసీదాగా నామినేషన్‌ దాఖలు చేశారు.

ఏపీ మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ఫలితాలతో జోరుమీదున్న వైసీపీ తమ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని నాలుగు లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని టార్గెట్ పెట్టుకుంది. తన స్వగ్రామం మన్న సముద్రంలో ప్రచారం నిర్వహించారు వైసీపీ అభ్యర్థి గురుమూర్తి. వైసీపీ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమమే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.