ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీపై చర్యలు తీసుకుంటాం: మంత్రి మేకపాటి 

  • Published By: srihari ,Published On : May 7, 2020 / 09:56 AM IST
ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీపై చర్యలు తీసుకుంటాం: మంత్రి మేకపాటి 

విశాఖలో విష వాయువు లీక్ అయిన ఘటనపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన గురువారం (మే7, 2020) 10 టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఎల్జీ పాలిమర్స్ మెయింటనెన్స్ చేయలేదని మంత్రి తెలిపారు. కంపెనీ యాజమాన్యం మెయింటనెన్స్ చేయకపోవడం నేరమన్నారు. మెయింటనెన్స్ సక్రమంగా లేకపోవడం వల్లే గ్యాస్ లీక్ అయిందన్నారు. 

ప్రమాదం వెనుక కంపెనీ నిర్లక్ష్యంగా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎల్జీ పాలిమర్స్ ను ఆర్ ఆర్ వెంకటాపురం నుంచి తరలిస్తామని చెప్పారు. ఎల్జీ సంస్థ ప్రతినిధులను కూడా రప్పిస్తున్నామని తెలిపారు. కొరియన్ ఎంబసీకి సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. 

అంతకముందు విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో విష వాయువు లీకేజీపై ఆ కంపెనీ జీఎం మోహన్ రావు స్పందించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో కంపెనీలోని ట్యాంకులు రన్నింగ్‌లో లేకపోవడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ట్యాంక్ కెపాసిటీ 2400 టన్నులకు గానూ 1800 టన్నుల స్టెరిన్ మోనోమార్ ఉందని పేర్కొన్నారు. లాక్ డౌన్‌లో మెయింటనెన్స్ చేయకపోవడంతో వల్లే గ్యాస్ లీక్ అయిందని స్పష్టం చేశారు. గ్యాస్ లీకేజీ అదుపులోకి రావడానికి మరో నాలుగు గంటల సమయం పడుతుందన్నారు.  

విశాఖలో విష వాయువు లీక్ ఘటన తీవ్ర కలకల రేపింది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 9 కి చేరింది. 2 వేలకు పైగా మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  మరోవైపు కంపనీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే ఈ దారుణం జరిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదకరమైన గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉందనే తెలిసి కూడా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. 

Also Read | మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, అందరికి జగన్ భరోసా.. ఎల్‌జీని తరలిస్తాం