ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరిగేనా ?..సుప్రీం తీర్పుపై ఉత్కంఠ

ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరిగేనా ?..సుప్రీం తీర్పుపై ఉత్కంఠ

panchayat elections in AP : ఏపీలో పంచాయతీ ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. ఎస్‌ఈసీ రమేష్ కుమార్, ఏపీ ప్రభుత్వం ఇద్దరూ మంకుపట్టుతోనే ఉన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సుదీర్ఘ యుద్ధం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండటంతో ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్న వాదనను పిటిషన్లో చేర్చింది.

సుప్రీంకు ఏపీ సర్కార్ :-
ఏపీ హైకోర్టులో సింగిల్ బెంచ్ తీర్పును ఉటంకిస్తూ వ్యాక్సినేషన్ తర్వాతే ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేయాలని కోరింది ఏపీ సర్కార్. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొనే ఎన్నికలకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని పిటీషన్‌లో దాఖలు చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎన్నికలను వ్యతిరేకిస్తున్నారన్న అంశాన్ని చేర్చినట్లు తెలుస్తోంది. దీనిపై సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేదే ఉత్కంఠగా మారింది. కరోనా పీక్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడు రాజస్థాన్ ప్రభుత్వం ఎన్నికలు వద్దని సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే, ఎన్నికల విషయంలో మేం జోక్యం చేసుకోలేమని తెలిపింది సుప్రీంకోర్టు. ఇప్పుడు అదే తీర్పు రిపీట్ అయ్యే అవకాశమందంటున్నారు నిపుణులు.

శుక్రవారం తీర్పు ?  :-
ఎస్ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 23 నుంచే నోటిఫికేషన్ మొదలవుతుంది. అందువల్ల ప్రభుత్వ పిటిషన్ పై సుప్రీంకోర్టు 2021, జనవరి 22వ తేదీ శుక్రవారం తీర్పు అందించే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇంప్లీడ్ అయ్యారు. ఇప్పటికే హైకోర్టు తీర్పుపై ఉద్యోగల సంఘాల నేతలు మండిపడ్డారు. ఎస్ఈసీకి ప్రజల ఆరోగ్యం, ఉద్యోగుల సంక్షేమ పట్టదని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆరోపించింది. అలాగే వ్యాక్సినేషన్ లో బిజీగా ఉన్నందున ఉద్యోగులు విధుల్లో పాల్గొనలేరని తెలిపింది రెవెన్యూ ఉద్యోగుల సంఘం.

గవర్నర్ తో నిమ్మగడ్డ :-
ఇదిలా ఉంటే ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌తో సమావేశంకానున్నారు. ఎస్ఈసీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు, అనంతర పరిణామాలను గవర్నర్‌కు వివరించనున్నారు నిమ్మగడ్డ. ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్‌ను గవర్నర్‌కు వివరించే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పుతో పంచాయితీ ఎన్నికలకు ఎస్ఈసీ సిద్ధమవుతోంది. అంతేకాదు ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చినట్లేనని రాష్ట్ర ఎన్నికల సంఘం అంటోంది.

శనివారం నామినేషన్ల ప్రక్రియ :-
హైకోర్టు తీర్పు రాగనే.. ఎన్నికల కమిషన్ కార్యాలయంలోని సిబ్బందితో భేటీ అయ్యారు. శనివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. త్వరోనే సీఎస్‌తో పాటు ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నారు నిమ్మగడ్డ. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5, 9, 13, 17వ తేదీల్లో నాలుగు దఫాల్లో ఎన్నికలు నిర్వహించి తీరుతామని నిమ్మగడ్డ స్పష్టంచేశారు. ఈ నెల 27న రెండో దశ, ఈ నెల 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల్లో కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు.