ఏపీలో స్థానిక సమరం.. టికెట్ల కోసం లాబీయింగ్!

  • Published By: sreehari ,Published On : March 10, 2020 / 01:30 PM IST
ఏపీలో స్థానిక సమరం.. టికెట్ల కోసం లాబీయింగ్!

ఏపీలో స్థానిక సమరం ఊపందుకుంది.  జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ మొదలు కావడంతో ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. మరోవైపు టికెట్ల కోసం ఆశావహులు ఎవరికి వారుగా లాబీయింగ్‌ చేస్తున్నారు. మరోవైపు నామినేషన్లతో ఎంపీడీవో, జడ్పీ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 660 జడ్పీటీసీ, 9,984 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. జడ్పీటీసీ స్థానాలకు జడ్పీ కార్యాలయాల్లో, ఎంపీటీసీ స్థానాలకు ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు.

ఈ నెల 11 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 12న ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లను పరిశీలిస్తారు.. 13న  నామినేషన్లపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. 14న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. అనంతరం అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 21న ఎన్నికల పోలింగ్‌, 24న కౌంటింగ్‌ జరగనుంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎంపీడీవో, జడ్పీ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. అన్ని స్థానాలను కైవసం చేసుకునేందుకు నేతలు వ్యూహరచన చేస్తున్నారు. ఇక పట్టణ, నగర పాలక సంస్థలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 103 మున్సిపాలిటీలకు, 16 కార్పొరేషన్‌లకు నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. ఒకే విడతలో ఈ నెల 23న ఎన్నికలు జరుగుతాయి. ఇందుకు 11 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు.

ఈనెల 23న పోలింగ్ నిర్వహించి…  27న లెక్కింపు చేపడతారు.  మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్‌ చైర్మన్, వైఎస్‌ చైర్మన్‌ ఎన్నిక ఎక్కడికక్కడ ఈ నెల 31న జరుగుతుంది. ఇక రెండు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు 17 నుంచి 19 తేదీల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. రెండో విడతలో జరిగే వాటికి 19 నుంచి 21 తేదీల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. ఇటీవల పలు పంచాయతీలను మున్సిపాలిటీలలో విలీనం అనంతరం రాష్ట్రంలో దాదాపు 13 వేల 377 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

తొలి దశ, రెండో దశలో ఏయే  గ్రామాలకు ఎన్నికలు నిర్వహించాలన్న దానిపై పూర్తి అధికారాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆయా జిల్లా కలెక్టర్లకే అప్పగించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పొలింగ్‌ నిర్వహిస్తారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్‌ చేపడతారు. మొత్తానికి స్థానిక సంస్థల నగరా మోగడంతో.. అన్ని పార్టీలూ సత్తా చాటేందుకు సర్వ శక్తులుఒడ్డుతున్నాయి.