సూపర్ సండే: ఒకే రోజు మూడు సూపర్ ఓవర్లు.. రూల్ మారింది.. అసలైన క్రికెట్ మజా!

  • Published By: vamsi ,Published On : October 19, 2020 / 02:50 AM IST
సూపర్ సండే: ఒకే రోజు మూడు సూపర్ ఓవర్లు.. రూల్ మారింది.. అసలైన క్రికెట్ మజా!

రెండు మ్యాచ్‌లు మూడు సూపర్ ఓవర్‌లు ఆదివారం అసలైన మజా అందించాయి ఐపీఎల్ 2020లో 35వ మ్యాచ్.. 36వ మ్యాచ్.. ఐపిఎల్ 2020లో మాత్రమే కాదు, టీ20 క్రికెట్ చరిత్రలో రెండు సూపర్ ఓవర్లు చూసిన చరిత్ర లేదు.. తొలిసారి ఐపీఎల్ 2020లో రెండు సూపర్ ఓవర్‌లు క్రికెట్ అభిమానులను కనివిందు చేశాయి. అంతేనా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ సూపర్ ఓవర్లలో ఒకటి టై, ఇది మరొక సూపర్ ఓవర్‌కు దారితీసింది.



యూఏఈలో ఆడుతున్న ఐపీఎల్ 2020లో ప్రతిరోజూ ఉత్తేజకరమైన మ్యాచ్‌లు చూస్తున్నాం. కానీ అక్టోబర్ 18వ తేదీన ఆదివారం మాత్రం ఐపిఎల్ చరిత్రలోనే కాదు టీ20 క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ జరగని మ్యాచ్ చూశాం. ఒక రోజులో, ఐపిఎల్ వంటి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టోర్నమెంట్‌లో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడితే రెండూ కూడా సూపర్ ఓవర్‌లకు దారితీశాయి. ఈ రెండు మ్యాచ్‌లు సూపర్ ఓవర్లు, ఆపై ఒక మ్యాచ్‌లో మరో సూపర్ ఓవర్.. మొత్తం మూడు సూపర్ ఓవర్‌లు…



ఐపీఎల్ 13 వ సీజన్ 35 వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. వాస్తవానికి ఈ మ్యాచ్ టైగా ముగిసింది. అయితే సూపర్ ఓవర్ తర్వాత కోల్‌కతా జట్టు హైదరాబాద్‌పై సులభంగా గెలుచుకుంది. వెంటనే జరిగిన 36 వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య కూడా స్కోరు సమానంగా అయ్యింది. దాంతో సూపర్ ఓవర్ ఆడగా.. సూపర్ ఓవర్‌లో కూడా స్కోర్లు సమానం అయ్యాయి. మ్యాచ్ సమం అయ్యాక మరో సూపర్ ఓవర్ జరిగి అందులో పంజాబ్ ముంబైపై గెలిచింది.



ఐపీఎల్‌లో 12 సీజన్లులో ఒకే రోజు రెండు మ్యాచ్‌లు సూపర్ ఓవర్‌కు చేరుకోలేదు. అంతేకాదు.. ఒకే మ్యాచ్ ఫలితం కోసం కూడా రెండు సూపర్ ఓవర్లు జరగలేదు. ప్రపంచ కప్ 2019 ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య ఇలాగే జరిగితే.. బౌండరీల లెక్కింపు ఆధారంగా ఇంగ్లాండ్ న్యూజిలాండ్‌పై గెలిచింది.



ఈ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌(ICC)పై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. బౌండరీలు కొట్టడమే నైపుణ్యానికి కొలమానమా? అనే విమర్శలు రావడంతో ఆ నిబంధనల్లో మార్పులు వచ్చాయి. పరుగుల ఆధారంగా ఒక జట్టు గెలిచే వరకు టీ20 క్రికెట్‌లో సూపర్ ఓవర్‌లను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు.