Elon Musk : ట్విట్టర్ డేటాను మైక్రోసాఫ్ట్ అక్రమంగా వాడేస్తోంది.. ఇక ఆపేయ్.. సత్య నాదేళ్లకు ఎలన్ మస్క్ స్వీట్ వార్నింగ్..!
Elon Musk : బిలియనీర్ ఎలన్ మస్క్ ఏది అంత ఈజీగా వదలడు.. అలాంటిది తన సొంత కంపెనీ డేటా అప్పనంగా వాడేస్తామంటే మస్క్ ఊరుకుంటాడా? ఏకంగా.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదేళ్ల (Satya Nadella)కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

Elon Musk sends letter to Satya Nadella, accuses Microsoft of using Twitter data illegally
Elon Musk sends letter to Satya Nadella : ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ (Elon Musk) ఏం చేసినా దానికో లెక్క ఉంటుంది.. ఏ పని కూడా ఊరికే చేయడు.. అందులో ఎంతోకంతో లాభం ఉంటే తప్పా.. ఏ కొంచెం ఆదాయం వచ్చే మార్గం ఉన్నా దాన్ని వెంటనే ఒడిసి పట్టుకుంటాడు మస్క్.. అందుకే ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా నిలిచాడు. ట్విట్టర్‌పై కన్నేశాడో లేదా వెంటనే దాన్ని కొనేశాడు. గత ఏడాదిలో ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడు. అప్పటినుంచి ట్విట్టర్ ఆదాయ మార్గాలపై మస్క్ దృష్టిపెట్టాడు.
ఆ తర్వాత నుంచి ట్విట్టర్‌లో అనేక మార్పులు చేశాడు. ట్విట్టర్ కంపెనీలో సీఈఓ స్థాయి నుంచి సాధారణ ఉద్యోగుల వరకు అందరిని ఇంటికి పంపేశాడు. ట్విట్టర్ బ్లూ టిక్ పాలసీని కూడా తీసుకొచ్చాడు. ట్విట్టర్ పరంగా ఎలాంటి ఆదాయం వచ్చేది ఉన్నా వదిలిపెట్టేది లేదంటున్నాడు మస్క్.. అలాంటిది ట్విట్టర్ డేటాను మరో టెక్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ అప్పనంగా వాడేస్తామంటే మస్క్ ఊరుకుంటాడా? ముక్కు పిండి మరి డబ్బులు వసూలు చేస్తాడు.
ట్విట్టర్ డెవలపర్ డీల్ ఉల్లంఘనపై ఆరోపణ :
చాలా కంపెనీలు తమ కార్యకలాపాల కోసం ట్విట్టర్ డేటాను వినియోగిస్తుంటాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా తమ డేటాను వినియోగిస్తుందని ట్విట్టర్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో మస్క్ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్ల (Satya Nadella)కు లేఖ ద్వారా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఎలన్ మస్క్ వ్యక్తిగత లాయర్ అయిన అలెక్స్ స్పిరో (Alex Spiro)తో ట్విట్టర్ తరపున సత్య నాదేళ్లకు లేఖ పంపారు. ట్విట్టర్ డెవలపర్ ఒప్పందాన్ని ఎక్కువ కాలం పాటు మైక్రోసాఫ్ట్ ఉల్లంఘించిందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
మైక్రోసాఫ్ట్ యాప్స్‌లో టెక్ దిగ్గజం కార్యకలాపాలపై రివ్యూ చేయగా.. మైక్రోసాఫ్ట్ చాలా కాలం పాటు ఒప్పందంలోని అనేక నిబంధనలను ఉల్లంఘించి ఉండవచ్చునని సూచిస్తుంది. మైక్రోసాఫ్ట్ Xbox, Bing సెర్చ్, కంపెనీ యాడ్స్ ప్లాట్‌ఫారమ్ వంటి 8 వేర్వేరు ట్విట్టర్ ఏపీఐ(Twitter API)లను ఏకీకృతం చేసింది. ఈ ఎనిమిది ట్విట్టర్ API యాప్‌లను (మైక్రోసాఫ్ట్ యాప్‌లు) రిజిస్టర్ అయ్యాయి. ఇందులో భాగంగానే ట్విట్టర్ డెవలపర్ ఒప్పందం, కంపెనీ విధానానికి అనుగుణంగా మైక్రోసాఫ్ట్ అంగీకరించింది.

Elon Musk sends letter to Satya Nadella, accuses Microsoft of using Twitter data illegally
మైక్రోసాఫ్ట్‌పై దావా వేస్తా : మస్క్ హెచ్చరిక..
మైక్రోసాఫ్ట్ యాప్స్ ట్విట్టర్ APIలను 780 మిలియన్ సార్లు యాక్సెస్ చేసింది. 2022లోనే 26 బిలియన్ల ట్వీట్‌లను తిరిగి పొందిందని లేఖలో పేర్కొంది. వాస్తవానికి, మైక్రోసాఫ్ట్ యాప్స్‌లో ఒకదాని కోసమే మైక్రోసాఫ్ట్ అకౌంట్ డేటా వినియోగదారులను అనుమతించాలని భావిస్తున్నట్లు లేఖలో ట్విట్టర్ పేర్కొంది. నిబంధనలను విరుద్ధంగా అధిక డేటాను మైక్రోసాఫ్ట్ వాడుకుందని, ఎలాంటి అనుమతి లేకుండా ట్విట్టర్ డేటాను ప్రభుత్వ ఏజెన్సీలతో షేర్ చేసినట్టు ట్విట్టర్ ఆరోపించింది. ఈ విషయంలో గత నెలలోనే ఎలన్ మస్క్ మైక్రోసాఫ్ట్‌పై దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.
ట్విట్టర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (API) రుసుములను చెల్లించేందుకు మైక్రోసాఫ్ట్ నిరాకరిండమే కాకుండా తమ యాడ్స్ ప్లాట్‌ఫారమ్ నుంచి ట్విట్టర్‌ను తొలగించింది. ఈ నేపథ్యంలోనే మస్క్ స్పందించాడు. తమ ట్విట్టర్ డేటాను ఉపయోగించి చట్టవిరుద్ధంగా మైక్రోసాఫ్ట్ తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ట్రైనింగ్ ఇచ్చిందని మస్క్ ఆరోపించారు. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్‌పై దావా వేస్తానని మస్క్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ట్విట్టర్ ఆరోపణలపై మైక్రోసాఫ్ట్ స్పందన :
ట్విట్టర్ డేటా ఆరోపణలపై మైక్రోసాఫ్ట్ స్పందించింది. ప్రస్తుత ట్విట్టర్ డేటాకు మైక్రోసాఫ్ట్ ఎలాంటి చెల్లింపులు చేయడం లేదని టెక్ దిగ్గజం స్పష్టం చేసింది. మస్క్ పంపిన లేఖను పరిశీలించిన అనంతరం తమ నిర్ణయాన్ని చెబుతామని ప్రకటించింది. ట్విట్టర్ కంపెనీతో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని కొనసాగించాలని భావిస్తున్నామని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం.. మైక్రోసాఫ్ట్ అభ్యర్థించిన సమ్మతి ఆడిట్‌తో పూర్తి సహకారాన్ని అందించాలని మస్క్ లాయర్ లేఖలో పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ అభ్యర్థించిన సమాచారాన్ని వచ్చే జూన్ 7లోగా అందించాలని ట్విట్టర్ లేఖలో సూచించింది.