సోలేమానీ అంత్యక్రియల్లో తొక్కిసలాట..35మంది మృతి

సోలేమానీ అంత్యక్రియల్లో తొక్కిసలాట..35మంది మృతి

బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో శుక్రవారం(జనవరి-3,2020) కారులో వెళ్తున్న టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమానీపై అమెరికా ద‌ళాలు జరిపిన వైమానిక దాడిలో సొలేమ‌ని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్‌లో సోమవారం(జనవరి-6,2020) సోలెమని శ‌వ‌యాత్ర చేప‌ట్టారు. లక్షల సంఖ్యలో ప్రజలు,సోలేమానీ అభిమానులు ఈ  అంతిమ‌యాత్ర‌లో పాల్గొన్నారు. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ త‌ర్వాత సులేమానీ స్వంత పట్ట‌ణం కిర్మ‌న్‌లో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.

అయితే దురదృష్టవశాత్తూ సోలేమానీ అంత్యక్రియల సమయంలో తొక్కిసలాట చోటుచేసుకోవడంతో.. 35 మంది మృతి చెందగా,190 మంది గాయపడినట్టు ఇరాన్‌ ప్రభుత్వ చానల్‌ తెలిపింది. గాయపడినవారు ప్రస్తుతం హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నట్లు తెలిపింది. సులేమానీ స్వస్థలం కెర్మన్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఆ దేశ ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీస్‌ చీఫ్‌ కౌలివాండ్‌ ధ్రువీకరించారు. సులేమానీ అంతిమయాత్రలో పాల్గొనేందుకు లక్షలాది మంది ఇరానీయులు తరలివచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటుచేసుకున్నట్టుగా తెలిపారు.

ఇందుకు సంబంధించిన వీడియోలను కొందరు ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేయగా.. అందులో పలువురు రోడ్డుపై విగత జీవులుగా కనిపించగా.. మరికొందరు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తూ కనిపించారు.  సులేమానీ అంతిమయాత్రలో ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ సహా సుప్రీం లీడర్‌ అయాతుల్లా అలీ ఖమేనీ పాల్గొని అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేసిన విషయం తెలిసిందే.