లాక్‌డౌన్‌ వల్ల ఉద్యోగం పోవడంతో ముగ్గురు కుమార్తెలను బావిలోకి తోసి తానూ ఆత్మహత్య

  • Published By: bheemraj ,Published On : August 8, 2020 / 10:30 PM IST
లాక్‌డౌన్‌ వల్ల ఉద్యోగం పోవడంతో ముగ్గురు కుమార్తెలను బావిలోకి తోసి తానూ ఆత్మహత్య

లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి లేక వేల సంఖ్యలో జనం రోడ్డున పడగా.. వందల సంఖ్యలో ఆకలి చావులు నమోదయ్యాయి. కరోనా వల్ల కంపెనీలు కుదేలవడంతో సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు కుటుంబ బాధ్యతను ఎలా మోయాలో తెలియక మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అలాంటి సంఘటనే మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

లాక్‌డౌన్‌ వల్ల ఉద్యోగం పోవడంతో ఓ వ్యక్తి తన ముగ్గురు కుమార్తెలను బావిలోకి తోసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కథనం ప్రకారం.. బింద్‌ జిల్లా అందియారి గ్రామానికి చెందిన రాజేశ్‌ రాజక్ (42) ముంబైలో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగించేవాడు.

లాక్‌డౌన్‌ కారణంగా ఇటీవల అతడి ఉద్యోగం పోయింది. దీంతో రాజేశ్‌ తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. రాజేశ్‌కు భార్య నలుగురు కుమార్తెలున్నారు. ఉద్యోగం పోవడంతో వారిని సాకేదెలా అని తరచూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఆర్థిక పరిస్థితిపై భార్యతో చర్చలు జరుపుతూ అసహనం వ్యక్తం చేసేవాడు.

ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇదే విషయంపై భార్యభర్తలిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తరువాత రాజేశ్‌ తన ముగ్గురు కుమార్తెలు అనుష్క (10), చైనా (8), సంధ్య (5)లను ఇంటి సమీపంలోని బావి వద్దకు తీసుకెళ్లి నడుముకి తాడు కట్టి అందులో తోసేసి తానూ దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

శనివారం ఉదయం బావిలో మృతదేహాలను గుర్తించిన స్థానికులు… పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీశారు. కేసు నమోదు చేసుకొని విచారిస్తామని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేశ్‌ హింగాంకర్ పేర్కొన్నారు. కాగా రాజేశ్‌కు మరో రెండున్నరేళ్ల కుమార్తె ఉండటం గమనార్హం.