Falaknuma Express: ఫలక్నామా ఎక్స్ప్రెస్లో భారీ అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన రైలు బోగీలు
రైలు భోగీల నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఆరు ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి.

Falaknuma Express Fire Accident: బాలాసోర్ ప్రమాదం మరువక ముందే ఫలక్నామా ఎక్స్ప్రెస్ భారీ ప్రమాదానికి గురైంది. తెలంగాణలోని భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే రైలులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైలు భోగీల నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే కొద్ది మంది ప్రయాణికులకు మాత్రం స్వల్పకాలిక గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఆరు ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. సహాయక చర్యలు చేపడుతున్నట్లు స్థానిక రైల్వే అధికారులు తెలిపారు.
#Fire broke out in the bhogies of #Howrah bound Falaknuma Express near Bhongir in Yadadri district, #Telangana. Six fire tenders on the spot. Rescue operation underway.@DeccanChronicle @oratorgreat @SCRailwayIndia @rpfscr @TelanganaDGP @TelanganaFire pic.twitter.com/t58VzYPh3F
— Pinto Deepak (@PintodeepakD) July 7, 2023
బెంగాల్ నుండి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్ నామా ఎక్స్ ప్రెస్లో భువనగిరి మండలం బోమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్యలోకి రాగానే పొగలు కనిపించాయి. రెండు బోగిలు పూర్తిగా మంటల్లో చిక్కుకున్నాయి. రైలు నుంచి పెద్ద ఎత్తున దట్టమైన పొగలు వచ్చాయి. మొత్తం S4, S5, S6, S7 అనే నాలుగు బోగీలు ప్రమాదంలో చిక్కుకున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని చెబుతున్న రైల్వే వర్గాలు తెలిపాయి. మొదట పొగ రాగానే లోకో పైలట్ గమనించి రైలుని నిలిపివేశారు. రైల్వే సిబ్భంది వెంటనే ప్రయాణికుల్ని దింపేశారు.
అగ్ని ప్రమాదానికి గురైన బోగీలను సిబ్బంది రైల్ నుండి విడదీశారు. నాలుగు బోగీలను అక్కడే వదిలేసి రైలును సికింద్రాబాద్ పంపేందుకు సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఫలక్నామా ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ బయల్దేరనున్నట్లు తెలుస్తోంది. ఇక స్థానిక డీసీపీ రాజేష్ చంద్ర ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.