ఈ నగరానికి ఏమైంది.. గంజాయి మత్తులో హైదరాబాద్ యువత, చేతులారా జీవితాలు నాశనం

  • Published By: naveen ,Published On : November 5, 2020 / 05:18 PM IST
ఈ నగరానికి ఏమైంది.. గంజాయి మత్తులో హైదరాబాద్ యువత, చేతులారా జీవితాలు నాశనం

hyderabad youth addicting to ganja: యువత జీవితాలను గంజాయి చిత్తు చేస్తోందా..? గంజాయి మత్తులో స్నేహితులే…శత్రువులుగా మారుతున్నారా..? ఒకరిపై ఒకరు దాడులు.. చివరకు హత్యలకు సైతం వెనకాడటం లేదా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే ఇందుకు నిదర్శనం. గంజాయి మహమ్మరి బిజినెస్ మాఫియాకు కాసులు పండిస్తుంటే, బానిసైన యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది.

గంజాయి మత్తులో గొడవలు, ఘర్షణలు:
గంజాయి మత్తుకు యువకులు బానిసలుగా మారిపోతున్నారు. గంజాయి మత్తు నషాలానికి ఎక్కడంతో స్నేహితులపైనే దాడులకు తెగబడుతున్నారు. నిషా మత్తులో ఏం చేస్తున్నామో కూడా తెలీకుండా.. హత్యాయత్నానికి కూడా వెనుకడుగు వేయడం లేదు. ఈ మధ్య హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇలాంటి కేసులు ఎక్కువ అవుతుండటంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భాగ్యనగరంలో గంజాయి గుప్పు.. మత్తు కోసం యువత తహతహ.. పెద్ద ఎత్తున క్యూ కడుతున్న యువత.. గంజాయి మత్తులో గొడవలు, ఘర్షణలు.. అప్పుడప్పుడు ప్రాణాలు సైతం బలి.. స్నేహితులే శత్రువులుగా మారుతున్న వైనం.. కోట్లు దండుకుంటున్న వ్యాపారులు.. జీవితాలు నాశనం చేసుకుంటున్న యువత..

బిజినెస్ మాఫియాకు కాసులు:
గంజాయి.. యువత జీవితాలను మత్తులో ముంచేస్తోంది. చిన్నాపెద్ద తేడా లేకుండా గంజాయి మత్తులో తూగుతున్నారు. ఫ్యాషన్‌గా ప్రారంభించి బానిసలుగా మారి చివరికి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గతంలో సిగరెట్‌, దాని నుంచి మద్యం సేవించడం విద్యార్థులు ఫ్యాషన్‌గా భావించేవారు. ప్రస్తుతం ఆ రెండింటిని దాటి గంజాయి స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ గంజాయి మహమ్మరి బిజినెస్.. మాఫియాకు కాసులు పండిస్తుంటే, బానిసైన యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది.

మత్తులో మునిగిపోయేందుకు ఎంతైనా ఖర్చు చేస్తారు:
గంజాయి..ఈ పేరు అందరికీ తెలుసు. దీని రుచి మాత్రం కొందరికే తెలుసు. ఒక్కసారి టేస్ట్‌ చేస్తే చాలు ఎవ్వరైనా టెంప్ట్‌ అవుతారు. మళ్లీ మళ్లీ ఈ మత్తు పదార్థం కావాలని అడుగుతారు. ఆ మత్తులో మునిగిపోయేందుకు ఎంతైనా ఖర్చు చేస్తారు. అందుకే ఈ మత్తు వ్యాపారం తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతోంది. బానిసల సంఖ్యను పెంచుకుంటోంది. నిరంతరం పోలీసుల గస్తీ ఉంటున్నా.. గంజాయి దందా ఏరులై పారుతూనే ఉంది. తెలిసో.. తెలియకో గంజాయి మత్తుకు చిత్తవుతోంది యువత. ఈ మత్తులో అయినవారిని ఇబ్బంది పెట్టేవారు కొందరుంటే.. చిన్నచిన్న తగాదాలతోనే ప్రాణాలు తీసేస్తున్నారు మరికొంతమంది. అయితే ఇటీవల ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌లో తరచూగా చోటు చేసుకుంటుండంతో…గంజాయి దందా భరతం పట్టే పనిలో పడ్డారు పోలీసులు.

గంజాయి మత్తులో దాడులు:
హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన వాటిలో.. మత్తు పదార్థాలకు అలవాటుపడిన వారి గొడవలే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అఫ్జల్‌ఘంజ్‌, చాదర్‌ఘాట్‌, మలక్‌పేట్‌, అంబర్‌పేట్‌, ముసారాంబాగ్‌ ప్రాంతాలలో యువకులు… గంజాయి మత్తులో దాడులకు తెగబడుతున్నారు. నగర శివారులోని బాలాపూర్ పీఎస్ పరిధిలో కూడా ఓ యువకునిపై హత్యాయత్నం జరిగింది. షాహిన్ నగర్‌కు చెందిన అమేర్ అనే యువకునిపై సద్దామ్ అనే రౌడీ షీటర్ గంజాయి మత్తులో కత్తులతో దాడి చేశాడు.

కొన్నిసార్లు ఫైన్లతో సరిపెట్టేస్తున్న పోలీసులు:
మత్తు పదార్థాల సరఫరాపై పోలీసులు నిఘా పెట్టినా.. చిన్నచిన్న మోతాదుల్లో మత్తు పదార్థాలు, గంజాయి సరఫరా అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిని కట్టడి చేయడం ఇబ్బందిగా మారింది. మరోవైపు గంజాయి నేరగాళ్లపై ఫిర్యాదులు వస్తే.. కొన్నిసార్లు ఫైన్లతో సరిపెట్టేస్తున్నారు. కొన్ని కేసుల్లో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినా… ఒక్కరోజు ఉంచి ఆ తర్వాత రోజు పంపించేయడం.. నామమాత్రపు జైలు శిక్షలు విధిస్తున్నారు. ఇలాంటి కేసులను పోలీసులు లైట్ తీసుకోవడం వల్లే… గంజాయి మత్తుతో నేరాలు పెరిగిపోతున్నాయని నగరవాసులు ఆరోపిస్తున్నారు.

తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి:
ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని, యువత కూడా తమ ఉజ్వల భవిష్యత్ నాశనం చేసుకోకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు. అలాగే పోలీసులు కూడా గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపాలి. లేదంటే మరెంతో మంది యువత గంజాయి మత్తులో పడి భవిష్యత్‌ను నాశనం చేసుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.