నిజాలు కక్కుతాడా : తెలంగాణ పోలీస్ కస్టడీలోకి రాకేష్

  • Published By: madhu ,Published On : February 13, 2019 / 08:13 AM IST
నిజాలు కక్కుతాడా : తెలంగాణ పోలీస్ కస్టడీలోకి రాకేష్

హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీని చేధించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని చంచల్ గూడ జైలు నుండి ఫిబ్రవరి 13వ తేదీ బుధవారం బంజారాహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇక్కడి నుండి నేరుగా బంజారాహిల్స్ ఏసీసీ ఆఫీసుకు తీసుకొచ్చారు. ఇతనితో పాటు శ్రీనివాస్‌ని కూడా అదుపులోకి తీసుకున్నారు.  వెస్ట్ జోన్ డీసీపీ, బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. వీరితో పాటు ఎక్స్ ప్రెస్ టీవీలో పనిచేసిన ఇద్దరు ఉద్యోగులను, టెట్రాన్ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 

చిగురుపాటి జయరాం భార్య పద్మశ్రీ శ్రిఖా చౌదరిపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. జయరాం హత్య హైదరాబాద్‌లో జరిగిందని పోలీసులు తేల్చారు. ఈ కేసును ఏపీ పోలీసులు తెలంగాణకు బదిలీ చేశారు. నందిగామ పోలీసులు చేసిన విచారణపై బంజారాహిల్స్ పోలీసులు స్టడీ చేశారు. ఐదు రోజులు తమ కస్టడీకి అప్పగించాలంటూ జూబ్లీహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం నిందితులను మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. 

జయరాం ఇంటి నుండి బయలుదేరినప్పటి నుంచి హత్య జరిగిన ఘటన వరకు సీన్ రీకన్ స్ట్రక్షన్స్ చేయాలని పోలీసులు నిర్ణయించారు. జయరాం ఎక్కడున్నాడు ? రాకేష్ రెడ్డి ఎలా కలిశాడు ? వీరి మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయా ? ఇందులో శ్రిఖా పాత్ర ఏమిటీ ? అనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇతని హత్యకు ఎవరెవరు సహకరించారనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై కూడా విచారించినట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద  హైవేపై కారులో జయరామ్‌ మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. జ‌య‌రాం అంతుచిక్క‌ని మ‌ర‌ణం వెన‌క ఎవ‌రు ఉన్న‌ది అనేది ఎప్పడు తేలుతుందో చూడాలి.