Kamareddy District : రూ.3లక్షలకే కిలో బంగారు హారం.. ఆఫర్ అదుర్స్ కదూ.. కట్ చేస్తే

Kamareddy District : అసలే గోల్డ్, ఆపై తక్కువ రేటు. భలే మంచి బేరం అని ఆనంద్ మురిసిపోయాడు. వారి వలలో చిక్కుకున్నాడు.

Kamareddy District : రూ.3లక్షలకే కిలో బంగారు హారం.. ఆఫర్ అదుర్స్ కదూ.. కట్ చేస్తే

Kamareddy District

Kamareddy District – Fake Gold : మోసగాళ్లు, కన్నింగ్ గాళ్లు ఎక్కువైపోయారు. అమాయకులు, అత్యాశపరులే వారి టార్గెట్. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. నిలువునా దోచేస్తారు. నిండా ముంచేస్తారు. అధిక డబ్బు, అధిక బంగారం ఆశ చూపెట్టి అడ్డంగా దోచుకుంటున్నారు. అదిరిపోయే ఆఫర్ అంటూ ఊరించి డబ్బుతో ఉడాయిస్తున్నారు. రూ.90లక్షల విలువైన రూ.500 నోట్లు ఇస్తే రూ.కోటి విలువైన రూ.2వేల నోట్లు ఇస్తామని ఘరానా మోసానికి పాల్పడిందో ముఠా. ఈ చీటింగ్ ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురంలో వెలుగుచూసింది. ఇది మరువకముందే తెలంగాణలో అదే తరహా ఫ్రాడ్ ఒకటి వెలుగుచూసింది. తక్కువ ధరకే బంగారం ఇస్తాం అంటూ మోసం చేశారు కేటుగాళ్లు.

తక్కువ ధరకు బంగారు హారం అమ్ముతామని ఆశ చూపి ఓ బట్టల వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు రూ.3లక్షలకు టోకరా వేశారు. బంగారు హారం బదులు నకిలీ హారం ఇచ్చి అక్కడి నుంచి ఉడాయించారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ లో చోటు చేసుకుంది.

Also Read.. Cyber Fraud : ఎన్టీఆర్ జిల్లాలో భారీ సైబర్ మోసం.. అకౌంట్ల నుంచి రూ.3 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

గ్రామానికి చెందిన ఆనంద్ బట్టల దుకాణం నడుపుతాడు. అతడి దుకాణానికి వచ్చిన కొందరు వ్యక్తులు బట్టలు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆనంద్ తో మాటలు కలిపారు. తమది మధ్యప్రదేశ్ అని, డిచ్ పల్లిలో ఉంటున్నామని చెప్పారు. తమ దగ్గర కిలో బంగారు హారం ఉందని, తక్కువ ధరకే ఇస్తామని అతడిని నమ్మించారు. అసలే గోల్డ్, ఆపై తక్కువ రేటు. భలే మంచి బేరం అని ఆనంద్ మురిసిపోయాడు. వారి వలలో చిక్కుకున్నాడు. రూ.3లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. డబ్బు తీసుకుని ఆ వ్యక్తులు ఆనంద్ కు బంగారు హారం ఇచ్చి వెళ్లిపోయారు.

ఆ తర్వాత బంగారు హారాన్ని నిపుణుల వద్దకు తీసుకెళ్లి టెస్ట్ చేయగా.. ఆనంద్ కు దిమ్మతిరిగిపోయే నిజం తెలిసింది. అది ఒరిజినల్ కాదు ఫేక్ గోల్డ్ అని బయటపడింది. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు లబోదిబోమన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఆనంద్ కు నకిలీ బంగారం అంటకట్టిన కేటుగాళ్లు డబ్బుతో పరారయ్యారు.

Also Read.. Parvathipuam : రూ.90 లక్షలు ఇస్తే రూ.కోటి ఇస్తారు.. ఆఫర్ అదిరిపోయింది కదూ.. టెంప్ట్ అయ్యారో

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మన అత్యాశే మోసగాళ్లకు వరంలా మారుతోంది. మన అత్యాశను వారు ఈ విధంగా క్యాష్ చేసుకుంటున్నారు. ఇలాంటి మోసాల పట్ల పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తూనే ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. అయినా, ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. కక్కుర్తితో ఇలాంటి ముఠా చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. ఫలితంగా మన దురాశ.. కేటుగాళ్లకు పెట్టుబడిగా మారుతోంది. అధిక డబ్బు, తక్కువ రేటుకే అధిక బంగారం ఇస్తామని ఎవరైనా చెబితే నమ్మొద్దని.. అది కచ్చితంగా మోసమే అనే విషయాన్ని గ్రహించాలని పోలీసులు చెబుతున్నారు.