Bus Accident : రెండు బస్సుల మధ్య ఇరుక్కుని వృధ్ధుడి మృతి

సికింద్రాబాద్‌లోని  రేతిఫైల్‌ బస్టాప్‌లో విషాదం చోటు చేసుకుంది. రెండు బస్సుల మధ్య ఇరుక్కుని ఓ వృద్ధుడు దుర్మరణం చెందాడు

Bus Accident : రెండు బస్సుల మధ్య ఇరుక్కుని వృధ్ధుడి మృతి

Old Man Died When He Got Stuck Between Two Buses

Bus Accident : సికింద్రాబాద్‌లోని  రేతిఫైల్‌ బస్టాప్‌లో విషాదం చోటు చేసుకుంది. రెండు బస్సుల మధ్య ఇరుక్కుని ఓ వృద్ధుడు దుర్మరణం చెందాడు. మృతుడ్ని దుర్గాప్రసాద్‌గా (73) గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు గోపాలపురం పోలీసులు. మృతుడి కుటుంబానికి ఫోన్‌ చేసి సమాచారం అందించారు.

రెతిఫైల్ బస్టాప్‌ కి వచ్చిన దుర్గా ప్రసాద్… రెండు బస్సుల మధ్యలోంచి  అవతలి పైపుకు  వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆసమయంలో ముందు ఉన్న బస్సు  డ్రైవర్ బస్సును వెనక్కి నడపడంతో ఆయన రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశాడు. అయితే ప్రయాణీకులు ఎవ్వరూ కాపాడేందుకు వెళ్లలేదు. ఆర్టీసీ సిబ్బంది పట్టించుకోలేదు. కొన్ని నిమిషాలకే అక్కడకు చేరుకున్న గోపాలపురం పోలీసులు కూడా ఆటోలో తరలించే ప్రయత్నం చేయలేదు. అంతా 108కు కాల్స్‌ చేస్తూ కాలయాపన చేశారు. అంబులెన్స్ వచ్చేలోగా ప్రాణాలు కోల్పోయాడు 73 ఏళ్ల దుర్గాప్రసాద్‌.

ఫోన్‌ చేస్తే 10 నిమిషాల్లో 108 అంబులెన్స్ చేరుకుంటుందంటారు. కానీ రేతిఫైల్‌ బస్టాప్‌కు చేరుకునేసరికి అరగంట పట్టింది. 108 రావటం ఆలస్యం కావంటంతో దుర్గాప్రసాద్‌ ఘటనా స్థలిలోనే తుదిశ్వాస విడిచాడు. అయితే అంతకుముందే అతన్ని ఆసుపత్రికి తరలించే అవకాశం ఉన్నా తోటి ప్రయాణీకులు కానీ ఆర్టీసీ అధికారులు కానీ, పోలీసులు కానీ పట్టించుకోలేదని విమర్శలు తలెత్తుతున్నాయి.

తీవ్ర గాయాలపాలై, నోటి నుంచి రక్తం కారుతున్నా అందరూ అంబులెన్స్‌ కోసం ఫోన్‌ చేస్తూనే ఉన్నారు… కానీ రోడ్డుకు అవతల ఉన్న శ్రీకార్‌ ఉపకార్‌ ఆసుపత్రి తరలించే ప్రయత్నం ఎవరూ చేయలేదు. కిలోమీటరు దూరంలో ఉన్న గాంధీ ఆసుపత్రికి ఆటోలో తరలించే ప్రయత్నమూ చేయలేదు. అరగంటకు తీరుబడిగా వచ్చిన 108 అంబులెన్స్‌ సిబ్బంది.. దుర్గాప్రసాద్‌ చనిపోయాడని చావు కబురు చెప్పి వెళ్లిపోయారు.

బస్సుల మధ్యలోంచి వెళితే ప్రాణాలతో చెలగాటమాడినట్లే. డ్రైవర్‌ బస్సు ముందు వెనక్కి పోనిచ్చే క్రమంలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. చాలామంది ఇవేవీ పట్టించుకోకుండా బస్సులు కదులుతున్నా వాటి మధ్యలోంచి వెళ్లిపోతుంటారు. దుర్గాప్రసాద్‌ కూడా ఇలానే వెళ్లి మృత్యువును కొని తెచ్చుకున్నాడు.