దిశపై అసభ్యకర పోస్టులు : 10మంది అరెస్ట్

  • Published By: veegamteam ,Published On : December 5, 2019 / 12:18 PM IST
దిశపై అసభ్యకర పోస్టులు : 10మంది అరెస్ట్

దిశ ఘటనలో సోషల్ మీడియా యూజర్ల అరెస్టుల సంఖ్య పెరుగుతోంది. దిశ ఘటనపై సోషల్ మీడియాలో అసభ్యకర, అనుచిత వ్యాఖ్యలు చేసిన నీచులను సైబర్ క్రైమ్ పోలీసులు వెతికి వెతికి పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10మందిని అరెస్ట్ చేశారు. వారందరిని రిమాండ్ కు తరలించి విచారిస్తున్నారు. 

దిశ ఘటనకు సంబంధించి పోలీసులు పలు హెచ్చరికలు జారీ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే అరెస్ట్ తప్పదని వార్నింగ్ ఇచ్చారు. దిశ ఘటనపై ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆచితూచి పోస్టులు పెట్టాలని యూజర్లకు చెప్పారు. లేదంటే కష్టాలు తప్పవన్నారు.

ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీరామ్, గుంటూరుకి చెందిన స్మైలీ నాని సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై సైబర్ నేరాలకు చెందిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దిశ హత్యాచార ఘటన యావత్ దేశాన్ని కంటతడి పెట్టించింది. దిశను బలితీసుకున్న ఆ నలుగురు మృగాళ్లను బహిరంగంగా ఉరి తీయాలంటూ దేశం మొత్తం నినదిస్తున్న వేళ.. కొందరు నీచులు మాత్రం మానవత్వాన్ని మరిచారు. విలువలు వదిలేశారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేశారు.

దిశ ఘటనను అశ్లీల, అసభ్యకర దృష్టి కోణంలో చూశారు. సోషల్ మీడియాలో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టి తమలోని పైశాచికత్వాన్ని చాటుకున్నారు. అలాంటి వారిని గుర్తించి మరీ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. మానవత్వం, విలువలు మర్చిపోయిన ఇలాంటి దుర్మార్గులను ఏం చేసినా పాపం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దిశ రేప్ అండ్ మర్డర్ కేసులో.. నలుగురు నిందితులుంటే.. ఆ ఘటనను సమర్థిస్తూ.. బాధితురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అరెస్టైన వాళ్లే ఎక్కువున్నారు. వీరిపై.. చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. వివిధ చోట్ల.. వారిపై పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదు చేశారు. దీంతో.. పోలీసులు వారిని వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు.