Violent Bihar: బీహార్ లో రైలును తగలబెట్టిన రైల్వే ఉద్యోగార్థులు

దాదాపు 200 మంది అభ్యర్థులు గయా రైల్వే స్టేషన్ కు చేరుకొని ఆగి ఉన్న ఓ రైలును తగలబెట్టారు. ఆర్.ఆర్.బీ పరీక్షలో అక్రమాలు జరిగాయని నిరసిస్తూ ఉద్యోగార్థులు ఆందోళనకు దిగారు.

Violent Bihar: బీహార్ లో రైలును తగలబెట్టిన రైల్వే ఉద్యోగార్థులు

Bihar

Violent Bihar: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలో అక్రమాలు జరిగాయని నిరసిస్తూ బీహార్ లో పలు చోట్ల ఉద్యోగార్థులు ఆందోళనకు దిగారు. గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ ఆందోళనలు మంగళ, బుధవారాల్లో హింసాత్మకంగా మారాయి. వేలాది మంది నిరసనకారులు బీహార్ లోని గయా, పాట్నా, నలంద, నవాదా, ఆరా, హాజిపూర్ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్‌లకు వెళ్లి రైలు పట్టాలపై రైలు రోకో చేశారు. గయాలో నిరసనలు హింసాత్మకంగా మారాయి. దాదాపు 200 మంది అభ్యర్థులు గయా రైల్వే స్టేషన్ కు చేరుకొని ఆగి ఉన్న ఓ రైలును తగలబెట్టారు. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు, గయా జిల్లా పోలీస్ యంత్రాంగం, నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. దింతో నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులు ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Also read: Padma Awards 2021 : పద్మ పురస్కారాలను తిరస్కరిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది

కాగా “2019లో పరీక్షకు నోటిఫికేషన్ ఇచ్చినా.. సీబీటీ-2 టెస్టు విషయంలో ఎలాంటి పురోగతి లేదు. తక్షణమే సీబీటీ-2 పరీక్షను రద్దు చేయాలంటూ” నిరసనకారులు వార్త సంస్థ ఏఎన్ఐ ప్రతినిధితో తెలిపారు. నిరసనల నేపథ్యంలో ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ, లెవల్​ 1 పరీక్షలను నిలిపివేస్తున్నట్లు భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. రైల్వేలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను నిరసిస్తూ పలుచోట్ల ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.  రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డుల(ఆర్​ఆర్​బీ) పరిధిలో జరిగిన పరీక్షల్లో పాస్​, ఫెయిల్​ అయినవారి ఫిర్యాదులను పరిశీలించేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Also read: Jio Phone 5G : జియో నుంచి అత్యంత చౌకైన 5G ఫోన్.. ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ఇక అల్లర్లపై గయా ఎస్​ఎస్​పీ ఆదిత్య కుమార్ స్పందిస్తూ ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. అభ్యర్థులు అశాంతియుతంగా నిరసన చేపట్టడంపై ఆదిత్య కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైలుకు నిప్పు పెట్టిన పలువురు నిరసనకారుల.. ముఖచిత్రాలను ప్రత్యేక సాంకేతికత సహాయంతో గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్​ఎస్​పీ ఆదిత్య కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని ఉద్యోగార్ధులను హెచ్చరించారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కమిటీ వేసిందని.. బోర్డు, అభ్యర్థుల వాదనలు విన్న తర్వాత కమిటీ.. రైల్వే శాఖకు నివేదిక సమర్పిస్తుందని రైల్వేశాఖ ప్రకటనలో తెలిపింది. కాగా నిరసనల నేపథ్యంలో బీహార్లోని పలు ప్రాంతాల నుంచి దేశంలోని వివిద ప్రాంతాలకు చేరుకోవాల్సిన రైళ్లకు అంతరాయం ఏర్పడింది. గయా మీదుగా వచ్చే అన్ని రైళ్లు ఆలస్యంగా నడిచాయి.

Also read: Arunachal Youth : బోర్డర్‌లో మిస్సైన అరుణాచల్ యువకుడిని అప్పగిస్తానన్న చైనా..