పాస్ కావాలంటే పక్కలోకి రావాల్సిందే, పీజీ విద్యార్థినికి డాక్టర్ వేధింపులు

  • Published By: naveen ,Published On : September 13, 2020 / 01:32 PM IST
పాస్ కావాలంటే పక్కలోకి రావాల్సిందే, పీజీ విద్యార్థినికి డాక్టర్ వేధింపులు

గురువు అంటే దైవంతో సమానం. గురువు వృత్తికి ఎంతో గౌరవం ఇస్తారు. పిల్లలకు పాఠాలు నేర్పి వారిని తీర్చిదిద్దే బాధ్యత గురువులదే. అయితే కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు గురువులు, పవిత్రమైన వృత్తికి కళంకం తెస్తున్నారు. కోరికలు తీర్చాలని విద్యార్థినులను వేధిస్తున్నారు. గ్రేడ్ కావాలంటే కోరిక తీర్చాల్సిందే అంటూ పీజీ విద్యార్థిని సీనియర్ డాక్టర్ వేధించాడు. ఈ దారుణం చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో చోటు చేసుకుంది.

అంబేద్కర్ హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ వివేక్ చౌదరి తనను లైంగికంగా వేధించినట్టు పీజీ విద్యార్థిని ఆరోపించింది. చౌదరి చాలా సీనియర్ డాక్టర్. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే రీజినల్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్ కి డైరెక్టర్, ప్రొఫెసర్ గా ఉన్నారు. మెడికల్ ఎగ్జామ్ లో గ్రేడ్ కావాలంటే కోరిక తీర్చాలని డాక్టర్ చౌదరి వేధించినట్టు బాధితురాలు ఆరోపణలు చేసింది.

బాధితురాలు దీనిపై రాష్ట్ర మహిళా కమిషన్ ను ఆశ్రయించింది. డాక్టర్ చౌదరిపై ఫిర్యాదు చేసింది. కోరిక తీర్చనందుకు సెకండియర్ ఫైనల్ ఎగ్జామినేషన్ లో తనను డాక్టర్ చౌదరి ఫెయిల్ చేశారని బాధితురాలు వాపోయింది. దీనిపై మహిళా కమిషన్ చీఫ్ కిరణ్ మయి నాయక్ స్పందించారు. బాధితురాలి ఫిర్యాదు నమోదు చేసుకున్నట్టు వెల్లడించారు. డాక్టర్ చౌదిన పంపిన అసభ్యకర మేసేజ్ లకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను బాధితురాలు తమకు సమర్పించినట్టు తెలిపారు. సెప్టెంబర్ 23న జరిగే విచారణకు హాజరుకావాలని డాక్టర్ చౌదరికి మహిళా కమిషన్ నోటీసులు పంపింది.

దీనిపై డాక్టర్ చౌదరి స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. అందులో వాస్తవం లేదన్నారు. డాక్టర్ కావడానికి ఆ విద్యార్థినికి అర్హత లేదని, ఆమె డాక్టర్ అయితే సమాజానికి హాని జరుగుతుందని, అలాంటి విద్యార్థిని నేను ఎలా పాస్ చేస్తాను అని ప్రశ్నించారు. మెడికల్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన పీజీ విద్యార్థిని ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరం అని డాక్టర్ చౌదరి వాపోయారు. నేను కావాలనే ఆమెని ఫెయిల్ చేసినట్టు ఆరోపణలు చేయడం నిరాధారం అని చెప్పారు.