చిన్నారుల అశ్లీల ఫొటోలు 12% భారత్ నుంచే.. UNICEF రిపోర్టు!

  • Published By: sreehari ,Published On : August 4, 2020 / 03:13 PM IST
చిన్నారుల అశ్లీల ఫొటోలు 12% భారత్ నుంచే.. UNICEF రిపోర్టు!

ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల అశ్లీల ఫొటోల్లో 12 శాతం భారత్ నుంచే ఉన్నాయని యునిసెఫ్ నివేదిక వెల్లడించింది. ప్రత్యేకించి భారతదేశంలో చిన్నారులపై నేరాలు, హింస కేసులు పెరిగిపోతున్నాయని పేర్కొంది. దేశంలో చిన్నారులపై నేరాల నిర్మూలన అంశంపై అధ్యయన నివేదికను తాజాగా విడుదల చేసింది.

ఇందులో ప్రతిరోజూ 25వేలకు పైగా ఇలాంటి ఫొటోలను ఇంటర్నెట్‌లో అప్ లోడ్ అవుతున్నాయని తెలిపింది. ఈ ఫొటోలకు సంబంధించి బాధితుల్లో 80 శాతం బాలికలే ఉన్నారని వెల్లడించింది. పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో శిక్షల శాతం స్వల్పంగా పెరిగాయని పేర్కొంది. పెండింగ్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయని తెలిపింది. నేరాలను అరికట్టేందుకు మరిన్ని కఠిన చట్టాలు తీసుకురావాలని సూచించింది.



అంతేకాదు.. సంబంధిత విభాగాలకు అవసరమైన నిధులు విడుదల చేయాలని యునిసెఫ్ సూచించింది. చిన్నారులు హింసకు గురికాకుండా సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకోవాలని వెల్లడించింది. 18 ఏళ్లలోపు బాలికలు ఎక్కువగా లైంగిక వేధింపులకు గురవుతున్నారని, బాధితుల్లో 12-18 ఏళ్ల వయసున్న వారు 86.79 శాతం ఉన్నారని పేర్కొంది.

ఇక బాలురలో 41.05 శాతం బాధితులు 6-16 ఏళ్ల లోపు ఉన్నారు. 92.58 శాతం బాధితులు 0-16 ఏళ్ల మధ్య ఉన్నవారే ఉన్నారు. 94.6 శాతం లైంగిక వేధింపుల కేసుల్లో.. నిందితులు బాధితులకు తెలిసిన వారే ఉంటున్నారు. 2-4 ఏళ్లలోపు చిన్నారుల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు క్రమశిక్షణ పేరుతో వేధింపులకు గురవుతున్నారు. 2-17 ఏళ్లలోపు ప్రతి ఇద్దరు చిన్నారుల్లో ఒకరు ఏటా ఏదో ఒకరకంగా హింసకు గురవుతున్నారని నివేదిక వెల్లడించింది.



చిన్నారులపై వేధింపులు, హింసను అరికట్టేందుకు యునిసెఫ్ కొన్ని సూచనలు చేస్తోంది. హింసకు తావులేని సమాజంలో బాలబాలికలు పెరిగే వాతావరణం కల్పించాలని సూచించింది. బాధితులకు తగిన భద్రత, సహాయం, న్యాయం కల్పించాల్సిందిగా తెలిపింది. బాధిత చిన్నారులు మానసికంగా కోలుకునేందుకు సాయం చేయాలని సూచించింది.పోక్సో, బాలల న్యాయ, విద్యాహక్కు చట్టాలను సమర్థంగా అమలు చేసేందుకు సంబంధిత సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి.



బాధితులకు న్యాయ సంబంధిత సేవలతో పాటు పరిహారం వెంటనే అందించేలా చూడాలి. బాలల సంరక్షణ కేంద్రాలు, గురుకుల పాఠశాలలు, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సిబ్బంది, చిన్నారులకు అవగాహన కల్పించాలి. అత్యవసర సేవల నంబర్లు అందుబాటులో ఉంచాలి. పిల్లల సంరక్షణ బాధ్యతలను సంబంధిత విభాగాలు తప్పనిసరిగా నిర్వర్తిస్తుండాలి. చిన్నారుల బాధితులను వెంటనే గుర్తించి వారికి సత్వర న్యాయం అందించేలా చూడాలని యునిసెఫ్ నివేదికలో సూచించింది.