ఆన్ లైన్ విద్యతో విద్యార్థుల్లో ఆందోళన

  • Published By: sreehari ,Published On : August 20, 2020 / 05:00 PM IST
ఆన్ లైన్ విద్యతో విద్యార్థుల్లో ఆందోళన

కరోనా వైరస్‌ వ్యాప్తితో దేశ వ్యాప్తంగా యూనివర్శిటీలు, స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.. కరోనా కారణంగా స్కూళ్లకు విద్యార్థులు వెళ్లే పరిస్థితి లేదు.. స్కూళ్లకు బదులుగా ఆన్ లైన్‌లోనే విద్యార్థులకు చదువు చెబుతున్నాయి.

ఆన్‌లైన్‌ విద్య అన్ని వర్గాల విద్యార్థులకు అందుబాటులో ఉండటం లేదు. దేశంలో దాదాపు 27 శాతం మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ విద్యకు నోచుకోవడం లేదు.. స్మార్ట్‌ఫోన్‌లు, లాప్‌టాప్‌లు లేవని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యూకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (NCERT) సర్వే తేల్చింది.



ఈ సర్వేలో మొత్తం 34 వేల మంది పాల్గొన్నారు. వీరిలో కేంద్రీయ యూనివర్శిటీలు, నవోద్యయ విద్యాలయాలు, సీబీఎస్‌ఈ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్కూల్‌ ప్రిన్సిపల్‌లు ఉన్నారు. ప్రతీ ముగ్గురిలో ఓ విద్యార్థి ఆన్‌లైన్‌ విద్య ఇబ్బందిగా ఉందని అంటున్నారు.

కరెంట్‌ కొరత కూడా ఆన్‌లైన్‌ విద్యకు ఆటంకంగా మారినట్లు 28 శాతం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రభావవంతమైన విద్య కోసం సెల్‌ఫోన్లు, లాప్‌ట్యాప్‌ ఇతర వస్తువులను వాడటంలో విద్యార్థులకు అవగాహన లేకపోవటం, ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ విద్యను భోదించే పద్దతులు తెలియకపోవటం కూడా కారణాలుగా చెప్పవచ్చు.



దాదాపు 36 శాతం మంది విద్యార్థులు తమ పాఠ్యపుస్తకాలు, ఇతర పుస్తకాలను వాడుతున్నారని, ఉపాధ్యాయులకు, ప్రిన్సిపల్‌లు లాప్‌ట్యాప్‌లపై ఎక్కువ మక్కువ చూపుతున్నారని పేర్కొంది. ఆన్‌లైన్‌ విద్య కోసం టీవీలు, రేడియోలను అతి తక్కువగా వినియోగిస్తున్నారని వెల్లడించింది.

ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉన్న ఈ-పాఠ్య పుస్తకాలపై సరైన అవగాహన లేదని విద్యార్థులకు ఇబ్బందిగా మారిందని తెలిపింది. ఆన్‌లైన్‌ విద్యలోనూ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ బోధన‌ అవసరం ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు చెబుతున్నారు.