కేసీఆర్ వల్లే  రాజకీయ జీవితం: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • Published By: chvmurthy ,Published On : February 4, 2019 / 11:29 AM IST
కేసీఆర్ వల్లే  రాజకీయ జీవితం: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్:  తెలంగాణా సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి సోమవారం ప్రశంసల జల్లు కురిపించారు. ఒకప్పుడు కేసీఆర్ ను తీవ్ర విమర్శలు చేసిన జగ్గారెడ్డి ఇప్పుడు పొగడ్తల్లో ముంచెత్తారు. బీజేపీలో రాజకీయంగా అణగ దొక్కబడిన తర్వాత 2001లో కేసీఆర్ పిలిచి సంగారెడ్డి టికెట్ ఇచ్చారని చెప్పారు. 2004లో టిఆర్ఎస్ టికెట్ పై పోటీచేసి గెలిచి కేసీఆర్ వల్ల రాజకీయ పునరుజ్జీవం పొందానని జగ్గారెడ్డి అన్నారు. నన్ను జైల్లో పెట్టడంవల్లే మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాను అని, ఆయన అంటూ కేసీఆర్ కుటుంబంతో ఎటువంటి వైరంలేదని, రాజకీయంగా విమర్శలు చేశాను తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడూ విమర్శలు చేయలేదని చెప్పారు. 

హరీష్ కన్నా కేటీఆర్ చాలా ఫెయిర్ అని, హరీష్ రావు బ్లాక్ మెయిలర్ అని జగ్గారెడ్డి ఆరోపించారు. హరీష్ రావు ఉనికి కోసమే నన్ను పాస్ పోర్టు కేసులో ఇరికించి  జైల్లో పెట్టించాడని తెలిపారు. జైల్లో పెట్టడంవల్లే మళ్ళీ ఎమ్మెల్యే అయ్యానని, జైలుకు వెళ్లడం వల్లే నాకూతురు జయారెడ్డి రాజకీయ వారసురాలిగా తెరపైకి వచ్చిందని తెలిపారు. ఒకవైపు కేసీఆర్ ను పొగుడుతూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీని విమర్శించారు జగ్గారెడ్డి. నాకు కష్టం వస్తే పార్టీ ఆదుకుంటుందన్న విశ్వాసం పోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని.. పార్టీ మారే ఆలోచన లేదని స్పృష్టం చేశారు. రాహుల్ అంటే నాకు పిచ్చిఅని, ఆ ముఖంలో చరిష్మా ఉందని, ప్రజలకోసమే గాంధీ కుటుంబం బతుకుతోందని జగ్గారెడ్డి సొంత పార్టీపైనా తన అభిమానం చాటుకున్నారు.