Hijab Deaths in Iran :  ఇరాన్‌లో ‘హిజాబ్’ మరణాలు .. హిజాబ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ 326 మృతి

మతనిబంధనల పేరుతో ఇరాన్‌లో ఊచకోత సాగుతోంది. మనిషి సుఖంగా జీవించడం కోసం పుట్టుకొచ్చిన మతాన్ని అడ్డుపెట్టుకుని...అమాయకుల ఉసురు తీస్తోంది ఇరాన్ ప్రభుత్వం. అన్యాయంపై ఎదురుతిరగడమే ఆ దేశ పౌరులు చేస్తున్న పాపం. ఇదే మని ప్రశ్నించిన నేరానికి వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దేశంలో ప్రతిరోజూ హిజాబ్ మరణాలు వెలుగుచూస్తున్నాయి. హిజాబ్ వ్యతిరేక ఆందోళనల్లో చనిపోయిన వారి సంఖ్య 326కు చేరింది.

Hijab Deaths in Iran :  ఇరాన్‌లో ‘హిజాబ్’ మరణాలు .. హిజాబ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ 326 మృతి

326 Hijab Deaths in Iran

Hijab Deaths in Iran : మతనిబంధనల పేరుతో ఇరాన్‌లో ఊచకోత సాగుతోంది. మనిషి సుఖంగా జీవించడం కోసం పుట్టుకొచ్చిన మతాన్ని అడ్డుపెట్టుకుని…అమాయకుల ఉసురు తీస్తోంది ఇరాన్ ప్రభుత్వం. అన్యాయంపై ఎదురుతిరగడమే ఆ దేశ పౌరులు చేస్తున్న పాపం. ఇదే మని ప్రశ్నించిన నేరానికి వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దేశంలో ప్రతిరోజూ హిజాబ్ మరణాలు వెలుగుచూస్తున్నాయి. హిజాబ్ వ్యతిరేక ఆందోళనల్లో చనిపోయిన వారి సంఖ్య 326కు చేరింది.

ఇరాన్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తున్నా హిజాబ్ వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతూనే ఉంది. మత నిబంధనల పేరుతో జరుగుతున్నఅన్యాయాన్ని, అరాచకాన్ని ప్రజలు ప్రశ్నిస్తూనే ఉన్నారు. లాఠీఛార్జ్, చిత్రహింసలు, అరెస్టులు, కాల్పులను ఆందోళనకారులు లెక్కచేయడం లేదు. హిజాబ్ ధరించేదిలేదని తేల్చిచెబుతున్నారు. ఆందోళనలు ఎంత బలంగా జరుగుతున్నాయో…ప్రభుత్వం అంతకన్నా ఎక్కువ అమానుషానికి దిగుతోంది. పిల్లలపై సైతం ఇరాన్ భద్రతాదళాలు కనికరం చూపడం లేదు. దీంతో స్వేచ్ఛ, కనీస హక్కు, గౌరవం కోసం జరుగుతున్న పోరాటంలో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సెప్టెంబరు 16 నుంచి ఇప్పటిదాకా హిజాబ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 326 అని ఓస్లోకు చెందిన ఓ NGO తెలిపింది. వీరిలో 43 మంది చిన్నారులు కాగా, 25 మంది మహిళలు. ఇక లెక్కకు తేలని మరణాలు ఎన్నున్నాయో తెలియదు.

హిజబ్ ధరించలేదని పోలీసులు కస్టడీలోకి తీసుకున్న అమ్ని అనే యువతి సెప్టెంబరు 16న చనిపోయిన తర్వాత ఇరాన్ భగ్గుమంది. అమ్నీని అరెస్టు చేసి..మూడు రోజుల పాటు చిత్రహింసలు పెట్టారు మోరల్ పోలీసులు. చికిత్స పొందుతూ అమ్ని చనిపోయింది. ఈ దారుణం తర్వాత ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హిజాబ్ ధరించకపోవడం నేరం కాదని నమ్మిన ప్రజలంతా…వెల్లువలా వీధుల్లోకి తరలివచ్చారు. ఆందోళనలు నగరాలను దాటి పట్టణాలు, పల్లెలకూ విస్తరించాయి. భద్రతాబలగాలు..మోరల్ పోలీసులు విచక్షణా రహితంగా విరుచుకుపడుతున్నా…..ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఇది చూసిన తర్వాత కూడా ఇరాన్ ఛాందసవాద ప్రభుత్వం తన విధానాలు మార్చుకోవడం లేదు.

మృతుల సంఖ్య సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఎక్కువగా ఉంది. ఇక్కడ మొత్తం 123 మంది ఆందోళనకారులు చనిపోయారు. వారిలో ఎక్కువమంది సెప్టెంబరు 30న జరిగిన పోలీసుల కాల్పుల్లో మరణించారు. చాబ్‌హార్ అనే నగరంలో కస్టడీలో ఉన్న 15 ఏళ్ల యువతిపై పోలీస్ కమాండర్ అత్యాచారం ఘటన వెలుగుచూసిన తర్వాత భారీగా ఆందోళనలు జరిగాయి. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు కాల్పలు జరిపారు.

ఇరాన్ వ్యవహారాలపై అంతర్జాతీయ దర్యాప్తు జరపాలని, వీలయినంత తొందరగా పరిష్కార మార్గం చూపాలని మానవహక్కుల సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఆందోళనకారులపై అణిచివేతకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కోరింది. ఇందుకోసం ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న పిటిషన్‌పై పదిలక్షలమంది సంతకం చేశారు. ఇంత జరుగుతున్నా….ఇస్లామ్ చట్టాన్ని, నిబంధనలను బలవంతంగా అమలుచేసేందుకు ప్రయత్నిస్తున్న ఇరాన్ ప్రభుత్వం మాత్రం తమ అరాచకాలను ఆపడం లేదు.