దుబాయ్ వెళ్తున్నారా?: UAE కొత్త ఐదేళ్ల VISA స్కీమ్ అంటే తెలుసా?  

  • Published By: sreehari ,Published On : January 11, 2020 / 03:03 PM IST
దుబాయ్ వెళ్తున్నారా?: UAE కొత్త ఐదేళ్ల VISA స్కీమ్ అంటే తెలుసా?  

యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) విదేశీ పర్యటనకు వెళ్లేవారికి గుడ్ న్యూస్. UAE ఐదేళ్ల మల్టీపుల్ ఎంట్ర్రీ కొత్త వీసా స్కీమ్ ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా అన్ని దేశాల పౌరులు ఈజీగా యూఏఈలో పర్యటించవచ్చు. గల్ఫ్ దేశంలో టూరిజాన్ని మరింత ప్రోత్సహించేందుకు ఈ స్కీమ్ ప్రవేశపెట్టినట్టు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాని షేక్ మొహమ్మద్ తన ట్విట్టర్ లో అరబిక్ లో ట్వీట్ చేశారు.

‘మా దేశంలో టూరిస్ట్ వీసా సిస్టమ్ మార్పుకు ఈరోజే ఆమోదం లభించింది. విదేశీ పర్యాటకులకు ఐదేళ్ల టూరిస్ట్ వీసాను పొందవచ్చు. అన్ని దేశాల పౌరులంతా మల్టీ యూజ్ కోసం వీసాను వినియోగించుకోవచ్చు. ఏడాదికి 21 మిలియన్ల మందికిపైగా పర్యాటకులు సందర్శిస్తుంటారు. ప్రధాన గ్లోబల్ టూరిస్ట్ ప్రాంతంగా మా దేశం అభివృద్ధి చెందాలన్నదే మా ఆకాంక్ష’ అని షేక్ మొహమ్మద్ ట్వీట్ చేశారు. 

UAE కొత్త వీసా స్కీమ్ అంటే ఏంటి? :
దుబాయ్ ఆధారిత గల్ఫ్ న్యూస్ ప్రకారం.. పర్యాటకులు 30 లేదా 90 రోజుల వ్యవధితో సింగిల్ లేదా మల్టీపుల్ ఎంట్రీ వీసాలను పొందవచ్చు. కొత్త ఐదేళ్ల మల్టీపుల్ ఎంట్రీ సిస్టమ్ కింద వీసాదారులకు 6 నెలల పాటు అక్కడ ఉండేందుకు అనుమతించవచ్చు. ఈ స్కీమ్‌కు సంబంధించి పూర్తి వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. దేశీయ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్ షిప్ ఈ నిర్ణయాన్ని అమలు చేయనుంది. ప్రధాని షేక్ మొహమ్మద్.. 2020 భిన్నమైన సంవత్సరంగా పిలుపునిచ్చారు. రాబోయే 50 ఏళ్లకు ఈ ఏడాది నుంచే సన్నాహాక ఏడాదిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.

మరోవైపు, అఫ్రికా నుంచి పర్యాటకులతో పాటు దక్షిణ అమెరిన్ దేశాల నుంచి కొంతమంది, అరబ్ స్టేట్స్ బయట గల్ఫ్ నుంచి మరికొంతమంది, యూరోపియన్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ బయట నుంచి, పాత సొవియట్ యూనియన్ నుంచి పర్యాటకులకు గతంలో వీసాలు అవసరముండేవని ఓ రిపోర్టు పేర్కొంది.

ప్రస్తుతం.. యూఏఈకి వార్షికంగా టూరిస్టులు 2.1 కోట్లకు పైగా సందర్శిస్తున్నారు. ఇటీవలే ట్రేడ్, టూరిజం రంగాలను బలోపేతం చేసేందుకు కొన్ని వీసా విధానాలను ప్రవేశపెట్టడంతో పర్యాటకుల సంఖ్య మరింత పెరిగింది. 2019 జూలైలో UAE మహిళా ఉద్యోగులను తమ దేశంలోకి అనుమతినిచ్చింది.

తమ భాగస్వాములతో పాటు పేరంట్స్, పిల్లలతో కలిసి ఉంటూ పనిచేసుకునేందుకు వీలు కల్పించింది. ఇక్కడ మహిళలకు ఉపాధి పొందేందుకు వీలుగా 145 సర్వీసులు, ట్రాన్సాక్షన్ల కోసం వర్క్ పర్మిట్స్ ఫీజును 50 శాతం నుంచి 94 శాతానికి తగ్గించింది.

యూఏఈలోని డ్యూటీ-ఫ్రీ స్టోర్లలో భారతీయ కరెన్సీ (INR)లో ట్రాన్సాక్షన్లను అంగీకరిస్తున్నట్టు ఎమిరేట్ ఆఫ్ దుబాయ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. దుబాయ్‌లో ఈ ఏడాది అక్టోబర్ నెలలో Expo 2020 పేరుతో అతిపెద్ద బడ్జెట్ గ్లోబల్ ట్రేడ్ ఫెయిర్‌ను నిర్వహించనుంది.