Third World War : మూడవ ప్రపంచ యుధ్ధం వస్తుందా…?

అనుకున్న దానికన్నా సుదీర్ఘంగా సాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం మహా ప్రళయాన్ని సృష్టించబోతోందా? మానవాళిని ధ్వంసం చేయబోతోందా?

Third World War  : మూడవ ప్రపంచ యుధ్ధం వస్తుందా…?

Third World War

Third World War :  అనుకున్న దానికన్నా సుదీర్ఘంగా సాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం మహా ప్రళయాన్ని సృష్టించబోతోందా? మానవాళిని ధ్వంసం చేయబోతోందా? 9 దేశాల దగ్గరున్న 13వేల అణ్వాయుధాలు.. ప్రపంచ వినాశానానికి సిద్ధమయ్యాయా? రెండు, మూడ్రోజుల్లో ముగుస్తుందనుకున్న రష్యా, యుక్రెయిన్ యుద్ధం పదకొండోరోజుకు చేరిన వేళ అందరికీ కలుగుతున్న సందేహాలివి.

రోజురోజుకూ యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. భారీగా ప్రాణ, ఆస్తినష్టం జరుగుతోంది.  యుక్రెయిన్‌లో పరిస్థితులు అదుపుతప్పాయి. ఎక్కడ.. ఎప్పుడు.. ఏం జరుగుతుందో ఎవరికీ ఏమీ అర్ధం కావట్లేదు. తాత్కాలిక కాల్పుల విరమణ సైతం అమలు కావడం లేదు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీ ఆచూకీ తెలియడం లేదు. యుక్రెయిన్ భవితవ్యమే ప్రమాదంలో పడిందని.. ఆ దేశ ఉనికికే ముప్పు ఉందని పుతిన్ హెచ్చరిస్తున్నారు.

మరోవైపు అమెరికా, పాశ్చాత్య దేశాలు రష్యాపై మరిన్ని ఆంక్షలు ప్రకటించాయి. ఆంక్షలు తమను ఆపలేవని, వాటితో తమకు లాభమేనని పుతిన్ అంటున్నప్పటికీ.. రష్యా ఆర్థిక వ్యవస్థకు అవి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ మూడో ప్రపంచ యుద్దానికి దారితీసే సూచన కనిపిస్తోంది. చర్చల ద్వారానో, రష్యా లక్ష్యం పూర్తయ్యో.. యుక్రెయిన్ యుద్ధం ఎంత త్వరగా ముగిస్తే.. ప్రపంచానికి అంత మంచిది. లేదంటే యుద్ధం కొనసాగే కొద్దీ.. ప్రపంచదేశాలు యుద్ధంలో పాల్గొనాల్సిన అనివార్యత ఏర్పడనుంది.

రష్యా యుక్రెయిన్ యుద్ధం మూడో ప్రపంచయుద్ధానికి దారితీసే ప్రమాదముందన్న ఆందోళన మొదటినుంచీ వ్యక్తమయింది. యుక్రెయిన్‌పై స్పెషల్ మిలటరీ ఆపరేషన్ ప్రారంభిస్తున్నట్టు పుతిన్ ప్రకటించిన రోజు సోషల్ మీడియా అంతటా థర్డ్ వరల్డ్ వార్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. అయితే యుక్రెయిన్‌కు మద్దతుగా బలగాలను పంపేది లేదని అటు అమెరికా, ఇటు నాటో తేల్చి చెప్పడంతో.. మూడో యుద్ధ ముప్పు లేదని అంతా భావించారు.

కానీ రోజులు గడుస్తున్నా యుద్ధం కొలిక్కిరాకపోవడం.. అమెరికా, యూరప్ దేశాలు యుక్రెయిన్‌కు భారీగా ఆయుధాలు అందించడం, రష్యాపై ఆంక్షలు విధిస్తుండడంతో..యుద్ధం రెండు దేశాలతో ముగిసే సూచన కనిపించడం లేదు. గత రెండు ప్రపంచ యుద్ధాల్లానే ఇది కూడా మరో ప్రపంచ యుద్ధంగా మారి పెను విధ్వంసం జరగబోతోందన్న భయాందోళన కలిగిస్తోంది.

మొదటి, రెండు ప్రపంచ యుద్ధాలు కూడా ఇలా రెండు దేశాల మధ్య మొదలై తర్వాతే…మహాయుద్ధాలుగా మారాయి. 1914 జులై 28 నుంచి 1918 నవంబరు 11వరకు ఐదేళ్లపాటు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం ఓ చక్రవర్తి హత్య. 1914 జూన్ 2న ఆస్ట్రో హంగేరీ సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్య జరిగింది. సెర్బియా జాతీయవాది ఆయన్ను హత్య చేశారు. చక్రవర్తి హత్య జరిగిన సరిగ్గా నెల తర్వాత ఆస్ర్రియా హంగేరి సెర్బియాపై యుద్ధం ప్రకటించింది.

1915 వరకు ఈ యుద్ధం ఆ రెండు దేశాల మధ్యే జరిగింది. 1916నాటికి మరికొన్ని దేశాలు యుద్ధంలో పాల్గొన్నాయి. 1917లో అమెరికా కూడా యుద్దంలో భాగస్వామి అయింది. 1918 నాటికి ప్రపంచంలోని అనేక దేశాలు యుద్ధంలో పాలుపంచుకన్నాయి. 1918 నవంబరు 11న యుద్ధం ముగిసింది. ఒక హత్య వల్ల రెండు దేశాల మధ్య మొదలైన యుద్దం యూరప్‌తో పాటు ఆఫ్రియా, పశ్చిమాసియా, పసిఫిక్ ఐల్యాండ్ వరకూ వ్పాపించింది. 85లక్షల మంది సైనికులు చనిపోయారు.

1918లో యుద్ధం ముగిసిన తర్వాతా ప్రపంచంలో అశాంతి చల్లారలేదు. ఆ యుద్దం ముగిసిన 21 ఏళ్లకు రెండో ప్రపంచయుద్ధం ప్రారంభమయింది. 1939లో మొదలైన ఈ యుద్ధానికి కారణం…జర్మనీ పోలండ్‌ను ఆక్రమించడమే. సెప్టెంబరు 1న జర్మనీ పోలండ్‌ను ఆక్రమించగా..సెప్టెంబరు 3న బ్రిటన్, ఫ్రాన్స్…జర్మనీపై యుద్ధం ప్రకటించాయి. అప్పటికే యూదులపై నాజీ నియంత హిట్లర్ అరాచకాలపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు రగులుతున్నాయి. హిట్లర్ పోలండ్ ఆక్రమించిన తర్వాత..ఈ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అనేక దేశాలను యుద్ధానికి పురికొల్పింది.

మొదటి ప్రపంచ యుద్ధం నాటికి, రెండో ప్రపంచయుద్దం నాటికి మిత్రదేశాల్లో మార్పులు వచ్చాయి. తొలి యుద్ధంలో ఫ్రాన్స్, సోవియట్ యూనియన్, బ్రిటన్ ఒక వైపు ఉంటే, జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, హంగేరీ మరోవైపున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంనాటికి జర్మనీ, ఇటలీ, జపాన్ ఓ వైపు ఉంటే …అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా మరోవైపున్నాయి. 1939 నుంచి 1945 పాటు సాగిన యుద్ధంలో 5కోట్ల మంది చనిపోయారు. హీరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబు, హిట్లర్ ఆత్మహత్యతో…ప్రపంచానికి పెనువిషాదం మిగిలిస్తూ…రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది.

సెకండ్ వరల్డ్ వార్ ముగిసిన 77 ఏళ్ల తర్వా రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలయింది. ఈ 77 ఏళ్ల కాలంలో అనేక యుద్ధాలు జరిగాయి. కానీ అవేవీ మరో ప్రపంచ యుద్దానికి దారితీసే ప్రమాదం కనిపించలేదు. కానీ రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం మాత్రం.. రోజురోజుకూ భీకరంగా మారుతోంది. దీనికి కారణం ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి పరిస్థితులకు తోడు ఆ తర్వాత అమెరికా, నాటో దేశాల వైఖరి. యుక్రెయిన్‌కు్ నాటో భాగస్వామ్యం కల్పించాలన్న ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ పుతిన్ యుద్ధం ప్రారంభించారు.

యుక్రెయిన్‌కు ఆయుధాలు అందిస్తూ పాశ్యాత్యదేశాలు ఎంతో కొంత మద్దతిస్తున్నాయి. రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో రష్యాకు, అమెరికా, నాటో దేశాలకు మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. ఇదే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందన్న సందేహం కలిగిస్తోంది. యుక్రెయిన్‌పై రష్యా విజయం సాధిస్తే.. ప్రపంచంపై అమెరికా ఆధిపత్యం పోయినట్టేనన్న ప్రచారం జరుగుతోంది.

ఇది అమెరికాకు రుచించదు. అదే సమయంలో రష్యా పాత సోవియట్ యూనియన్ దేశాలన్నింటినీ ఆక్రమించే ప్రయత్నం చేయవచ్చు. అప్పుడు అమెరికా, నాటో దళాలు రంగంలోకి దిగొచ్చు. ఇక అప్పుడు జరిగేది మాటలకందని విధ్వంసమే. మూడో ప్రపంచ యుద్ధమంటే అణ్వాయుధాల ప్రయోగమేనని ఇప్పటికే రష్యా విదేశాంగమంత్రి ప్రకటించారు. రష్యా న్యూక్లియర్ ఎలర్ట్ కూడా ప్రకటించింది. యుక్రెయిన్‌ యుద్ధం వీలయినంత త్వరగా ముగియకపోతే.. పరిస్థితులు ప్రమాదకరంగా మారి.. అనేక దేశాలు యుద్ధంలో భాగస్వామ్యంగా మారాల్సిన స్థితి రావొచ్చు.

మొదటి ప్రపంచ యుద్ధమే చూసుకుంటే.. యూరప్ యుద్ధంగా భావించే ఆ యుద్ధంతో అమెరికాకు సంబంధం లేదు. కానీ 1917లో జర్మనీ నౌకలను అడ్డగించాలన్న విధానం ఎంచుకున్న తర్వాత యుద్ధం అనూహ్య మలుపు తిరిగింది. జర్మనీ సబ్‌ మెరైన్లు బ్రిటన్ నిత్యావసరాలను తరలించే నౌకలను ధ్వంసం చేయడంతో.. బ్రిటన్ చేతులెత్తేసింది. అదే సమయంలో జర్మనీ సబ్‌మెరైన్లు మూడు అమెరికా షిప్‌లనూ ముంచేశాయి. భారీ ప్రాణనష్టం జరిగింది. దీంతో అమెరికా జర్మనీపై యుద్ధం ప్రకటించింది. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధంలోనూ పరిస్థితులు అదుపు తప్పాయి. ఓ భారతీయ విద్యార్థి చనిపోయాడు. వందలమంది విదేశీ విద్యార్ధులు యుక్రెయిన్ దగ్గర బందీగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. విదేశీ రాయబార కార్యాలయాలు ధ్వంసమవుతున్నాయి.
Also  Read :Russia Ukraine War : పుతిన్ కు కోపమొచ్చింది…రష్యాపై ఆంక్షలతో డెడ్లీ వార్నింగ్
ఖార్కివ్‌లో స్లొవేనియా రాయబార కార్యాలయం ధ్వంసమయింది. అమెరికా సహా అనేక దేశాలు రష్యాకు గగనతలాన్నిమూసివేశాయి. ఆంక్షల చట్రంలో బిగించాయి. యూరప్‌లోనే అతిపెద్ద అణు ప్లాంట్ అయిన జప్రోజియాను రష్యా ఆక్రమించుకుంది. విదేశీయులొచ్చి పోరాడాలని యుక్రెయిన్ కోరుతోంది. రోజులు గడిచే కొద్దీ…ఈ పరిణామాలు మరింత తీవ్ర రూపు దాలుస్తాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో 90 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడిన ఫ్రాన్స్ అధ్యక్షులు.. ఇప్పడు జరుగున్న దాన్ని మించిన పెనను విధ్వంసం చూడాల్సి వస్తుందన్నారు.

ఇవన్నీ గమనిస్తే.. రష్యా యుక్రెయిన్ యుద్ధం దీర్ఘాకలిక యూరోపియన్ యుద్ధానికి దారితీయొచ్చన్న అభిప్రాయం కలుగుతోంది. యుక్రెయిన్‌కు మద్దతుగా బలగాలను తరలించలేదు కానీ.. ఇప్పటికే తూర్పు యూరప్‌లో నాటో భారీగా బలగాలను మోహరించింది. అంటే ఏ క్షణమైనా రష్యాపై దాడి చేయడానికి నాటో సిద్ధంగా ఉంది. అందుకే యుక్రెయిన్ యుద్ధం.. ఎప్పుడైనా మూడో ప్రపంచ యుద్ధంగా మారవచ్చు. అణ్వాయుధ ప్రయోగానికి, చరిత్ర ఎరగని మహా ప్రళయానికి దారితీయొచ్చు.