IMF Warns About Recession : ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఏ క్షణమైనా కుదేలవుతాయని హెచ్చరిస్తున్న IMF

ముంచుకొస్తున్న ఆర్థిక మందగమన మేఘాలు ప్రపంచాన్ని కమ్మేస్తున్నాయి. ఆ దేశం ఈ దేశం అని లేదు... అగ్రరాజ్యం... చిన్న రాజ్యం అని లేదు. అన్నింటినీ కబళించి వేయడానికి రెసిషన్ దూసుకొస్తోంది. ఈ సంకేతాలు ఎప్పట్నుంచో ఉన్నా IMF తాజా హెచ్చరికలు ముందుంది ముసళ్ల పండగ అని చెబుతున్నాయి...ఇంతకీ IMF ఏం చెప్పింది...? రెసిషన్ ప్రభావం ఎలా ఉండబోతోంది...?

IMF Warns About Recession : ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఏ క్షణమైనా కుదేలవుతాయని హెచ్చరిస్తున్న IMF

IMF..World Bank Warn of Increasing Risk of Global Recession

IMF Warns About Recession : ముంచుకొస్తున్న ఆర్థిక మందగమన మేఘాలు ప్రపంచాన్ని కమ్మేస్తున్నాయి. ఆ దేశం ఈ దేశం అని లేదు… అగ్రరాజ్యం… చిన్న రాజ్యం అని లేదు. అన్నింటినీ కబళించి వేయడానికి రెసిషన్ దూసుకొస్తోంది. ఈ సంకేతాలు ఎప్పట్నుంచో ఉన్నా IMF తాజా హెచ్చరికలు ముందుంది ముసళ్ల పండగ అని చెబుతున్నాయి…ఇంతకీ International Monetary Fund (IMF) ఏం చెప్పింది…? రెసిషన్ ప్రభావం ఎలా ఉండబోతోంది…?

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదపుటంచున నిలిచింది. ఆర్థిక మందగమనం సునామీలా విరుచుకుపడబోతోంది. ఆర్థిక సంక్షోభానికి సంబంధించి అంతర్జాతీయ ద్రవ్యనిధి- IMF చేసిన తాజా వార్నింగ్‌ ఏ క్షణమైనా ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతాయన్న భయంకర నిజాన్ని బయటపెట్టింది. వృద్ధిరేటు అంచనాలను తగ్గించడమే కాదు… రెసిషన్ కాటు తప్పదంటోంది IMF. ప్రపంచంలో మూడో వంతు దేశాలు ఈ ఏడాది లేదంటే వచ్చే ఏడాది దీని బారిన పడక తప్పదంటోంది  IMF హెచ్చరికలు చూస్తుంటే ప్రపంచం ఈ ముప్పు నుంచి బయటపడటం పెద్ద సవాలే…

IMF హెచ్చరికల ప్రకారం 2023నాటికి ప్రపంచంలో మూడోవంతు దేశాలు ఆర్థిక మందగమన పరిస్థితులను ఎదుర్కొంటాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వృద్ధి అంచనా ఈ ఏడాది 3.2శాతంగా ఉండగా వచ్చే ఏడాది అది కేవలం 2.7శాతానికి పరిమితం కానుంది. గతంతో పోల్చితే ఇది 0.2శాతం తక్కువ. కరోనాను పక్కనపెడితే 2001 తర్వాత అత్యంత బలహీన వృద్ధి ఇదే… IMF అంచనాల ప్రకారం 2023నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడోవంతు కంటే ఎక్కువ క్షీణించనుంది. 2021లో చైనా వృద్ధిరేటు 8.1శాతంగా ఉంటే ఈ ఏడాది దాన్ని కేవలం 3.2శాతంగా లెక్కగడుతున్నారు. అమెరికా వృద్ధిరేటు కూడా 1.6శాతంగానే ఉండొచ్చు. వచ్చే ఏడాది అయితే అది 1శాతానికే పరిమితమవుతుందని IMF లెక్కగడుతోంది.

IMF Warns..Recession : ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ .. కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు ఊడిపోయే ఛాన్స్.. అన్నింటికి సిద్ధమవ్వాలని సూచిస్తున్నIMF

రెసిషన్ అంటే ఆర్థిక మందగమనం. డిప్రెషన్ అంటే మాంద్యం… త్వరలో మనం రెసిషన్ ముప్పును ఎదుర్కోబోతున్నాం. మందగమనం అంటే వ్యవస్థ నత్తనడకన సాగడం… వృద్ధి ఉంటుంది కానీ చాలా తక్కువగా ఉంటుంది. అదే మాంద్యం అంటే ప్రతికూల వృద్ధిరేటుతో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కునారిల్లడం. మందగమన పరిస్థితులు మరింత దిగజారితే అది మాంద్యానికి తారితీసి ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతాయి. ప్రతికూల వృద్ధిరేటును నమోదు చేస్తాయి.

కరోనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసింది. ఆ గాయాల నుంచి కోలుకోకముందే తగిలిన వరుస దెబ్బలు ఆర్థిక వ్యవస్థలను కుంగతీశాయి. చైనాలో వరుస లాక్‌డౌన్లు, స్థిరాస్తి రంగ సంక్షోభం అంతర్జాతీయ ఆర్ధిక వృద్ధిపై ప్రభావం చూపాయి. ఆ తర్వాత యుక్రెయిన్‌-రష్యా యుద్ధం అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లైంది. ఈ యుద్ధం కారణంగా ఆహార, ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. ముడిచమురు రేట్లకు రెక్కలతో నిత్యావసరాల ధరలు చుక్కల్లోకి చేరాయి. దాంతో ద్రవ్యోల్బణం కట్టడి చేయలేని స్థాయికి చేరింది. గరిష్ఠస్థాయిలో పెరిగిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లు పెంచడంతో ద్రవ్యసరఫరా తగ్గింది. ఇది హౌసింగ్‌మార్కెట్లను దెబ్బతీసింది. మొత్తంగా అన్నీ కలిపి ప్రపంచ మార్కెట్లను రెసిషన్ ముంగిట నిలిపాయని గ్లోబల్‌ ఫైనాన్షియల్ రిపోర్ట్‌లో IMF వివరించింది. అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లను సాధారణం కంటే ఎక్కువగా పెంచిన ప్రతీసారి అమెరికా ఆర్ధిక మందగమనాన్ని ఎదుర్కొన్న విషయాన్ని కూడా ఈ నివేదిక ప్రస్తావించింది. 1970లో ఇలానే అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగింది. దీంతో ధరలకు కళ్లెం వేసేందుకు ఫెడరల్‌ బ్యాంక్ వడ్డీరేట్లు పెంచింది. దీంతో మాంద్యం పరిస్థితులు తలెత్తాయి. ఇప్పుడు మరోసారి అలాంటి ముప్పు కనిపిస్తోంది.

2008లో లేమాన్ బ్రదర్స్ దివాళాతో ఆర్థిక సంక్షోభం తీవ్రమైంది. ఆ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారీ కుదుపునకు లోనైంది. ఈసారి అలాంటి పరిస్థితి క్రెడిట్‌ సూయిజ్‌ బ్యాంక్‌తో మొదలవబోతోందనిపిస్తోంది. తీవ్రఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ సంస్థ త్వరలోనే దివాళా తీసే ప్రమాదం లేకపోలేదంటున్నారు. పునాదులు బలంగా ఉన్నాయని ఆ బ్యాంకు చెబుతున్నా వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. నిజానికి ఈ బ్యాంకు కార్యకలాపాలు ఎక్కువగా స్విట్జర్లాండ్‌కే పరిమితం. కానీ బలంగా ఉన్న దేశ వ్యవస్థలోని బ్యాంకే దెబ్బతినడంతో మిగిలిన దేశాల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.

ఆర్థిక మందగమన పరిస్థితులు వస్తే ఏం జరుగుతుంది అని ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థ మొత్తం తల్లకిందులవుతుంది. కోట్ల ఉద్యోగాలు ఊడిపోతాయి. నిరుద్యోగ రేటు వేగంగా పెరుగుతుంది. దీంతో ప్రజల ఆదాయం తగ్గిపోతుంది. ఆదాయం పడిపోవడం అంటే కొనుగోలు శక్తి తగ్గిపోవడమే. అంటే ఏం కొనలేం.. తినలేం… గిరాకీ తగ్గిపోతుంది. దీని ప్రభావం ఉత్పత్తిపై పడుతుంది. దీంట్లో కోతలు పడటం అంటే మరిన్ని ఉద్యోగాలు పోవడమే… ఇదంతా ఓ విషవలయం లాంటిది… ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇప్పటికే ప్రజల కొనుగోలు శక్తి తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. అగ్రదేశాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక విదేశీ మదుపరులు తరలిపోతారు. స్టాక్‌మార్కెట్లు కుప్పకూలతాయి. మౌలిక, సేవా రంగాల్లో పెట్టుబడులు ఆగిపోతాయి. చిన్న చిన్న సంస్థలు మార్కెట్‌లో నిలబడలేకపోతాయి. కొత్తపెట్టుబడులు రావడం కష్టమవుతుంది. ముడిచమురు ధరలు పెరుగుతాయి. నిజానికి గిరాకీ తగ్గితే ముడిచమురు ధరలు పడిపోవాలి. అయితే దీన్ని ఎదుర్కోవడానికి ఒపెక్‌, ఒపెక్‌ ప్లస్‌ దేశాలు ఉత్పత్తిలో కోతపెడతాయి.

దేశాలకు దేశాలు దివాళా తీసే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. అంటే మరిన్ని శ్రీలంకలను మనం చూడాల్సి రావచ్చు. దాదాపు 70దేశాలు ఆర్థికంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు ఎప్పట్నుంచో చెబుతున్నారు. మందగమనంతో ఇవన్నీ మరింత కుదేలవుతాయి. అప్పులిచ్చిన దేశాలది ఓ కష్టం… తీసుకున్న దేశాలది మరో కష్టం… సామాన్యప్రజలు బతకలేని పరిస్థితి వస్తుంది. 2008నాటి మాంద్యాన్ని ప్రభావాన్ని ప్రపంచ మర్చిపోలేదు. ఆ పీడకల మరోసారి నిజం కాబోతోంది.