Heat wave Danger On India : భారత్‌కు భీకరమైన హీట్ వేవ్స్ ముప్పు..మనుషుల జీవిత కాలంపై తీవ్ర ప్రభావం : వరల్డ్ బ్యాంక్ నివేదికలో హడలెత్తించే అంశాలు

భారత్‌లో భీకరమైన హీట్ వేవ్స్..మనుషులు జీవిత కాలంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వరల్డ్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ఈ రిపోర్టులో రానున్న రోజుల్లో ప్రజలు ఎంతగా సఫర్ అవుతారో వెల్లడించింది.

Heat wave Danger On India : భారత్‌కు భీకరమైన హీట్ వేవ్స్ ముప్పు..మనుషుల జీవిత కాలంపై తీవ్ర ప్రభావం : వరల్డ్ బ్యాంక్ నివేదికలో హడలెత్తించే అంశాలు

Heat wave Danger On India

Heat wave Danger On India : హాయిగా బతకాలనుందా.. బతికేయండి. సరదాగా గడపాలనుందా.. గడిపేయండి. ప్రకృతిని ఆస్వాదించే ఆలోచనలేమైనా ఉన్నాయా.. అయితే.. అవన్నీ ఇప్పుడే చేసేయండి. ఇంకొన్నేళ్లలో.. ఇల్లు దాటి కాలు బయట పెట్టే చాన్స్ ఉండకపోవచ్చు. మనం ఉంటున్న ప్రాంతాన్ని మైదానంగా చేసుకొని.. వాతావరణం మనతో ఫుట్‌బాల్ ఆడేయొచ్చు. రానున్న రోజుల్లో పెరగబోయే టెంపరేచర్.. మీ లైఫ్ టైమ్‌‌ని కూడా తగ్గించేయొచ్చు. ఇదేదో.. మిమ్మల్ని భయపెట్టేందుకు చెబుతున్నది కాదు. వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన లేటెస్ట్ రిపోర్ట్ గురించి తెలిస్తే.. మీరు కూడా ఇదే ఆలోచనకు వచ్చేస్తారు.

భారతదేశంలో జనాభాతో పాటు ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరుగుతాయని.. భరించలేని వేడిగాలులతో.. మానవ మనుగడకే ముప్పు పొంచి ఉందని.. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చెబుతోంది. రాబోయే కొన్నేళ్లలో.. వాతావరణ పరిస్థితులతో పాటు భారతీయుల సామాజిక పరిస్థితులు కూడా మారుతాయని ఆ నివేదిక అంచనా వేస్తోంది. 2050 నాటికి భారత్‌లోని సగం జనాభా.. దేశంలోని నగరాల్లోని నివసిస్తుంది. దీంతో.. కర్బన ఉద్గారాలు, గ్రీన్ హౌజ్ వాయువులు, గ్లోబల్ వార్మింగ్ మరింత పెరిగి.. వాతావరణం వేడెక్కుతుందని నివేదిక చెబుతోంది. ఫలితంగా రానున్న కొన్నేళ్లలో.. వేసవికాలం ఉగ్రరూపం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. వేసవికాలం ముందస్తుగా రావడంతో పాటు వడగాల్పులు ఎక్కువ రోజులు కొనసాగి ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయ్. ఈ ప్రపంచంలోనే.. ఎండాకాలం ఎండల తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల్లో.. భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందని.. అది మానవ మనుగడకే ముప్పుగా మారుతుందని.. వరల్డ్ బ్యాంక్ నివేదిక హెచ్చరిస్తోంది. కొన్ని దశాబ్దాలుగా ప్రతి ఏడాది వచ్చే వేసవిలో.. టెంపరేచర్లు విపరీతంగా పెరిగిపోయి.. హీట్ వేవ్స్ బారిన పడి వేలాది మంది మృతి చెందుతున్న విషయాన్ని ఆ రిపోర్ట్ గుర్తు చేస్తోంది.

క్లైమేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆపర్చునిటీస్‌ ఇన్‌ ఇండియాస్‌ కూలింగ్‌ సెక్టార్‌ అనే పేరుతో.. వరల్డ్ బ్యాంక్ ఓ రిపోర్ట్ తయారుచేసింది. అందులో.. భారత్ ముందస్తుగా అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటుందని.. ఇది చాలా కాలం పాటు ఉంటుందని అంచనా వేసింది. ఈసారి వేసవి ముందస్తుగా రావడంతో పాటు, ఎక్కువ కాలం కొనసాగి.. ప్రజల ఆయుష్షుని కూడా తగ్గించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆర్థికంగానూ తీవ్ర ప్రభావం చూపిస్తుందని తెలిపింది. భారత్‌లో పని చేసే వర్గంలో 75 శాతం మంది.. అంటే 38 కోట్ల మంది మండుటెండల్లో చెమటోడుస్తూ పనిచేస్తున్నారు. వాళ్లందరి ప్రాణాలకు వడగాల్పులు ముప్పుగా మారతాయని రిపోర్ట్ తెలియజేసింది. 2030 నాటికే.. ప్రపంచవ్యాప్తంగా హీట్ వేవ్స్ వల్ల 8 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతే, వారిలో దాదాపు మూడున్నర కోట్ల మంది భారత్‌లోనే ఉంటారని.. అంచనా వేశారు.

గత ఏప్రిల్‌లో.. ఎండాకాలం మొదట్లోనే వేడి గాలులతో భారత్ ఉక్కిరిబిక్కిరైంది. ఇదే.. దేశం మొత్తాన్ని ఆందోళనకు గురిచేసింది. రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయ్. గతంలో.. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మార్చిలోనూ.. అసాధారణ రీతిలో ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించింది. అందువల్ల.. భవిష్యత్‌లో భారత్‌లో సంభవించే వడగాల్పులు.. మానవ మనుగడ పరిమితిని తగ్గించగలవని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. దక్షిణాసియా అంతటా పెరుగుతున్న టెంపరేచర్ గురించి అనేక మంది క్లైమేట్ సైంటిస్టులు.. చాలా కాలంగా హెచ్చరిస్తున్నట్లుగా.. ఇటీవలి పరిస్థితులు బలం చేకూరుస్తున్నాయని చెబుతున్నారు. గతేడాది ఆగస్టులో.. యూఎన్ ఇంటర్-గవర్నమెంటల్ ప్యానెల్.. ఐపీసీసీ ఆరో నివేదికలోనూ వాతావరణ మార్పులపై.. ఇలాంటి హెచ్చరికలే చేశారు. రాబోయే దశాబ్దకాలంలో.. భారత ఉపఖండం మరింత తీవ్రమైన వేడి గాలులను ఎదుర్కొంటుందని చెప్పారు. ఐపీసీసీ అంచనా ప్రకారం కర్బన ఉద్గారాలు ఇలాగే ఎక్కువగా కొనసాగితే.. 2036 నుంచి 2065 నాటికి భారత్ అంతటా వేడి గాలులు 25 రెట్లు పెరిగే అవకాశం ఉందని.. జీ20 క్లైమేట్ రిస్క్ అట్లాస్‌లో హెచ్చరించింది.

దేశంలో పెరిగే ఉష్ణోగ్రతలు.. ఆర్థిక ఉత్పాదకతను కూడా దెబ్బతీస్తుందని వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ అంచనా వేసింది. దక్షిణాసియా దేశాల్లో.. భారత్‌లోని కార్మికులపై హీట్ వేవ్స్ తీవ్ర ప్రభావం చూపాయని చెబుతున్నారు. గ్లోబల్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ మెకిన్‌సే అండ్ కంపెనీ విశ్లేషణ ప్రకారం.. పెరుగుతున్న వేడి, తేమ కారణంగా కోల్పోయిన కార్మికులు.. ఈ దశాబ్దం చివరినాటికి భారత జీడీపీలో 4.5 శాతంగా చెబుతున్నారు. ఫలితంగా రాబోయే రోజుల్లో.. భారత్ దీర్ఘకాలిక ఆహార, ప్రజారోగ్య భద్రత నమ్మకమైన కోల్డ్ చైన్ నెట్‌వర్క్‌పై ఆధారపడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. దేశమంతటా ఆహారం, ఔషధాలను సప్లై చేసేందుకు.. అడుగడుగునా పనిచేసే కోల్డ్ చైన్ కూలింగ్ సిస్టమ్ అవసరం. ప్రయాణంలో ఒక్కసారి టెంపరేచర్ తగ్గితే.. కూలింగ్ సిస్టమ్ చెడిపోయి.. తాజా ఉత్పత్తులు చెడిపోవచ్చు. దేశంలోని తాజా ఉత్పత్తుల్లో.. కేవలం 4 శాతం మాత్రమే కోల్డ్ చైన్ సౌకర్యాలతో ఉన్నాయి.

దేశమంతటా ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ.. కూలింగ్ సిస్టమ్స్‌కి డిమాండ్ పెరుగుతుంది. అయితే, జనాభాలో మూడింట రెండొంతుల మంది రోజుకు 150 రూపాయల కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు. ఇదే సమయంలో.. ఏసీ యూనిట్ల ధరలు భారీగా పెరిగిపోయే అవకాశం ఉంది. విలాసవంతమైన ఎయిర్ కూలింగ్ సిస్టమ్‌లు కొందరికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్‌లో సమర్పించిన విశ్లేషణ ప్రకారం.. కేవలం 8 శాతం భారతీయ కుటుంబాలు మాత్రమే ఏసీ యూనిట్లను కలిగి ఉన్నాయి. అందువల్ల.. దేశంలోని అనేక పేద, అట్టడుగు వర్గాలకు తీవ్రమైన వేడి.. మరింత హాని కలిగిస్తుందని.. నివేదిక స్పష్టం చేసింది.