Bus Overturned: చేవెళ్ల ఘోర బస్సు ప్రమాదం మరువక ముందే.. మరో దుర్ఘటన.. బస్సు బోల్తా పడి ఇద్దరు మృతి

బస్సులో మొత్తం 17 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు ఏలూరు జిల్లా ధర్మాజీగూడెం నుంచి హైదరాబాద్ వెళ్తోంది.

Bus Overturned: చేవెళ్ల ఘోర బస్సు ప్రమాదం మరువక ముందే.. మరో దుర్ఘటన.. బస్సు బోల్తా పడి ఇద్దరు మృతి

Updated On : November 3, 2025 / 10:22 PM IST

Bus Overturned: చేవెళ్లలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటన తెలుగు రాష్ట్రాల ప్రజలను షాక్ కి గురి చేసింది. ఈ దారుణం మరువక ముందే, అందులోంచి తేరుకోక ముందే మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రయాణికులు చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఏపీలోని ఏలూరు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సోమవారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఏలూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న భారతి ట్రావెల్స్ బస్సు.. లింగపాలెం మండలం జూబ్లీనగర్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్స్ లో చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులో మొత్తం 17 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. భారతి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏలూరు జిల్లా ధర్మాజీగూడెం నుంచి హైదరాబాద్ వెళ్తోంది.

బస్సు ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రయాణికులతో ఆయన మాట్లాడారు. బస్సు ప్రమాదానికి గల కారణాలు వారిని అడిగి తెలుసుకున్నారు.

దేశవ్యాప్తంగా రహదారులు రక్తమోడుతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం, అతి వేగం, ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యం.. ప్రమాదాలకు దారితీస్తున్నాయి. వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకునే వరకు టెన్సన్ పడే పరిస్థితులు ఏర్పడ్డాయి.

కాగా, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు, లారీ డ్రైవర్లు సహా 19మంది మరణించారు. ఈ ప్రమాదం అనేక కుటుంబాల్లో అంతులేని విషాదం నింపింది. ప్రమాద స్థలి వద్ద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఈ ప్రమాదంలో టిప్పర్ ఢీకొట్టిన దానికంటే అందులోని కంకర బస్సులోని ప్రయాణికులపై పడడం కారణంగానే మృతుల సంఖ్య పెరిగింది.

Also Read: చేవెళ్ల బస్సు ప్రమాదం‎కు కారణం ఇదే.. అడిషనల్ డీజీ కేఎస్ రావు ఏం చెప్పారంటే? బస్సు బయలుదేరిన సమయంలో సీసీ పుటేజీ దృశ్యాలు ..