PM Modi : ఇటలీలో గుజరాతీ భాషలో మోదీ సమాధానం

జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఇవాళ ఉదయం ఇటలీ రాజధాని రోమ్ కు చేరుకున్న మోదీకి భారత సంతతి ప్రజలు ఘనస్వాగతం పలికారు. రోమ్ లోని పియాజ్​ గాంధీ ప్రాంతంలోని

PM Modi : ఇటలీలో గుజరాతీ భాషలో మోదీ సమాధానం

Modi

PM Modi   జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఇవాళ ఉదయం ఇటలీ రాజధాని రోమ్ కు చేరుకున్న మోదీకి భారత సంతతి ప్రజలు ఘనస్వాగతం పలికారు. రోమ్ లోని పియాజ్​ గాంధీ ప్రాంతంలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు మోదీ. తనను స్వాగతించేందుకు వచ్చిన ప్రజలతో మోదీ కాసేపు ముచ్చటించారు. దీంతో పియాజ్​ గాంధీ ప్రాంతంలో సందడి నెలకొంది.

పియాజ్​ గాంధీ ప్రాంతమంతా ‘మోదీ, మోదీ’..భారత్ మాతా కీ జై నినాదాలతో మారుమోగింది. మోదీని సమీపం నుంచి చూడటానికి, ఆయనతో కరచాలనం చేయడానికి భారత సంతతి ప్రజలు చాలా ఉత్సాహంతో ప్రయత్నించారు. కొందరు సంస్కృత శ్లోకాలను పఠించగా.. వాటిని విన్న మోదీ “ఓం నమః శివాయ” అంటూ ముందుకు సాగారు. నాగపూర్‌లో జన్మించిన హరి ఓం కాలియా ఇటలీలో 20 సంవత్సరాల నుంచి యోగా బోధిస్తున్నారు. ఆయన తన ముగ్గురు శిష్యులతోపాటు శివ స్థుతిని పఠించారు. దీంతో మోదీ ముఖంలో చిరునవ్వు తొణికిసలాడింది.

ఈ సందర్భంగా నరేంద్ర భాయ్ కేమ్ ఛో(గుజరాతీలో బాగున్నారా అని అర్థం) అని ఓ వ్యక్తి అడగ్గా.. మజా మా ఛో అని గుజరాతీ భాషలోనే నవ్వుతూ మోదీ బదులిచ్చారు. ఇక, గాంధీజీ ఆదర్శాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ధైర్యం, ప్రేరణ ఇస్తాయని, ఆయనకు రోమ్‌లో నివాళులర్పించే అవకాశం తనకు లభించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇటలీ పర్యటనలో నరేంద్ర మోదీ.. యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు చార్లెస్‌ మైకేల్‌, యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు ఉర్సులా వాన్​ డెర్‌ లెయన్‌తో సమావేశమయ్యారు. ఐరోపా, భారత్ మధ్య వ్యాపార సంబంధాలు, వాతావరణ మార్పు, కొవిడ్-19, అంతర్జాతీయ, ప్రాంతీయ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. కాగా,1960లో భారత్‌-ఈయూ మధ్య.. ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమయ్యాయి. 1962లో యూరోపియన్‌ ఎకనామిక్‌ కమ్యూనిటీతో ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభించిన తొలి దేశాల్లో భారత్‌ ఒకటిగా నిలిచింది. మొదటిసారిగా 2000 జూన్ 28న భారత్- ఈయూ సమావేశం జరిగింది.

ALSO READ By Poll : హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నిక..రెడీ టు పోల్