దేశం కోసమే : బుర్ఖాలు..స్కార్ఫ్‌లపై నిషేధం

  • Published By: madhu ,Published On : April 29, 2019 / 03:49 AM IST
దేశం కోసమే : బుర్ఖాలు..స్కార్ఫ్‌లపై నిషేధం

ఈస్టర్ రోజున జరిగిన బాంబు పేలుళ్ల ఘటనతో శ్రీలంక ప్రభుత్వం అలర్టయింది. భద్రతా చర్యల్లో భాగంగా అక్కడి మహిళలు ఎవరూ బుర్ఖాలు, స్కార్ఫ్‌లు ధరించరాదని ఆదేశాలు జారీ చేసింది. ముఖాన్ని కప్పివుంచే వాటిని ధరించడంపై పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయానికి శ్రీలంక అధ్యక్షుడు ఆమోద ముద్ర వేశారు.

దేశభద్రత దృష్ట్యా బురఖాలను నిషేదించాలని పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ మోషన్‌ను ప్రవేశ పెట్టారు. పార్లమెంట్ సభ్యులు కూడా మద్దతు తెలపడంతో దీనికి అధ్యక్షుడు సిరిసేన కూడా ఆమోద ముద్ర వేశారు. మరోవైపు.. శ్రీలంకలోని భద్రతా బలగాలకు సహకరించాలని ఆ దేశ ముస్లిం మతపెద్దలు కూడా నిర్ణయించారు. ముస్లిం మహిళలు బుర్ఖాలు ధరించరాదని సూచించారు. 

బుర్ఖాలపై నిషేధం విధించడం తమకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా భద్రతా కారణాల రీత్యా తప్పడం లేదని చెప్పారు శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే. బాంబు దాడులు జరిగిన నాటినుంచి దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తాయని ముందస్తు జాగ్రత్తలో భాగంగానే ఈ నిషేధం విధించాల్సిన అవసరం తలెత్తిందని ఆయన అన్నారు.

శ్రీలంకలో పేలుళ్ల ధాటికి 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా దాదాపు 500 మందికి తీవ్రగాయాలయ్యాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన లంక పోలీసులు.. ఇప్పటివరకు 106మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ స్కూల్ ప్రిన్సిపల్‌తోపాటు తమిళ మీడియంకు చెందిన ఓ టీచర్‌ కూడా ఉన్నారు. ఆ టీచర్‌ నుంచి 50 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.