Telangana Govt jobs : తెలంగాణలో కొలువుల జాతర..కోచింగ్‌ సెంటర్ల బాటపట్టిన నిరుద్యోగులు

ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌లతో నిరుద్యోగులు కోచింగ్‌ సెంటర్ల బాటపట్టారు. దాంతో గత రెండేళ్లుగా వెలవెలబోయిన కోచింగ్‌ సెంటర్లకు మళ్లీ మునుపటి కళ వచ్చేసింది. యువతీ యువకులతో కళకళలాడుతున్నాయి.

Telangana Govt jobs  : తెలంగాణలో కొలువుల జాతర..కోచింగ్‌ సెంటర్ల బాటపట్టిన నిరుద్యోగులు

Government Jobs Notification In Telangana

Government jobs notification in Telangana ‌: ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌లతో నిరుద్యోగులు కోచింగ్‌ సెంటర్ల బాటపట్టారు. దాంతో గత రెండేళ్లుగా వెలవెలబోయిన కోచింగ్‌ సెంటర్లకు మళ్లీ మునుపటి కళ వచ్చేసింది. యువతీ యువకులతో కళకళలాడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో శిక్షణకు పెట్టింది పేరైన హైదరాబాద్‌లో మళ్లీ సందడి మొదలైంది.

తెలంగాణలో కొలువుల జాతర మొదలైంది. 16,614 పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌..503 పోస్టుల భర్తీకి గ్రూప్‌ వన్ నోటిఫికేషన్‌..లక్షల మంది నిరుద్యోగుల్లో చిగురించిన ఆశలు వెల్లివిరుస్తున్నాయి. తెలంగాణలో మళ్లీ ఉద్యోగాల జాతర మొదలైంది. లక్షలాది మంది నిరుద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపింది. దుమ్ముపట్టిపోయిన పుస్తకాలను మళ్లీ బయటికి తీస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌లు కలలో మాటగా మారిన నేపథ్యంలో ప్రైవేటు ఉద్యోగాలను ఆశ్రయించిన నిరుద్యోగులు…ఇప్పుడు ఎలాగైనా సరే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే నిశ్చయంతో పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. ఇదే తరుణం…మళ్లీ రాదనే భావనతో కోచింగ్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. కొందరు పోలీసు ఉద్యోగాల కోసం, మరి కొందరు గ్రూప్‌-వన్‌ ఉద్యోగాల కోసం ముమ్మరంగా సాధన చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మంది గ్రూప్‌ 1 ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక మంది పోలీసు ఉద్యోగాల కోసం కరసత్తు చేస్తున్నారు. దీంతో చాలా కాలం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర నిరుద్యోగుల్లో కొత్త వెలుగు తెచ్చింది.

ఉద్యోగాల నోటిఫికేషన్‌లు లేకపోవడానికి తోడు కరోనా మహమ్మారి కారణంగా దాదాపు రెండేళ్లపాటు తలుపులేసుకున్న కోచింగ్‌ సెంటర్లు ఇప్పుడు మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. రాష్ట్రం నలుమూలలనుంచి శిక్షణ కోసం వస్తున్న ఉద్యోగార్థులతో మళ్లీ కళకళలాడుతున్నాయి. వేలాది మంది ఉద్యోగార్థులతో శిక్షణా కేంద్రాలు సందడి సందడిగా మారాయి. నిరుద్యోగుల వెయిటింగ్‌ ఈజ్‌ ఓవర్‌ అంటున్న ఓ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు….అర్హతగా నిర్ణయించిన డిగ్రీ విషయంలో వెసులుబాటు వుండివుంటే ఎంతో మందికి పరీక్ష రాసే అవకాశం వుండేదని అంటున్నారు. కరోనా వల్ల డిగ్రీ పరీక్షలు ఆలస్యమయ్యాయని గుర్తు చేస్తున్నారు.

ఇంకోవైపు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎక్కడ చూసినా పోలీసు ఉద్యోగాల గురించే చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఎస్.ఐ, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేయడంతో నిరుద్యోగుల్లో మళ్లీ సందడి మొదలైంది. ఒంటిమీద ఖాకీ డ్రెస్‌ ధరించాలనే కృత నిశ్చయంతో కసరత్తులు ప్రారంభించారు. ఉద్యోగాలు ఆశిస్తున్న వేలాదిమంది యువతీ యువకులు గ్రౌండ్స్‌ బాట పట్టారు. తెల్లవారు జామునుంచే వ్యాయామం చేస్తూ కన్పిస్తున్నారు.

ఎట్టకేలకు ఉద్యోగ ఖాళీల ప్రక్రియ ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం, వివిధ శాఖల్లో భారీగా వున్న పోస్టుల భర్తీకి దశల వారీగా నోటిఫికేషన్‌లు జారీ చేయనుంది. వివిధ శాఖలు, విభాగాల్లో మొత్తం 91 వేల 142 ఖాళీ పోస్టులు వుండగా అందులో 11 వేల 103 కాంట్రాక్ట్ పోస్టులు పోను మిగతా పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసి భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇదే నిరుద్యోగుల ఆశలు చిగురించేలా చేస్తోంది.