New Farm Laws : వ్యవసాయ చట్టాలు రద్దు…ఇది రైతు విజయం

కొంతమంది చనిపోయినా..కేంద్ర ప్రభుత్వంలో చలనం రాలేదు. ఆందోళనలకు దిగొచ్చింది. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

New Farm Laws : వ్యవసాయ చట్టాలు రద్దు…ఇది రైతు విజయం

Modi Farm

New Farm Laws : మూడు వ్యవసాయ చట్టాలు..కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాలపై రైతన్నలు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. నిద్రహారాలు మాని..కుటుంబాలను వదిలి..ఢిల్లీ సరిహధ్దులు, ఇతర ప్రాంతాల్లో గుడారాలు వేసుకుని మరీ..నిరసనలు చేపట్టారు. కేంద్రం మెడలు వంచుతాం..చట్టాలను రద్దు చేసే వరకు తాము ఇళ్లకు వెళ్లబోమని రైతులు శపథాలు చేశారు. ఈ ఆందోళనలు, నిరసనలను కేంద్ర సర్కార్ లైట్ తీసుకుంది. కొంతమంది చనిపోయినా..కేంద్ర ప్రభుత్వంలో చలనం రాలేదు. అకస్మాత్తుగా మోదీ సర్కార్ రైతుల ఆందోళనలకు దిగొచ్చింది. 15 నెలలుగా ఉక్కు సంకల్పంతో ఢిల్లీ సరిహద్దుల్లో చేసిన ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ..ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటూ సంచలన  నిర్ణయం తీసుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.

Read More : వ్యవసాయ చట్టాలు రద్దు.. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం

జూన్‌ 5, 2020 వ్యవసాయ చట్టాల రూపకల్పన జరిగినప్పటి నుంచి న్యాయం చేయాలంటూ అన్నం పెట్టే అన్నదాత న్యాయం కోసం రోడ్డెక్కాడు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పట్టు విడవకుండా ఉక్కు సంకల్పంతో ఆందోళన చేశారు. ఎముకల కొలికే చలిని సైతం లెక్కజేయలేదు. ట్రాక్టర్లనే తాత్కాలిక నివాసాలు చేసుకొని.. రోడ్లపైనే భోజనాలు చేశారు. 15 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లోనే బైఠాయించి రైతు సంఘాలు కదం తొక్కాయి.. రోజుకో తీరుగా తమ పోరాటాన్ని కొనసాగించారు.. దీంతో కేంద్రం ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అన్నదాత ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.

Read More : Farm Laws : వ్యవసాయ చట్టాల రద్దు వెనుక ఐదు కారణాలు!

దేశ వ్యాప్తంగా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసింది. గురునానక్ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.. రైతులను ఒప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా… రైతులను సంతృప్తి పరచలేకపోయామని అందుకే వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని చెప్పారు. మూడు వ్యవసాయ చట్టాలను తీసుకురావడం ద్వారా రైతులకు మేలు చేయాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని… అయితే… కొంతమంది రైతులు ఈ చట్టాల విషయంలో పూర్తి అసంతృప్తితో ఉన్నారని మోదీ చెప్పారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మూడు చట్టాలను రద్దు చేస్తామని చెప్పారు. ఇప్పటికీ ఆందోళన చేస్తున్న రైతులు… తమ ఉద్యమాన్ని విరమించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. మొత్తానికి ఇది రైతు విజయమేనని అంటున్నారు.