Litre Petrol for Re. 1: రూపాయికే లీటర్ పెట్రోల్ పంపిణీ: ఎగబడిన వాహనదారులు
షోలాపూర్‌లోని డఫెరిన్ చౌక్ పెట్రోల్ పంప్ వద్ద సుమారు 500 మంది వాహనదారులకు రూ. 1కే పెట్రోల్ పంపిణీ చేశారు అంబేద్కర్ విద్యార్థి సంఘం నేతలు.

Petrol
Litre Petrol for Re. 1: దేశంలో పెట్రోల్ ధరలు నానాటికి పెరిగిపోతున్నాయి. పెట్రోల్ ధరలు సామాన్యుడిపై పెనుభారం మోపుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర సుమారు రూ. 120కి చేరుకుంది. హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ. 119.49గా ఉండగా, డీజిల్ ధర రూ.105.49. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.96.67గా ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు..తమ తమ పన్నులను తగ్గించకుండా ఇష్టారీతిన..ప్రజలపై భారం వేస్తున్నాయి. దీంతో వాహనదారులు సొంత వాహనాల్లో తిరగాలంటేనే సంకోచిస్తున్నారు. ఈక్రమంలో ఒక స్వచ్చంద సంస్థ రూపాయికే పెట్రోల్ అందించడం ఆశ్చర్యానికి గురిచేసింది. గురువారం దాదాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేతలు, ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు ఘన నివాళి అర్పించారు. పార్టీలు, కుల మతాలకు అతీతంగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Also read:Trinamool Congress MP: మహిళ సీఎంగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై చిన్న నేరం జరగడం కూడా సిగ్గుచేటు
దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను ఈసందర్భంగా స్మరించుకున్నారు. కాగా అంబేద్కర్ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో అంబేద్కర్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా స్థానిక వాహనదారులకు రూ.1 కే లీటర్ పెట్రోల్ అందించారు సంఘం ప్రతినిధులు. షోలాపూర్‌లోని డఫెరిన్ చౌక్ పెట్రోల్ పంప్ వద్ద సుమారు 500 మంది వాహనదారులకు రూ. 1కే పెట్రోల్ పంపిణీ చేశారు అంబేద్కర్ విద్యార్థి సంఘం నేతలు. విషయం తెలుసుకున్న అనేక మంది వాహనదారులు పెట్రోల్ బంక్ వద్ద బారులుదీరారు. పెట్రోల్ కోసం పెద్ద సంఖ్యలో వాహనదారులు తరలిరావడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.