Amit shah: ఢిల్లీలో మోదీకి వినపడేలా తెలంగాణ ప్రజలు ఈ విషయం చెప్పండి: అమిత్ షా

Amit shah: తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని అమిత్ షా చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం కూలిపోబోతుందని అన్నారు.

Amit shah: ఢిల్లీలో మోదీకి వినపడేలా తెలంగాణ ప్రజలు ఈ విషయం చెప్పండి: అమిత్ షా

Amit shah

Amit shah: తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలా? వద్దా? అని కేంద్ర మంత్రి అమిత్ షా అడిగారు. ఢిల్లీలో మోదీకి వినపడేలా తెలంగాణ ప్రజలు ఈ విషయం చెప్పాలని అన్నారు. అమిత్ షా తెలంగాణలోని చేవెళ్లలో బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహించింది. ఈ సభకు హాజరైన అమిత్ షా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో పేపర్‌లీక్‌పై ప్రశ్నిస్తే జైల్లో పెడతారా? అని నిలదీశారు.

ఆ కేసులో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందేనని అమిత్ షా అన్నారు. పోరాటంలో జైళ్లకు వెళ్లేందుకు తమ పార్టీ కార్యకర్తలు ఎన్నడూ భయపడబోరని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని అమిత్ షా చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం కూలిపోబోతుందని అన్నారు.

కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలని కలలు కంటున్నారని, అయితే, మోదీనే మళ్లీ ప్రధాని కాబోతున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు. అసలు తెలంగాణలోనూ కేసీఆర్ మరోసారి గెలిచే అవకాశం లేదని అన్నారు. ఒవైసీ అజెండాను కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు.

కేంద్రంలో ఫుల్ పిక్చర్ చూసే ముందు తెలంగాణలో ట్రైలర్ చూస్తారని అమిత్ షా అన్నారు. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలో వచ్చేముందు.. తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పారు. బీజేపీ కార్యకర్తలకు అండగా ఉంటామని, కేసీఆర్ అవినీతి పాలనపై పోరాటం చేయాలని అన్నారు. అసెంబ్లీలో ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్ ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గలేదని చెప్పారు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలంగాణ పేదలకు చేరటం లేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో యువతకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. కేసీఆర్ పాలన వల్లే లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ అందకారంలో పడిందని చెప్పారు. ఎన్నికల కోసమే హడావుడిగా ఉద్యమ నోటిఫికేషన్లు ఇచ్చారని తెలిపారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ మాట తప్పారని అమిత్ షా అన్నారు.

చేవెళ్ల ప్రాంత అభివృద్ధికి కొండా వెంకట రంగారెడ్డి కుటుంబం కృషి చేసిందని అమిత్ షా అన్నారు. హైదరాబాద్- బీజాపూర్ హైవేకు సీఎం‌ కేసీఆర్ భూమి ఇవ్వటం లేదని చెప్పారు. ప్రభుత్వ ప్రాజక్టులను కేసీఆర్ కుటుంబం ఏటీఎం మాదిరి వాడుకుంటున్నారని తెలిపారు. పత్తి రైతులను ఆదుకునేందుకు తెలంగాణకు మోదీ మెగా టెక్స్ టైల్స్ పార్క్ ఇచ్చారని చెప్పారు. ప్రజలపై జులుం బంద్ చేసి మంచి పాలన అందించాలని కేసీఆర్ కు షా చురకలు అంటించారు.

కాగా, చేవెళ్లలో జరిగిన ‘‘విజయ సంకల్ప సభ’’లో అమిత్ షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తో పాటు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ, మధ్యప్రదేశ్ ఇన్‌ఛార్జిలు తరుణ్ చుగ్, మురళీధర్ రావు, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా బసవేశ్వర విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.

BJP-Chevella: తెలంగాణలో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి.. ఈ రెండు ఉచితంగా ఇచ్చేస్తాం: బండి సంజయ్