Pangong Tso : పాంగాంగ్‌ సరస్సులోకి 17 పడవలు

తూర్పు లడఖ్ లో చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో పాంగాంగ్‌ సరస్సు వద్ద బలగాల తరలింపు వేగవంతంగా జరిగేలా భారత్ చర్యలు తీసుకుంటోంది.

Pangong Tso : పాంగాంగ్‌ సరస్సులోకి 17 పడవలు

Pangong Tso

Pangong Tso తూర్పు లడఖ్ లో చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో పాంగాంగ్‌ సరస్సు వద్ద బలగాల తరలింపు వేగవంతంగా జరిగేలా భారత్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 17 మర పడవలను పాంగాంగ్ సరస్సు వద్ద ఉంచాలని భారత ఆర్మీ నిర్ణయించింది. అత్యవసర పరిస్థితుల్లో పాంగాంగ్‌ సరస్సు వద్ద బలగాల తరలింపునకు ఈ పడవలను భారత్​ వినియోగించనుంది.

ప్రత్యేక పడవల కోసం ఏడు నెలల క్రితం సైన్యం రెండు ఒప్పందాలను కుదుర్చుకుంది. అత్యాధునిక తనిఖీ వ్యవస్థ మరియు ఇతర పరికరాలతో కూడిన 12 ఫాస్ట్ పాట్రోల్ పడవల కోసం రూ. 65 కోట్లతో ప్రభుత్వ రంగ సంస్థ గోవా షిప్ యార్డ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. 17 ఫైబర్ గ్లాస్ బోట్ల ల కోసం గోవాకే చెందిన ఆక్వారియుస్‌ షిప్‌యార్డ్‌ అనే నౌకల తయారీ కంపెనీతో మరో ఒప్పందం కుదుర్చుకుంది.

అయితే, మొదటి విడతగా కొన్ని ఫైబర్ గ్లాస్ పడవల డెలివరీ ఇప్పటికే ప్రారంభమైందని మరియు సెప్టెంబరు నాటికి పూర్తవుతుందని తాజాగా రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఈ బోటు 20-22 మందిని ఒక చోటు నుంచి మరొక చోటుకి వేగంగా తరలించగలదు. గంటకు 37 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. అవసరమైతే దీనికి తేలిక పాటి ఆయుధాలను కూడా అమర్చవచ్చు. ఆక్వారియుస్‌ షిప్‌యార్డ్‌..ఇప్పటికే నేవీకి కూడా ఇలాంటి బోట్లను సరఫరా చేస్తోంది.

కాగా, పలు దఫాలుగా భారత్-చైనా దేశాల కోర్‌ కమాండర్ల భేటీ తర్వాత.. రెండు నెలల క్రితం పాంగాంగ్‌ సరస్సు వద్ద బలగాల ఉపసంహరణపై భారత్-చైనా మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అయితే.. గోగ్రాపోస్ట్‌, హాట్‌ స్ప్రింగ్స్‌ వద్ద మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదు.