Basavaraj Bommai: కర్ణాటక సీఎంను మారుస్తారా?
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైను మార్చనున్నారా? కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన దానికోసమేనా? ప్రస్తుతం ఈ అంశంపై కర్ణాటకలో జోరుగా చర్చ నడుస్తోంది.

Basavaraj Bommai
Basavaraj Bommai : కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైను మార్చనున్నారా? కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన దానికోసమేనా? ప్రస్తుతం ఈ అంశంపై కర్ణాటకలో జోరుగా చర్చ నడుస్తోంది. బసవరాజు బొమ్మై ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొమ్మిది నెలలు కావస్తోంది. అయితే, ఈమధ్య కాలంలో కర్ణాటక అనేక వివాదాస్పద అంశాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. హిజాబ్ వివాదం మొదలుకొని, లౌడ్ స్పీకర్లు, టిప్పు సుల్తాన్ వంటి అనేక అంశాలు కర్ణాటకలో వివాదాస్పదంగా మారాయి.
Karnataka : బైక్ పై రొమాన్స్ చేసిన ప్రియుడు అరెస్ట్
వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఈ పరిణామాలు పార్టీకి నష్టం కలిగిస్తాయేమోననే భావన పార్టీ ఢిల్లీ నాయకత్వంలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం బసవరాజు బొమ్మైను మారుస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికితోడు బీజేపీ జాతీయ వ్యవహారాల కార్యదర్శి బీ.ఎల్.సంతోష్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి కారణమయ్యాయి. ఇతర పార్టీల్లాగా కాకుండా, అవసరమైతే రాష్ట్ర నాయకత్వాన్ని మొత్తంగా మార్చేసేంత ధైర్యం బీజేపీకి ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘గుజరాత్‌లో ముఖ్యమంత్రిని మార్చినప్పుడు మొత్తం క్యాబినెట్‌నే మార్చేశారు. ఇదంతా కొత్తదనం కోసమే చేశారు. ఫిర్యాదులు వచ్చాయని కాదు. పార్టీలో ఏదైనా జరగొచ్చు’’ అని సంతోష్ చెప్పారు. ఈ వ్యాఖ్యలను బట్టి కర్ణాటకలో కూడా ముఖ్యమంత్రిని మారుస్తారేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే, ఈ వ్యాఖ్యలపై బొమ్మై స్పందించలేదు. త్వరలో మంత్రివర్గాన్ని మార్చబోతున్నట్లు మాత్రం చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బెంగళూరు వస్తుండటంతో, పార్టీ నాయకత్వ మార్పు గురించి చర్చిస్తారా? అనే ప్రచారం ఊపందుకుంది.