Chandrayaan: ఇప్పుడు చంద్రయాన్-3 వ్యోమనౌక పరిస్థితి ఎలా ఉందో తెలుసా?

దశలవారీగా శాస్త్రవేత్తలు చంద్రయాన్‌-3 వ్యోమనౌక ఎల్‌వీఎం3-ఎం4 కక్ష్యను పెంచుతూ పోతారు.  

Chandrayaan: ఇప్పుడు చంద్రయాన్-3 వ్యోమనౌక పరిస్థితి ఎలా ఉందో తెలుసా?

Chandrayaan-3 ISRO

Chandrayaan-3 ISRO: తిరుపతి జిల్లా శ్రీహరికోట(Sriharikota)లోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (Satish Dhawan Space Centre) నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో (Indian Space Research Organisation) ప్రయోగించిన చంద్రయాన్‌-3 వ్యోమనౌక ఎల్‌వీఎం3-ఎం4 (LVM3-M4) విజయవంతంగా దూసుకెళుతోంది. చంద్రయాన్-3ను శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటల 13 నిమిషాలకు ప్రయోగించిన విషయం తెలిసిందే.

దీనిపై తాజాగా ఇస్రో ఓ అప్‌డేట్ ఇచ్చింది. తొలిసారి చంద్రయాన్-3 వ్యోమనౌక కక్ష్యను విజయవంతంగా పెంచామని ప్రకటన చేసింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఇస్ట్రాక్‌ (ISTRAC – ISRO Telemetry, Tracking and Command Network) కేంద్రం నుంచి ఈ ప్రక్రియను చేపట్టారు.

అనంతరం చంద్రయాన్-3 వ్యోమనౌక 173 * 41, 762 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించిందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం చంద్రయాన్-3 వ్యోమనౌకకు చెందిన వ్యవస్థలన్నీ సజావుగానే పనిచేస్తున్నాయని చెప్పారు.

చంద్రయాన్-3 వ్యోమనౌక 40 రోజులు ప్రయాణించి వచ్చేనెల 23న జాబిలి ఉపరితలంపై అడుగుపెడుతుంది. దక్షిణ ధ్రువం వద్ద విక్రమ్‌ ల్యాండర్‌ దిగే అవకాశం ఉంది. సాఫ్ట్‌ ల్యాండింగ్‌ జరిగితే ఆ ఘనత సాధించిన అమెరికా, రష్యా, చైనా దేశాల జాబితాలో భారత్ చేరుతుంది.

చంద్రయాన్-3 వ్యోమనౌకలో ల్యాండర్, రోవర్ ను ప్రొపల్షన్ మాడ్యూల్ మోసుకెళుతోంది. దాదాపు 40 రోజుల పాటు ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతుంది. కక్ష్యను దశల వారీగా పెంచుతారు. వచ్చే నెల 1న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత దశల వారీగా కక్ష్యను తగ్గిస్తారు.