CM KCR Review: ఇరిగేషన్‌శాఖలో ఒక్క ఖాళీ ఉండొద్దు -సీఎం కేసీఆర్

CM KCR Review: ఇరిగేషన్‌శాఖలో ఒక్క ఖాళీ ఉండొద్దు -సీఎం కేసీఆర్

Cm Kcr

Irrigation Department: ఇరిగేషన్‌శాఖలో ఒక్క ఖాళీ కూడ ఉండొద్దన్నారు సీఎం కేసీఆర్‌. వెంటనే ఖాళీలపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు. 15 లిఫ్టు పనులకు వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. ఇరిగేషన్‌ శాఖపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌.. జూన్‌ 30వ తేదీ లోపు మొదటిదశ చెక్‌డ్యామ్‌లు పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాగునీటి పారుదలశాఖపై సమీక్ష నిర్వహించారు. కృష్ణాబేసిన్‌లో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన లిఫ్టులు, గోదావరి నదిమీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల పురోగతిపై సమావేశంలో చర్చించారు కేసీఆర్.

సాగునీటి ప్రాజెక్టులపై అధికారులకు కీలక సూచనలు చేసిన ముఖ్యమంత్రి.. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో దేవరకొండ నుంచి కోదాడ వరకు సర్కార్‌ నిర్మించ తలపెట్టిన అన్ని లిఫ్టు పథకాల నిర్మాణ అంచనాలను సిద్ధం చేయాలని సూచించారు. జూన్‌ 15వ తేదీ వరకు పూర్తి చేసి టెండర్లు వేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి అధికారులతో సమన్వయ బాధ్యతలను మంత్రి జగదీష్‌రెడ్డికి అప్పగించారు. ఇటీవల నెల్లికల్లులో సీఎం శంకుస్థాపన చేసిన 15 లిఫ్టు ప్రాజెక్టులన్నింటికి అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు కేసీఆర్‌. ఏ లిప్టుకాలిప్టు ప్రకారం అంచనాలను వేరు వేరుగా తయారు చేసి అన్నింటికీ ఒకేసారి టెండర్లు పిలవాలని కోరారు.

తెలంగాణ వరప్రదాయినిగా కాళేశ్వరం ప్రాజెక్టు మారడంతో.. వానాకాలం సీజన్‌ ప్రారంభంకాగానే నీటిని ఎత్తిపోయాలన్నారు. చివరి ఆయకట్టు తుంగతుర్తి వరకు ఉన్న అన్ని చెరువులు, రిజర్వాయర్లు, చెక్‌డ్యాములను నింపాలని సూచించారు. రోహిణికార్తె ప్రారంభమవ్వడంతో నారుమడి సిద్ధం చేసుకునేందుకు నీరు అందించడానికి ఇరిగేషన్‌శాఖ సిద్ధం కావాలన్నారు. కాళేశ్వరం రాడార్‌లో ఉన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నింపాలని ఆదేశించారు. కాల్వల మరమ్మతులు సత్వరమే పూర్తి చేయాలన్నారు.

ఇరిగేషన్‌ శాఖ కృషితో తెలంగాణ సాగునీటిరంగం, వ్యవసాయ రంగం ముఖచిత్రం మారిపోయిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ నేడు పంజాబ్‌ తర్వాత రెండో పెద్ద రాష్ట్రంగా అవతరించిందని చెప్పారు. ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన కరెంట్‌ సరఫరా చేస్తుండడంతో.. సమృద్ధిగా పంటలు పండుతున్నాయని.. ప్రాజెక్టు జలాలతో బోరుబావులు స్థిరీకరించబడ్డాయన్నారు కేసీఆర్. జూన్‌ 30 వరకు మొదటి దశ చెక్‌డ్యామ్‌లు పూర్తి చేయాలని ఆదేశించారు. అదే సమయంలో తాగునీటికి లోటురాకుండా చూసుకుంటూ రిజర్వాయర్లో కనీస నీటిమట్టాన్ని కొనసాగించాలని సూచించారు.

ఎస్‌ఆర్‌ఎస్పీ పునరుజ్జీవనం ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి చివరి ఆయకట్టుకు నీటికొరత లేకుండా చూశామన్నారు కేసీఆర్‌. హుస్నాబాద్‌, మెదక్‌, ఆలేరు, భువనగిరి, జనగామకు మల్లన్న సాగర్‌ వరంగా మారనుందని చెప్పారు. ఇక సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లా బంగారు తునకగా మారుతుందని, దేవాదుల ప్రాజెక్టును నూటికి నూరుశాతం వరంగల్‌ జిల్లాకే అంకితం చేస్తామన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో సాగునీటినందించే ప్రాజెక్టు నిర్వహణ వ్యూహాన్ని ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు.

నిరంతరం డైనమిక్‌గా ఉండే ఇరిగేషన్‌ శాఖలో ఒక్కపోస్టు కూడా ఖాళీగా ఉండరాదని సీఎం అన్నారు. ఎప్పటికప్పుడు అర్హులకు ప్రమోషన్లు ఇస్తూ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఈ మేరకు ఖాళీల నివేదికను అందజేయాలని ఈఎన్సీ మురళీధర్‌రావును సీఎం ఆదేశించారు. కాల్వల నిర్వహణ కోసం త్వరలో లష్కర్లు, జేఈల నియామకాన్ని చేపడుతామని చెప్పారు.