బొల్లారం కెమికల్ ఫ్యాక్టరీలో మళ్లీ మంటలు..

  • Published By: bheemraj ,Published On : December 12, 2020 / 05:23 PM IST
బొల్లారం కెమికల్ ఫ్యాక్టరీలో మళ్లీ మంటలు..

Fire breaks out at Bollaram Chemical Factory : సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని వింధ్య ఆర్గానిక్స్ కెమికల్ ఫ్యాక్టరీలో మళ్లీ అగ్నిప్రమాదం సంభవించింది. కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు అదుపులోకి  వచ్చిన కాసేపటికే మళ్లీ మంటలు చెలరేగాయి. మూడో బ్లాక్ లో కూడా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది, ఎన్ డీఆర్ ఎఫ్ సిబ్బంది మంటలార్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మొత్తంగా కెమికల్ ఫ్యాక్టరీలో మూడు బ్లాకులు ఉండగా ఇప్పటివరకు రెండు బ్లాకులు పేలాయి. తాజాగా మూడో బ్లాక్ లో కూడా మంటలు చెలరేగినట్లుగా సమాచారం అందుతోంది. మూడో బ్లాకులో 12 రియాక్టర్లు ఉన్నాయి.

వింధ్య ఆర్గానిక్స్ లో ఇప్పటివరకు పరిస్థితిలోకి వచ్చింది. మూడో బ్లాక్ కూడా మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని ఊపిరి పీల్చుకునే లోపే మరో బ్లాస్ట్ జరిగింది. పేలుడు ధాటికి మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో అక్కడే ఉన్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఇప్పటికే రియాక్టర్ పేలిన ఘటనలో 8 మందికి గాయాలు అయ్యాయి.

అయితే.. పర్యవేక్షణ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రియాక్టర్‌ మానిటరింగ్ లేదని కార్మికులు చెబుతున్నారు. రియాక్టర్ మెయింటేనెన్స్ సరిగా లేదని కార్మికులు అంటున్నారు. మరోవైపు… కరోనా కారణంగా టెక్నీషియన్ అందుబాటులో లేకపోవడంతో.. టెక్నికల్ నాలెడ్జ్ లేని వ్యక్తితో యాజమాన్యం పనిచేయిస్తోంది. వింధ్యా ఆర్గానిక్స్‌కు ఎన్డీఆర్‌ఎఫ్ బృందం చేరుకున్నది. అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటున్నారు సంగారెడ్డి డీఎస్పీ. ప్రమాదంలో గాయపడ్డ ఎనిమిది మందిలో ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉందని చెప్పారు.

ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో శనివారం (డిసెంబర్ 12, 2020) మొదటగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. వింధ్య ఆర్గానిక్‌ ఫ్యాక్టరీలో రియాక్టర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు కారణంగా కంపెనీలో భారీ శబ్దంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన కార్మికులు కేకలు వేస్తూ… బయటకు పరుగులు తీశారు.

ఈ నేపథ్యంలో కొంతమంది కార్మికులు కిందపడి గాయాలపాలయ్యారు. భయంతో బయటకు పరుగులు తీస్తున్న కార్మికులు, బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా మారింది. కంపెనీ మొత్తం రసాయనాలతో నిండిపోయింది. ప్రమాదస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నాయి.

మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో వింధ్యా ఆర్గానిక్‌ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. రెండు రియాక్టర్లు పేలిపోవడంతో ప్రమాదం తీవ్రతరమైంది. పక్కనే ఉన్న మూడో రియాక్టర్‌కు ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీలోని రియాక్టర్‌ పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.

పేలుడు సమయంలో ఫ్యాక్టరీ లోపల 8 మంది ఉన్నట్లు ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. మధ్యాహ్నం కావడంతో కార్మికులంతా లంచ్‌కు వెళ్లడంతో ప్రాణనష్టం తప్పిందంటున్నారు. వింధ్యా ఫ్యాక్టరీ పరిసరాల్లో పెద్ద ఎత్తున మంటలు అలుముకున్నాయి. శ్వాస తీసుకోవడంలో సిబ్బంది ఇబ్బందిపడుతున్నారు.

ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి. పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు యత్నిస్తోంది. 8 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి, మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఫ్యాక్టరీ మొత్తం రసాయనంతో నిండిపోయింది.

ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ పక్కనే చాలా పరిశ్రమలు ఉన్నాయి. మంటల్ని మిగితా ఫ్యాక్టరీలకి మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. పెద్ద ఎత్తున మంటలు, పొగలు వస్తుండటంతో కార్మికులు ఫ్యాక్టరీలోనికి వెళ్లి పరిస్తితి లేదు. పరిశ్రమ పక్కన ఉన్న మైదానం ప్రాంతానికి కూడా మంటలు వ్యాపించాయి.

వింధ్య ఆర్గానిక్‌ పరిశ్రమలో మొత్తం 120 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 35 మంది చొప్పున మొత్తం మూడు షిఫ్టుల్లో కార్మికులు పనిచేస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు షిఫ్టులో ఉన్న సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే పేలుడు సమయంలో కార్మికులంతా లంచ్‌కి వెళ్లడంతో ప్రాణనష్టం తప్పింది. లేదంటే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే అవకాశం ఉండేది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ఫ్యాక్టరీలో ముందస్తుగా ఫైర్ ప్రికాషన్స్‌ తీసుకోకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని సమాచారం. తరుచూ బొల్లారం పారిశ్రామిక వాడలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.