Income Tax Raids : తెలంగాణలో ఐటీ దాడుల కలకలం.. బీఆర్ఎస్ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు
తెలంగాణలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు టార్గెట్‌గా ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, వ్యాపార కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు.
![Income Tax Raids : తెలంగాణలో ఐటీ దాడుల కలకలం.. బీఆర్ఎస్ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు Income Tax Raids : తెలంగాణలో ఐటీ దాడుల కలకలం.. బీఆర్ఎస్ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు](https://10tv.in/wp-content/uploads/2023/06/IT-Rides.jpg)
IT Rides
IT Raids BRS Leaders Houses : తెలంగాణ (Telangana) లో ఐటీ దాడులు (IT Raids) కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ (BRS) ప్రజాప్రతినిధులు టార్గెట్ ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, వ్యాపార కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఉదయం 6గంటల నుంచి మొత్తం 30 బృందాలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్‌రెడ్డి ఇల్లు, వ్యాపార కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నాయి. నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి చెందిన జేసీ బ్రదర్స్‌లో మాల్స్‌లోనూ ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. అదేవిధంగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసం, కార్యాలయాలపైనా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
Minister Senthil Balaji : ఈడీ అరెస్టుతో భోరున ఏడ్చిన తమిళనాడు మంత్రి ..
భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే నివాసంలో..
భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) ఫైళ్ళ శేఖర్‌రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నాయి. కొత్తపేట్ గ్రీన్ హిల్స్ కాలనీలోని ఎమ్మెల్యే ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఫైళ్ల శేఖర్ రెడ్డి తీర్థ గ్రూప్ పేరుతో రియల్ ఎస్టేట్, మైనింగ్, సోలార్ ఎనర్జీ, లిథియం బ్యాటరీల వ్యాపారాలు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు కర్ణాటకలో పలు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులను తీర్థ గ్రూప్ పూర్తి చేసింది. సౌత్ ఆఫ్రికాలో మైనింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఐటీ అధికారులు హిల్‌ల్యాండ్ టెక్నాలజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్‌లోకూడా సోదాలు చేస్తున్నారు. ఈ రెండు కంపెనీలకు డైరెక్టర్‌గా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి భార్య వనితా కొనసాగుతున్నారు. ఐటీ అధికారులు ఏక కాలంలో 12చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఇన్‌కంట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. తీర్థ గ్రూప్‌కి ఫైళ్ల శేఖర్‌రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ డైరెక్టర్లుగా ఉన్నారు.
జేసీ బ్రదర్స్ మాల్స్‌లో..
నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి చెందిన షాపింగ్ మాల్స్‌లోనూ ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కేపీహెచ్‌బీ కాలనీలోని జేసీ బ్రదర్స్‌లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బుధవారం ఉదయం ఆరు గంటల నుండి సోదాలు కొనసాగుతున్నాయి. జేసీ బ్రదర్స్ మాల్స్ కు సంబంధించి నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, అతని బంధువులు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. జేసీ బ్రదర్స్‌లో జరిగిన లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.
మెదక్ ఎంపీ నివాసంలో..
బీఆర్ఎస్ నేత, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. కొండాపూర్ బోటానికల్ గార్డెన్ దగ్గరలోని విల్లాలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల టార్గెట్‌గా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తుండటంతో తెలంగాణలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.