Electricity Crisis : దేశ వ్యాప్తంగా చీకట్లు తప్పవా ? భయం వద్దంటున్న కేంద్రం

బొగ్గు నిల్వలు సరిపడా ఉన్నాయంటోంది. కానీ, రాష్ట్రాల్లో పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.

Electricity Crisis : దేశ వ్యాప్తంగా చీకట్లు తప్పవా ? భయం వద్దంటున్న కేంద్రం

India Coal

India Faces Electricity Crisis: దేశంలో విద్యుత్‌ ఇబ్బందులు ఏమీ ఉండబోవని చెబుతోంది కేంద్రం. బొగ్గు నిల్వలు సరిపడా ఉన్నాయంటోంది. కానీ, రాష్ట్రాల్లో పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బొగ్గు కొరత కారణంగా విద్యుత్‌ కేంద్రాలు మూతపడ్డాయి. పంజాబ్‌లో మూడు, కేరళలో నాలుగు, మహారాష్ట్రలో 13  థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు కేవలం బొగ్గు కొరత కారణంగానే మూతపడ్డాయి. బొగ్గు కొరత భయాలు రాష్ట్రాలను వెంటాడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం అలాంటి పరిస్థితులేవీ లేవని చెబుతోంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన బొగ్గు కేటాయింపులు జరుపుతామని భరోసా ఇస్తోంది.

Read More : India-China: బలగాల ఉపసంహరణపైనే.. భారత్‌, చైనా 13వ రౌండ్‌ చర్చలు

ప్రజలకు హెచ్చరికలు : –
మరోపక్క, తమ రాష్ట్రాల్లో విద్యుత్‌ సంక్షోభం ముంచుకొస్తుందనే ఆందోళనతో బొగ్గు సరఫరాను పెంచాల్సిందిగా కర్ణాటక, పంజాబ్‌ ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కోరుతున్నారు. విద్యుత్‌ను జాగ్రత్తగా వాడుకోవాలని మహారాష్ట్ర విద్యుత్‌ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. కేరళ అయితే… ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరిస్తోంది. ప్రధాని జోక్యం చేసుకొని, బొగ్గు, గ్యాస్‌ను మళ్లించడం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కోరుతున్నారు. ఢిల్లీలో విద్యుత్‌ కొరత లేదని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌ అంటున్నారు. బొగ్గు సరఫరా కొనసాగుతోందని, దేశంలో రోజు వారీ అవసరాలకు అనుగుణంగా ముందస్తు నాలుగు రోజులకు సరిపడా  బొగ్గు నిల్వలు ఉన్నాయని చెబుతున్నారు. అనవసరంగా ఈ విషయంలో రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని అన్నారు.

Read More : Haryana : పెళ్లి ఉంది..కారును మెళ్లిగా పొమ్మన్నారు, ఇద్దరిని చంపేశాడు

నిండుకుంటున్న బొగ్గు నిల్వలు : –
కేంద్ర విద్యుత్‌ అథారిటీ డాటా ప్రకారం.. థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లలో రోజు రోజుకు బొగ్గు నిల్వలు నిండుకుంటున్నాయి. దీని కారణంగా విద్యుత్‌ కొరత తప్పదని భావిస్తున్నారు. అక్టోబరు 5 నాటి లెక్కల ప్రకారం… దేశంలోని బొగ్గు ద్వారా విద్యుదుత్పత్తి చేసే 135 థర్మల్‌ ప్లాంట్లలో 106 ప్లాంట్లలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. వాటిలో వారం రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. కానీ, కేంద్రం మాత్రం బొగ్గు సరఫరా నిరంతరం కొనసాగుతోందని అంటోంది. మరోపక్క గ్యాస్‌ సరఫరా కూడా జరుగుతోందని చెబుతోంది. కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ స్టేట్‌మెంట్‌ ప్రకారం.. దేశంలో బొగ్గు నిక్షేపాలు అపారంగా ఉన్నాయి.

Read More : Dasara Festival 2021 : కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ

చీకట్లు తప్పవా ? : –
తక్కువ నిల్వలు ఉన్నంత మాత్రాన విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోతుందని కాదని, ఇది నిరంతరం సాగే ప్రక్రియ అని తెలిపింది. మరోపక్క, మహారాష్ట్రలో 13 థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు బొగ్గు కొరత కారణంగా మూతపడ్డాయి. విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని రాష్ట్ర విద్యుత్‌ శాఖ ప్రజలను కోరింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని, ఏసీలు.. ఇతరత్రా వినియోగాన్ని తగ్గించుకోవాలని రాష్ట్ర విద్యుత్‌ శాఖ సూచించింది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఈసారి భారీ వర్షాలు కురవడం వల్ల బొగ్గు తవ్వకాల్లో అంతరాయం ఏర్పడింది. బొగ్గు తరలింపులో కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీనివల్ల బొగ్గును దిగుమతి చేసుకుంటున్న విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు సగాని కంటే తక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇదే సమయంలో బొగ్గు ధర కూడా ఎక్కువగా ఉంది. పరిస్థితులు ఇలానే కొనసాగితే దేశవ్యాప్తంగా చీకట్లు తప్పవనే ఆందోళన వ్యక్తం అవుతోంది.