Corona Second Wave : షాకింగ్.. దేశంలో రోజుకు 3ల‌క్ష‌ల కేసులు, మే చివ‌రి వ‌ర‌కూ తీవ్రత

కరోనావైరస్ సెకండ్ వేవ్ గురించి దేశంలోని టాప్ వైరాల‌జిస్ట్‌ల‌లో ఒక‌రైన డాక్ట‌ర్ షాహిద్ జ‌మీల్ బాంబు పేల్చారు. ప్రజల వెన్నులో వణుకు పుట్టించే విషయం చెప్పారాయన. క‌రోనా సెకండ్ వేవ్ దేశంలో మే చివ‌రి వ‌ర‌కూ కొన‌సాగ‌వ‌చ్చని చెప్పారు. అంతేకాదు రానున్న రోజుల్లో కేసుల సంఖ్య రోజుకు 3 ల‌క్ష‌లను కూడా తాక‌వ‌చ్చన్నారు.

Corona Second Wave : షాకింగ్.. దేశంలో రోజుకు 3ల‌క్ష‌ల కేసులు, మే చివ‌రి వ‌ర‌కూ తీవ్రత

Covid 2nd Wave

Corona Second Wave : కరోనావైరస్ సెకండ్ వేవ్ గురించి దేశంలోని టాప్ వైరాల‌జిస్ట్‌ల‌లో ఒక‌రైన డాక్ట‌ర్ షాహిద్ జ‌మీల్ బాంబు పేల్చారు. ప్రజల వెన్నులో వణుకు పుట్టించే విషయం చెప్పారాయన. క‌రోనా సెకండ్ వేవ్ దేశంలో మే చివ‌రి వ‌ర‌కూ కొన‌సాగ‌వ‌చ్చని చెప్పారు. అంతేకాదు రానున్న రోజుల్లో కేసుల సంఖ్య రోజుకు 3 ల‌క్ష‌లను కూడా తాక‌వ‌చ్చన్నారు. దేశంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త కేసుల సంఖ్య 2లక్షలకు చేరువగా(1,84,372) న‌మోదైన విష‌యం తెలిసిందే. దీనిపై జ‌మీల్ స్పందించారు. కేసులు రోజురోజుకూ పెరుగుతున్న రేటు చాలా భ‌య‌పెడుతోందన్నారు. రోజుకు 7 శాతం మేర యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. ఇది చాలా చాలా ఎక్కువని, దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఇది ఇలాగే కొన‌సాగితే.. రోజుకు 3 ల‌క్ష‌ల వ‌ర‌కూ కూడా కేసులు పెర‌గ‌వ‌చ్చని జ‌మీల్ హెచ్చరించారు.

అమెరికా తర్వాత ఇండియానే:
అమెరికా త‌ర్వాత ఒక్క రోజులో ఈ స్థాయి కేసులు న‌మోదైన దేశం ఇండియానే. వైర‌స్ కొత్త మ్యూటెంట్లు ఇన్ఫెక్ష‌న్ల సంఖ్య‌ను చాలా వేగంగా పెంచుతున్నాయ‌ని జ‌మీల్ అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే దేశంలో వ్యాక్సిన్ల కొర‌త ఉన్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను మాత్రం ఆయ‌న ఖండించారు. ఇప్ప‌టికే సీర‌మ్‌, భార‌త్ బ‌యోటెక్ క‌లిపి 31 నుంచి 32 కోట్ల వ‌ర‌కు వ్యాక్సిన్ డోసుల‌ను త‌యారు చేశాయ‌ని, అందులో ఇప్ప‌టి వ‌ర‌కూ కేవ‌లం 12 కోట్ల వ‌ర‌కూ మాత్ర‌మే ఇచ్చిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. మ‌రో ఆరున్న‌ర కోట్ల డోసుల‌ను ఎగుమ‌తి చేసినా.. మ‌రో ప‌ది కోట్ల వ‌ర‌కూ వ్యాక్సిన్ డోసులు దేశంలో ఉన్నాయ‌న్నారు. దేశంలో వ్యాక్సిన్ కొర‌త లేద‌ని జ‌మీల్ స్ప‌ష్టం చేశారు.

వ్యాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం:
ఇండియాలో వ్యాక్సినేష‌న్ ప్రారంభించిన స‌మ‌యంలో కేసుల సంఖ్య త‌గ్గిపోయింద‌ని, ఆ స‌మ‌యంలో అంద‌రూ కొవిడ్ ఇక వెళ్లిపోయిన‌ట్లు భావించార‌ని ఆయ‌న అన్నారు. దీంతో చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవ‌డం ఎందుకని నిర్ల‌క్ష్యం వ‌హించార‌ని, వ్యాక్సిన్ తీసుకోవాల్సిన స‌మ‌యంలో తీసుకోలేద‌ని జమీల్ చెప్పారు. ఈ నిర్లక్ష్యమే ఇప్పుడు ప్రమాద ఘంటికలు మోగిస్తోందని అభిప్రాయపడ్డారు.

కరోనా పట్ల అజాగ్రత్తగా ఉండొద్దని ఆయన ప్రజలను కోరారు. కరోనా నిబంధనలు అందరూ కచ్చితంగా పాటించాలని సూచించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా పాటించాలన్నారు.

కరోనా కరాళ నృత్యం:
దేశంలో మహారాష్ట్రతో పాటు అనేక రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 1,84,372 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి 1 ,027 మందిని బలితీసుకుంది. మరణాలు 1000 మార్కును దాటడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి. ఇప్పటివరకు కోటీ 38 లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా.. 1,72,085 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఒక్కరోజే వెయ్యికిపైగా మరణాలు, 1.84లక్షల కేసులు..
గడిచిన 24 గంటల్లో యాక్టివ్ కేసులు భారీగా పెరిగాయి. ప్రస్తుతం 13,65,704 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. యాక్టివ్ కేసుల రేటు 9.24 శాతానికి చేరింది. నిన్న ఒక్కరోజే 82వేల 339 మంది కొవిడ్ నుంచి కోలుకోగా..మొత్తం రికవరీలు 1,23,36,036(89.51 శాతం)కి చేరాయి. ఫిబ్రవరి మధ్యలో రికవరీ రేటు 97 శాతానికి పైబడిన సంగతి తెలిసిందే. ఇప్పుడది దారుణంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక, కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 26కోట్ల మార్కును దాటినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇక మహారాష్ట్రలో కరోనా విజృంభణ తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. అక్కడ నిన్న(ఏప్రిల్ 13,2021) ఒక్క రోజే 60 వేలకుపైగా కేసులు.. 281 మరణాలు చోటుచేసుకున్నాయి.

మరోవైపు, దేశవ్యాప్తంగా నిన్న 26,46,528 మందికి కరోనా టీకాలు అందించారు. దాంతో ఇప్పటివరకు టీకాలు తీసుకున్న వారి సంఖ్య 11,11,79,578కి చేరింది.