Satvik Death Case: శ్రీచైతన్య కాలేజీ‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య .. ప్రభుత్వం సీరియస్.. ముగ్గురి సిబ్బందిపై కేసు నమోదు

హైదరాబాద్ శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ చైతన్య కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. కళాశాలకు చెందిన చెందిన సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.

Satvik Death Case: శ్రీచైతన్య కాలేజీ‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య .. ప్రభుత్వం సీరియస్.. ముగ్గురి సిబ్బందిపై కేసు నమోదు

Student Sathvik Case

Satvik Death Case: హైదరాబాద్ శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ చైతన్య కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. కళాశాలకు చెందిన చెందిన సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. సాత్విక్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో క్లాస్ రూంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, కొనఊపిరితో ఉన్న సాత్విక్‌ను కాలేజీ సిబ్బంది కనీసం పట్టించుకోలేదని, ఆస్పత్రికి తరలించేందుకు కూడా కాలేజీ సిబ్బంది రాలేదని పలువురు విద్యార్థులు తెలిపారు. దీంతో తోటి విద్యార్థులు బయట వెహికల్‌ని లిఫ్ట్ అడిగి ప్రాణాప్రాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సాత్విక్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేర్పించే‌లోపే సాత్విక్ మరణించాడు.

 

పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సాత్విక్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సాత్విక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ విషయంపై నార్సింగ్ ఏసీపీ రమణగౌడ్ మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి శ్రీచైతన్య ఇంటర్ కాలేజ్ క్యాంపస్‌లో సాత్విక్ అనే స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడని తెలిపారు. పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదుతో కాలేజ్ యాజమాన్యం ఫ్యాకల్టీ ఆచార్య, కృష్ణారెడ్డి, వార్డెన్‌లపై ఐపీసీ 305 కింద కేసు నమోదు చేశామని అన్నారు. సాత్విక్ డెడ్ బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించామని చెప్పారు. గతంలో ఫ్యాకల్టీ స్టూడెంట్స్‌ని కొట్టిన వీడియోస్ ఇచ్చారని, వాటిపైన దర్యాప్తు చేస్తున్నామని, కళాశాల నిర్లక్ష్యం ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని నార్సింగ్ ఏసీపీ తెలిపారు.

 

కళాశాల యాజమాన్యం ఒత్తిడి కారణంగానే నా బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడని సాత్విక్ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. కళాశాల యాజమాన్యం తీరుకు నిరసనగా విద్యార్థులతో కలిసి సాత్విక్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థులను కళాశాల యాజమాన్యం టార్చర్ పెడుతుందని, విద్యార్థులపై ఒత్తిడి పెంచడం సరికాదని సాత్విక్ తల్లిదండ్రులు వాపోయారు. విద్యార్థి ఆత్మహత్య ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకోవాలని, పోలీసులు తమ దర్యాప్తును కొనసాగించాలని మంత్రి ఆదేశించారు. వీలైనంత తొందరగా విచారణ నివేదిక అందించాలని నవీన్ మిట్టల్ కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.