Bihar Politics: లాలూ తనయుడు సంచలన నిర్ణయం.. వివాదానికి అసలు కారణమేంటి?
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, ఆర్జేడీ నాయకుడు, ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో ఆర్జేడీకి రాజీనామా చేస్తానని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు...

Taj Prathap Yadav
Bihar Politics: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, ఆర్జేడీ నాయకుడు, ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో ఆర్జేడీకి రాజీనామా చేస్తానని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, తమ్ముడు తేజస్వి యాదవ్, తల్లి రబ్రీ దేవి, మిసా భారతిని కూడా ట్యాగ్ చేశారు. ఈ సందర్భంగా పలు విషయాలను ట్విటర్లో ప్రతాప్ యాదవ్ వెల్లడించారు. ఆర్జేడీలో నేను మా నాన్న అడుగుజాడల్లో నడిచానని, పార్టీలో అందరికీ గౌరవం ఇచ్చానని తెలిపాడు. త్వరలోనే మా నాన్నను కలిసి రాజీనామా లేఖను సమర్పిస్తానని తెలిపాడు. అయితే తేజ్ ప్రతాప్ కేవలం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తారా? లేక ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారా అన్న విషయంపై స్పష్టత లేదు.
मैं अपने पिता के नक्शे कदम पर चलने का काम किया । सभी कार्यकर्ताओं को सम्मान दिया जल्द अपने पिता से मिलकर अपना इस्तीफा दूंगा ।@laluprasadrjd @RJDforIndia @yadavtejashwi @RabriDeviRJD @MisaBharti @Chiranjeev_INC
— Tej Pratap Yadav (@TejYadav14) April 25, 2022
అంతకుముందు సోమవారం ఉదయం ఆర్జేడీ పాట్నా మెట్రోపాలిటన్ అధ్యక్షుడు రామ్‌రాజ్ యాదవ్ తేజ్ ప్రతాప్ యాదవ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈనెల 22న మాజీ సీఎం రబ్రీదేవి నివాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ వింధు సందర్భంగా తేజ్ ప్రతాప్ ఓ గదిలో తనను బంధించి కొట్టినట్లు రామ్ రాజ్ యాదవ్ ఆరోపించారు. ఆరోపణలు చేసిన కొద్ది గంటల్లోనే ట్విటర్లో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని పేర్కొంటూ తేజ్ ప్రతాప్ యాదవ్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. మరికొద్ది సేపటికే ఫేస్ బుక్ లో పోస్టుతో ఆర్జేడీ శ్రేణుల్లో తేజ్ ప్రతాప్ మరో ఆసక్తిని కలిగించాడు. తన తల్లి రబ్రీ దేవి ఒడిలో పడుకోగా, తేజ్ తలను రబ్రీదేవి సర్దుతున్నట్లు ఉన్న ఫోటోను ఉంచాడు. వారిద్దరు ఫొటోలో సంతోషంగా ఉన్నారు, ఈ క్రమంలో రామ్‌రాజ్ యాదవ్ చేసిన ఆరోపణలన్నింటినీ కుట్రగా పేర్కొన్నారు. సోమవారం అర్ధరాత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ తన ఫేస్‌బుక్ పేజీలో విద్యార్థి సంస్థ జనశక్తి పరిషత్ నాయకుడి వీడియోను పంచుకున్నారు. తన కుటుంబాన్ని విభజించాలనుకునే వారి కుట్రలు సాగవంటూ పేర్కొన్నాడు.
Lalu Prasad Yadav : లాలూ ప్రసాద్ యాదవ్ కు మళ్లీ అస్వస్థత..ఢిల్లీ ఎయిమ్స్ లో అత్యవసర చికిత్స
ఇదికాకుండా తేజ్ ప్రతాప్ యాదవ్ కు ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడు జగదానంద్ సింగ్ కు మధ్య ఘర్షణ జరుగుతున్నట్లు తెలుస్తుంది. రాజీనామా చేస్తానని ప్రకటించడం ద్వారా జగదానంద్ సింగ్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ప్రతాప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాల వ్లలనే తేజ్ ప్రతాప్ యాదవ్ రాజీనామా నిర్ణయం తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది. పార్టీలో కొందరు తనను లెక్కపెట్టడం లేదన్న భావనలో ప్రతాప్ యాదవ్ ఉన్నారని, ఈ క్రమంలో రాజీనామా అస్త్రంతో అందరిని లైన్ లోకి తెచ్చుకోవచ్చని ప్రతాప్ యాదవ్ భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ప్రతాప్ యాదవ్ ట్వీట్ బిహార్ లోని ఆర్జేడీలో రాబోయే కాలంలో ఎన్నిమార్పులకు కారణమవుతుందో, లాలూ ప్రసాద్ యాదవ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.